కొత్త రాజధాని అమరావతి?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడ పరిసరాల్లోనే వుంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయవాడ పరిసరాల్లో ఏ వైపున రాజధాని అభివృద్ధి చెందే అవకాశం వుందా అన్న ఆలోచన అందరిలోనూ వుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడ సమీపంలోని అమరావతి అవుతుందని తెలుస్తోంది. విజయవాడ పరిసరాల్లోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే అమరావతే రాజధాని ఏర్పాటుకు సరైన ప్రాంతం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమరావతి పరిసరాల్లో అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్‌భవన్... ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సరిపడా ప్రభుత్వ భూములు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కృష్ణాతీరంలో వున్న అమరావతిని రాజధానిగా చేయడం వల్ల రాజధానికి నీటి సమస్య వుండదని కూడా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.   అమరావతి ప్రాంతమే రాజధాని అనడానికి బలం చేకూర్చే ఒక మ్యాప్ వెలుగులోకి వచ్చింది. అమరావతి ప్రాంతం మీద ట్రాఫిక్ ఒత్తిడి పడకుండా రింగ్ రోడ్లను ప్లాన్ చేశారు. విజయవాడ పరిసరాలు మొత్తం అభివృద్ధి చెందేలా, అమరావతి మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసేలా ఈ ప్రణాళిక వుంది.   అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని కాబోతోందన్న అభిప్రాయాలకు బలం చేకూర్చే విధంగా ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ సర్వేకి ఆదేశాలు జారి చేసింది. ఈ ప్రాంతంలో భూములకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అలాగే అమరావతిని ఆంధ్రప్రదేశ్‌కి రాజధానిని చేసిన తర్వాత ఆ ప్రాంతంలో రవాణా సదుపాయాలను పెంచడానికి కూడా ప్రభుత్వం ఇప్పటికే పక్కా ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కృష్ణానదిపై రెండు భారీ వంతెనలను నిర్మించడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.అమరావతి ప్రాంతంలో పెద్ద గోల్ఫ్ కోర్సును కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది.   అమరావతిని కొత్త రాజధాని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడం వెనుక కారణాలను పరిశీలకులు వివరిస్తున్నారు. అమరావతిని రాజధాని చేయడం వల్ల విజయవాడ నగరం మీద ఒత్తిడి బాగా తగ్గుతుంది. అధికారిక కార్యకలాపాలు జరిగే అమరావతి ప్రాంతలో ఎక్కువ ట్రాఫిక్ జంజాటం వుండదు. దీనితోపాటు మరెన్నో అనుకూల అంశాలు వుండటం వల్లనే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. వీటన్నిటితోపాటు మరో ముఖ్యమైన అంశం కూడా వుందని పరిశీలకులు భావిస్తున్నారు. బౌద్ధ సంస్కృతి విలసిల్లిన అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అభివృద్ధి చేసినట్టయితే లక్షల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడానికి సిద్ధంగా వున్నట్టు బౌద్ధ గురువు దలైలామా రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే బౌద్ధాన్ని పాటించే జపాన్ కూడా అమరావతి రాజధాని అయినట్టయితే రాజధాని అభివృద్ధికి భారీ స్థాయిలో సహకరిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. ఇన్ని మంచి కారణాల వల్ల అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తారని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి చావు లేదు: శ్రీనివాస్

  మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చావు లేదని, దానిని ఎవరూ ఎన్నటికీ పూర్తిగా తుడిచిపెట్టేయలేరని అన్నారు. తెలంగాణా భావోద్వేగాల కారణంగానే తెరాస అధికారంలోకి వచ్చింది తప్ప లేకుంటే తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే తెలంగాణాలో తప్పకుండా అధికారంలోకి వచ్చి ఉండేదని అన్నారు. ఇప్పడు కాకపోయినా ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికలలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. చింత చచ్చినా పులుపు చావదన్నట్లు ఉన్నాయి ఆయన మాటలు. అయితే కాంగ్రెస్ పార్టీకి చావు లేదనే మాట మాత్రం నూటికి నూరుశాతం నిజమని అంగీకరించవలసిందే. కాంగ్రెస్ పార్టీ ఈ ఆరు దశాబ్దాలలో ఇటువంటి ఘోర పరాభవాలు చాలానే చూసింది. కానీ సజీవంగానే ఉంటూ మళ్ళీ ఎప్పుడో అప్పుడు అధికారం హస్తగతం చేసుకోగలుగుతోంది. అందుకు మంచి ఉదాహరణగా కర్నాటక రాష్ట్రాన్ని చెప్పుకోవచ్చును. దాదాపు రెండు దశాబ్దాలుగా కర్నాటకలో కాలు మోపలేకపోయిన కాంగ్రెస్ పార్టీ, గతేడాది జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి రాగలిగింది.   అందువల్ల తెలంగాణాలో కూడా శ్రీనివాస్ చెప్పినట్లు ఐదేళ్ళ తరువాత కాకపోయినా మరో పదో పదిహేనేళ్ళ తరువాత కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. కేంద్రంలో కూడా ఇంచుమించు అదే పరిస్థితి ఉంది కనుక రాహుల్ గాంధీకి ఇక జీవితంలో ఎన్నడూ ప్రధానమంత్రి అయ్యే అవకాశం దక్కకపోవచ్చును. ఇక ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ ఈ ఐదేళ్ళలో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తే దానికి మళ్ళీ వచ్చే ఎన్నికలలో కూడా ప్రజలు పట్టం కట్టవచ్చును. లేకుంటే అందుకోసం జగన్మోహన్ రెడ్డి కాసుకొని కూర్చొని ఉన్నారు కనుక అక్కడా మరో పదేళ్ళ వరకు అవకాశం దక్కకపోవచ్చును. కానీ శ్రీనివాస్ చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీకి చావు లేదని అర్ధమవుతోంది కనుక అది ఎన్ని దశాబ్దాలయినా అది అధికారం కోసం ఎదురుచూడగలదని అందరూ అంగీకరించక తప్పదు.

ఓ మూడు-నాలుగు లక్షల కోట్లు ఇవ్వండి!

  ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం దాదాపు 1.2 లక్షల కోట్లు అవసరం ఉంటుందని ప్రాధమికంగా ఒక అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రమే ఆ భారం మొత్తం భరించాలని కోరుతోంది. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఆ మొత్తాన్ని 3 నుండి 4 లక్షల కోట్లకు పెంచుతూ కేంద్రానికి కొత్త ప్రతిపాదనలు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు, అందుకు గల కారణాలతో కూడిన ఒక నివేదిక సిద్దం చేస్తోంది.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మరియు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఈ శుక్రవారం తిరుపతి సందర్శించేందుకు వస్తున్న ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ వేణుగోపాల రెడ్డిని కలిసి, వచ్చే సం.ఏప్రిల్ నుండి మొదలయ్యే 14వ ఫైనాన్స్ కమీషన్ సం.లో ఈ ప్రతిపాదనలను మంజూరు చేయవలసిందిగా కోరబోతున్నారు.   ఇంతకాలం కేవలం రాజధాని నిర్మాణం కోసం అయ్యే వ్యయం గురించి మాత్రామే మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇకపై రాష్ట్ర విభజన కారణంగా ప్రధాన ఆర్ధిక వనరుగా నిలుస్తున్న హైదరాబాదును కోల్పోవడం వల్ల ఏర్పడిన ఆర్ధిక లోటు, విభజన కారణంగా రాష్ట్రానికి ఏర్పడిన ఇతర సమస్యలు, నష్టాలు వాటిని పూడ్చుకోనేందుకు అవసరమయిన సొమ్ము గురించి కూడా తన తాజా నివేదికలో చేర్చబోతోంది. ఇవే కారణాలతో ఇంతవరకు కేంద్రం నుండి రాష్ట్రానికి వస్తున్న 32శాతం సెంట్రల్ టాక్సులను, ఇకపై 50శాతానికి పెంచవలసిందిగా కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదివరకు యూపీయే ప్రభుత్వం కూడా రాష్ట్రానికి 40శాతం వాటా చెల్లించమని 14వ ఫైనాన్స్ కమీషన్ న్ను కోరిన విషయం ఈ సందర్భంగా గుర్తుచేసి తమ అభ్యర్ధనను మన్నించమని కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.   రాజధాని, దానితో బాటు హైదరాబాదులో ఉన్నట్టి అన్ని ఉన్నత విద్యా, వైద్య, ప్రభుత్వ రంగ సంస్థలను ఆంద్రప్రదేశ్ లో ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం 3 నుండి 4 లక్షల కోట్లు అవసరం ఉంటుంది గనుక కేంద్రం ఆ మొత్తాన్ని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకొంటోంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలెవరూ కూడా రాష్ట్ర విభజనకు అంగీకరించకపోయినప్పటికీ, గత యూపీయే ప్రభుత్వమే తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ప్రజాభీష్టానికి వ్యతిరేఖంగా బలవంతంగా రాష్ట్ర విభజన చేసింది గనుక, కేంద్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం పూర్తి బాధ్యత వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరబోతోంది.   అయితే రాష్ట్ర ప్రభుత్వంలాగే కేంద్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసేపరిస్థితిలో ఉందా లేదా? ఉన్నా అంత భారీ మొత్తం మంజూరు చేస్తే ఇతర రాష్ట్రాల నుండి కూడా అటువంటి డిమాండ్లు వచ్చే అవకాశం ఉంటుంది గనుక అంత భారీగా నిధులు మంజూరు చేస్తుందా లేదా?వంటి అనుమానాలు ఉండనే ఉన్నాయి. ఏమయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నలోపం లేకుండా కృషి చేయడం మంచి విషయమే.

