అందుకే బీజేపీకి తెలంగాణాలో నో ఎంట్రీ
అందుకే బీజేపీకి తెలంగాణాలో నో ఎంట్రీ తెలంగాణాలో తనకు వేరే ఏ పార్టీ నుండి పోటీ ఉండకూడదనే తెరాస కోరిక గురించి అందరికీ తెలిసిందే. కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది సాధ్యం కాదు కనుక, అందుకు వేరే మార్గం ఏదో ఆలోచించవలసి వస్తుంది. అందుకే తెదేపాపై ఆంద్ర పార్టీ ముద్ర, కాంగ్రెస్, బీజేపీలపై తెలంగాణా వ్యతిరేఖ ముద్రవేసి తెరాస వాటిని ఎన్నికలలో ఓడించగలిగింది. కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు మూడు కూడా తెరాసకు చివరి నిమిషం వరకు కూడా ముచ్చెమటలు పట్టించిన విషయాన్ని ఎవరూ కాదనలేరు.
ఎన్నికల తరువాత తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో పార్టీని మరింత బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తానని ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా అదేమాట చెప్పారు. ఆ తరువాత తెదేపా, బీజేపీ అధ్యక్షులు ఇద్దరూ తమ రెండు పార్టీల మధ్య స్నేహం ఇక ముందు కూడా ఇదేవిధంగా కొనసాగుతుందని తేల్చి చెప్పారు. అలాగ చెప్పడమే కాక మెదక్ ఉప ఎన్నికలలో ఒకవేళ బీజేపీ తన అభ్యర్ధిని నిలిపినట్లయితే మద్దతు ఇస్తామని తెదేపా అధ్యక్షుడు ప్రకటించారు. తెలంగాణాలో తమ పార్టీకి పోటీయే ఉండకూడదని భావిస్తున్న తెరాసకు ఇది జీర్ణించుకోవడం కష్టమే.
బహుశః అందుకే తెలంగాణా హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి మాట్లాడుతూ, తెదేపా, బీజేపీలకు తెలంగాణాలో స్థానం లేదని ప్రకటించారు. ఆయన తెదేపాకు ఆంద్ర పార్టీ ముద్ర తగిలించగలిగారు. కానీ జాతీయ పార్టీ అయిన బీజేపీకి అటువంటి ముద్ర తగిలించడం సాధ్యం కాదు కనుక, దానిని పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలపడంతో ముడిపెట్టి, అటువంటి పార్టీకి తెలంగాణాలో స్థానం లేదని నాయిని వారు ఒక సరికొత్త వాదన అందుకొన్నారు. ఆంధ్రాలో కలిపిన ఆ ఏడూ మండలాలను తిరిగి తెలంగాణాకు అప్పగించేవరకు బీజేపీకి తెలంగాణాలో స్థానం లేదని ప్రకటించారు. అదెలాగు సాధ్యం ఇప్పుడు కాదు కనుక ఇక బీజేపీకి కూడా తెలంగాణాలో అడుగుపెట్టే వీలులేదని నాయిని వారి అభిప్రాయం, కోరిక కూడా.
అయితే ఆయన రెండు విషయాలు మరిచిపోయారు. ఆ ఏడూ మండలాలు ఆంధ్రాకు చెందినవి కనుకనే అక్కడ సర్వే నిర్వహించలేదని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పిన సంగతి నాయిని వారి దృష్టికి వచ్చినట్లు లేదు. ఇక అందరికీ తెలిసిన మరో విషయం ఏమిటంటే పోలవరం ముంపు ప్రాంతలను ఆంధ్రాలో కలుపుతూ గత యూపీయే ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ఎన్డీయే అమలు చేసింది. దానికి పార్లమెంటు ఆమోదముద్ర కూడా వేసింది. అటువంటప్పుడు ఇప్పుడు నాయిని వారు మళ్ళీ ఆ ముంపు గ్రామాలను తెలంగాణాకు అప్పజెప్పాలని, లేకపోతే బీజేపీకి తెలంగాణాలో స్థానం లేదని వాదించడం హాస్యాస్పదమే.
అయినా మరో ఐదేళ్ళ వరకు ఎన్నికలు లేవు. అప్పటికి తెలంగాణాలో రాజకీయ పార్టీల బలాబలాలు, సమీకరణాలు, పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో ఎవరికీ తెలియదు. అటువంటప్పుడు ఇప్పటి నుండే ఇతర పార్టీలకు తెలంగాణాలో ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టడం వలన ఉపయోగం ఏమిటి? ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో తెరాస ఆ పని చేసినా, కాంగ్రెస్, తెదేపా-బీజేపీలు మూడు కలిసి తెరాసకు ముచ్చెమటలు పట్టించాయి కదా? ఒకవేళ వచ్చే ఎన్నికలలో కూడా తెరాసయే మళ్ళీ అధికారంలోకి రావాలంటే, ప్రజలకు వాగ్దానం చేసిన ప్రకారం రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తే అప్పుడు ప్రజలే ఇతర పార్టీలకు తెలంగాణాలో ‘నో ఎంట్రీ’ బోర్డు పెడతారు. ఆ విషయాన్ని నరేంద్ర మోడీ గుజరాత్ లో నిరూపించి చూపారు కూడా.