హైదరాబాద్ మెట్రోపై గెజిట్ నోటిఫికేషన్ ప్రభావం?
posted on Sep 24, 2014 @ 8:08PM
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై నిన్న కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ గెజిట్ తెలంగాణా ప్రభుత్వానికి చాలా మేలు చేస్తుందని కొందరు, చాలా ఇబ్బందికరంగా మారుతుందని మరి కొందరి వాదన. మేలు చేస్తుందనే వారిలో ఈ ప్రాజెక్టు మేనేజింగ్ డైరక్టర్ యాన్.వీ.యస్. రెడ్డి కూడా ఒకరు.
ఇంతకాలం ఈ ప్రాజక్టు ‘ట్రామ్ వె చట్టం’ క్రింద నిర్మిస్తునందున రైల్వే భద్రతా అధికారులు దీని భద్రత ప్రమాణాలను పర్యవేక్షించి, దృవీకరించేందుకు నిరాకరిస్తున్నారని, కానీ ఇప్పుడు ఈ గెజిట్ ద్వారా ఈ ప్రాజెక్టు కేంద్రం పరిధిలోకి వెళ్లిపోయింది కనుక వారు ఇక ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయరని ఆయన తెలిపారు. రైల్వే భద్రతాధికారులు కూడా ఆయనతో ఏకీభవిస్తున్నారు. ఇకపై ఈ ప్రాజెక్టు డిజైన్ (రూట్ మ్యాప్)లో మార్పులు చేయవలసి వస్తే, దానికి కేంద్రం అనుమతి అవసరం కనుక, ఇక ఎవరూ కూడా తెలంగాణా ప్రభుత్వాన్ని నిందించలేరని మరి కొందరి అభిప్రాయం. కానీ డిజైన్ మార్పుకి అనుమతుల మంజూరులో జాప్యం అనివార్యమవుతుందని వారు అంగీకరిస్తున్నారు.
ఇక నుండి ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండబోదు కనుక డిజైన్ మార్చాలనే దాని ప్రయత్నాలు వమ్మయినట్లేనని మరికొందరి వాదన. ప్రాజెక్టు డిజైన్ మార్చకుండా యధాతధంగా ముందుకు సాగినట్లయితే, హైదరాబాద్ పాత బస్తీలో అనేక మశీదులు, దర్గాలు ఆశుర్ ఖానాలు, పురాతన భవంతులు కూల్చివేయవలసి ఉంటుంది. కానీ అది సాధ్యమయ్యే పని కాదు కనుక తప్పనిసరిగా కారిడార్-2లో మజ్లిస్ పార్టీ సూచిస్తున్న విధంగా డిజైన్లో మార్పులు చేయవలసి ఉంటుంది. మజ్లిస్ పార్టీని ఆగర్భ శత్రువుగా భావించే బీజేపీ దాని ప్రతిపాదనలకు తలొగ్గుతుందని ఎవరూ భావించరు.
ఒకవేళ తెలంగాణా ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అంగీకరించినా, ఈ తంతంగం అంతా పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నపుడే అనేక విషయాలలో నిర్ణయం తీసుకోవడానికి చాలా జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన యల్.యండ్.టీ. సంస్థ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో బాటు కేంద్రం కూడా దీనిపై నిర్ణయాలు తీసుకొంటూ, అనుమతులు మంజూరు చేయవలసి వస్తే ఏవిధంగా స్పందిస్తుందో ఊహించడం కష్టం కాదు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతున్న కొద్దీ నిర్మాణ వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంటుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు తమకు లాభదాయకం కాదని, ప్రభుత్వం దీనిని చేపడితే తాము తప్పుకొనేందుకు సిద్దంగా ఉన్నామని లేఖ వ్రాసిన యల్.యండ్.టీ. సంస్థ ప్రాజెక్టు డిజైన్ మార్పుకు అంగీకరించక పోవచ్చును. ఒకవేళ అంగీకరించినా కేంద్రం అనుమతులు జాప్యం అయితే తట్టాబుట్టా సర్దుకోవచ్చును.
ఏమయినప్పటికీ ఈ నోటిఫికేషన్ పై ఆ సంస్థ ఇంతవరకు స్పందించలేదు. స్పందిస్తే ఈ మెట్రో ప్రయాణం ఏవిధంగా సాగబోతోందో అర్ధమవుతుంది.