జగన్ పై 11వ చార్జ్ షీటు దాఖలు చేసిన సీబీఐ

  జగన్మోహన్ రెడ్డిపై ఇప్పటికే పది చార్జ్ షీట్లు దాఖలు చేసిన సీబీఐ ఈ రోజు తాజాగా మరో చార్జ్ షీట్ దాఖలు చేయడం విశేషం. షరా మామూలుగానే ఇది కూడా క్విడ్ ప్రో కేసే, ఇందులో కూడా జగన్, విజయ సాయి రెడ్డి ఇద్దరూ పద్మ, ద్వితీయ స్థానాలలో నిందితులుగా పేర్కొనబడ్డారు. ఈ కేసులో శ్యాం ప్రసాద్ రెడ్డికి చెందిన ఇందూ హౌసింగ్ ప్రాజెక్టు సంస్థకు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేత ఉదారంగా అనేక హౌసింగ్ ప్రాజెక్టులు మంజూరు చేయించగా, ఇందూ సంస్థ ఆ ఋణం ఉంచుకోకుండా ఇందూ సంస్థ జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థలలో భారీ పెట్టుబడులు పెట్టిందని సీబీఐ చార్జ్ షీటులో ఆరోపించింది. క్లుప్తంగా ఇదీ కేసు.    చార్జ్ షీట్ దాఖలు చేయడం వరకే సీబీఐ పని. ఆ తరువాత మళ్ళీ అది ఎప్పుడు విచారణకు వస్తుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే మార్చ్ 2002లో సీబీఐ దాఖలు చేసిన మొదటి చార్జ్ షీటుకే ఇంతవరకు మోక్షం రాలేదు. కనుక ఈ 11వ చార్జ్ షీటు ఎప్పుడు విచారణకు వస్తుందో, దానిపై వాదనలు ఎప్పుడు పూర్తవుతాయో, కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుందో చెప్పడం ఎవరితరమూ కాదనే చెప్పవచ్చును.

సారీ! కమ్యూనికేషన్ గ్యాప్! లక్ష కాదు ఆరు లక్షలు...

  మెదక్ లోక్ సభ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధిగా నిలబడిన జగ్గారెడ్డికి తెలంగాణా తెదేపా నేతలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పూర్తి సహకారం అందిస్తూ ఆయన తరపున చాలా చురుకుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ, ఆయనపై తెరాస వేసిన సమైక్యవాది ముద్రను మాత్రం ఎంత ప్రయత్నించినా వదిలించుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి అయితే ఒక దశలో సహనం కోల్పోయి జగ్గారెడ్డిని సమైక్యవాది అన్నవారిని చెప్పుతో కొడతానని హెచ్చరించారంటే, దాని గురించి వారు ఎంతగా మదనపడుతున్నారో అర్ధమవుతుంది. జగ్గారెడ్డికి వ్యతిరేఖంగా తెరాస చేస్తున్న ఈ సమైక్య ప్రచారం ప్రజలపై చాలా ప్రభావం చూపించవచ్చు గనుక అది తమ అభ్యర్ధి విజయావకాశాలను దెబ్బ తీయవచ్చని తెదేపా, బీజేపీ నేతలు చాలా ఆందోళన చెందుతున్నారు.   తెరాస అభ్యర్ధిగా పోటీ చేస్తున్నకె. ప్రభాకర్ రెడ్డి విజయానికి కృషి చేస్తున్న మంత్రి కే. హరీష్ రావు ఇప్పుడు ఆయన విజయంపై చాలా నమ్మకంతో ఉన్నారు. ఒట్టి విజయమే కాదు కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తామని డంకా భజాయించి మరీ చెపుతున్నారు. ఇదే అదునుగా తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు హరీష్ రావును ఇరుకున పెట్టేందుకు “మీ అభ్యర్ది కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో గెలవకపోతే మీరు రాజకీయ సన్యాసం స్వీకరిస్తారా?” అని ఒక సవాలు విసిరారు. దానిని తను స్వీకరిస్తున్నట్లు హరీష్ రావు ప్రకటించడమే కాక, “ఒకవేళ తమ అభ్యర్ధి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచినట్లయితే మీరు రాజకీయ సన్యాసం స్వీకరిస్తారా?” అని ఎదురు సవాలు కూడా విసిరేసరికి, ఎర్రబెల్లి కంగు తిన్నారు.   హరీష్ రావు అంత నమ్మకంగా తమ అభ్యర్ధి లక్ష ఓట్లతో గెలుస్తారని చెపుతున్నప్పుడు, తెగించి ఆయన సవాలును స్వీకరిస్తే, బీజేపీ అభ్యర్ధి సంగతలా ఉంచి ముందు తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడుతుందని గ్రహించిన ఎర్రబెల్లి తన సవాలుకు మరికొంచెం సవరణ చేసి, “నేను చెప్పింది హరీష్ రావు సరిగ్గా వినట్లు లేదు. నేను ఆరు లక్షల మెజార్టీతో గెలవాలని సవాలు విసిరితే ఆయన కేవలం లక్ష ఓట్లు మెజార్టీకి సిద్దమంటున్నారు. ఈ ఎన్నికలలో తెరాస అభ్యర్ధి జగ్గారెడ్డి చేతిలో ఘోరపరాజయం పొందుతారనే భయంతోనే బహుశః ఆయన ఆవిధంగా వెనక్కి తగ్గి ఉండవచ్చును. నేను మాత్రం నేటికీ నా మాట మీదనే నిలబడి ఉన్నాను. ఆయన కూడా అందుకు సిద్దమయితే అందుకు నేను సిద్దమే,” అని సవరణ ప్రకటన చేసారు.   అయితే తెరాస నేత హరీష్ రావు తమ అభ్యర్ధి కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని నమ్మకంగా చెపుతుంటే, ఎర్రబెల్లి అతనిని తాము ఏవిధంగా ఓడిస్తామో మాట్లాడకుండా, అతని మెజార్టీ గురించి ఈవిధంగా పందేలు కాయడం గమనిస్తే, తెరాస అభ్యర్ధి గెలుపుపై తెరాస నేతల కంటే తెదేపా, బీజేపీ నేతలకే ఎక్కువ నమ్మకంగా ఉన్నట్లుంది. ఏమయినప్పటికీ వారిరువురి వాదోపవాదాలు చూస్తుంటే పోటీ ప్రధానంగా ఆ రెండు పార్టీల మధ్యే సాగేలా కనబడుతోంది.

మెదక్ లోక్ సభ ఉప-ఎన్నికలలో చతికిలబడిన కాంగ్రెస్

  మెదక్ లోక్ సభ ఉప ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మూడు ప్రధాన పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు జోరందుకొంటున్నాయి. కాంగ్రెస్ తరపున సునీత లక్ష్మా రెడ్డి, తెరాస తరపున కే.ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా జగ్గారెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. వీరి ముగ్గురిలోకి కాంగ్రెస్ అభ్యర్ధి సునీత లక్ష్మా రెడ్డి ఇంతకాలం అవిబాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినందున ఆమెకే రాజకీయ అనుభవంతో తోడు పరిపాలనా అనుభవం కూడా ఉన్నందున సహజంగానే మిగిలిన అభ్యర్ధులపై ఆమెదే పైచేయిగా ఉండాలి. కానీ అధికార తెరాస ప్రచారం, దాని ప్రభావం ముందు కాంగ్రెస్ నేతల ప్రచారం వెలవెలబోతోంది. కారణం నేటికీ వారు ‘తెలంగాణా ఇచ్చింది, తెచ్చింది మేమే’ వంటి అసంబద్దమయిన ప్రచారానికే పరిమితమవుతున్నారు తప్ప, అధికార తెరాస పార్టీ వైఫల్యాలను సమర్ధంగా ఎత్తి చూపలేకపోతున్నారు. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం ఈమూడు నెలలలో తమ ప్రభుత్వం సాధించిన ఘనకార్యాల గురించి చాలా బాగా ప్రచారం చేసుకొంటూనే, ఇంత కాలం రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణాకు ఏమి ఒరగబెట్టిందని ఎదురు ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీని చాలా సమర్ధంగా నిలువరించగలుగుతున్నారు.   “ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ, దాని తెలంగాణా నేతలు కూడా తెలంగాణాకు అన్యాయం చేశారు గనుకనే తెరాస పోరాడి తెలంగాణా సాధించుకోవలసి వచ్చింది కదా? అందుకే టీ-కాంగ్రెస్ నేతలు కూడా ప్రత్యేక తెలంగాణా కోసం పోరాడవలసి వచ్చింది కదా? అటువంటప్పుడు కాంగ్రెస్ నేతలు తమ పార్టీ తెలంగాణాకు ఏదో మేలు చేసిందని ఏవిధంగా చెప్పుకొంటున్నారు?” అని తెరాస నేతల వాదన. వారి ఈ వాదనకు, ప్రశ్నలకు కాంగ్రెస్ నేతల వద్ద సరయిన జవాబు లేదు. కనీసం తెలంగాణా ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై ప్రజలముందు నిలదీయలేక చతికిలపడుతుండటంతో కాంగ్రెస్ నేతలు ‘తెలంగాణా ఇచ్చింది, తెచ్చింది మేమే’ అనే ప్రచారానికే పరిమితం కావలసివస్తోంది. ఏమయినప్పటికీ అధికారంలో ఉంటే ఆ ఆత్మవిశ్వాసమే వేరు.

పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం

  పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లు విజయవాడ వద్ద రాజధాని నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అక్కడ భూములపై భారీగా పెట్టుబడులు పెట్టిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు అది తమకు కాసుల వర్షం కురిపించబోతోందని సంతోషంతో ఎగిరి గంతులు వేస్తుంటే, రెక్కాడితే కాని డొక్కాడని వేతన జీవులు, అద్దె కొంపల్లో రోజులు వెళ్ళదీస్తున్నబడుగు, మధ్యతరగతి ప్రజల జేబులు చిల్లుపెడుతోందని ఆవేదన చెందుతున్నారు.   అయితే అంతమాత్రాన్న వారు విజయవాడవద్ద రాజధాని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేఖించడం లేదు. కానీ ఆ పేరుతో పెరిగిపోయిన భూముల ధరలు, ఇళ్ళ అద్దెలను నియంత్రించని అధికారుల ఉదాసీనతను వారు తప్పు పడుతున్నారు. స్వంత ఇల్లు కట్టుకోవాలనే తమ కలలు ఇక ఎన్నటికీ కలలుగానే మిగిలిపోవడమే కాకుండా కనీసం ఇప్పుడు అద్దె కొంపల్లో జీవనం కూడా కష్టమయిపోతోందని మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   మూడు నాలుగు నెలల క్రితం నెలకు మూడు వేలు అద్దె ఉండే ఇళ్ళు ఇప్పుడు ఒకేసారి నాలుగు నుండి ఐదు వేలకి పెంచేయడంతో మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు. అదేవిధంగా ఇల్లు కట్టుకొందామనో లేకపోతే కనీసం అపార్ట్ మెంటులో చిన్న ఫ్లాటయినా కొనుకొందామనో బ్యాంకు లోన్లు తీసుకొనే సాహసం కూడా చేయలేకపోతున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఈవిధంగా ఉంటే, రాజధాని నిర్మాణం మొదలయిన తరువాత పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందేమో!   శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో ఈ సమస్యలను కూడా ప్రస్తావించింది. అందువలన రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ చుట్టూ కనీసం ఒక్క ఏడాదిపాటు భూముల ధరలు, ఇంటి అద్దెలు పెరగకుండా నియంత్రించగలిగితే అందరూ హర్షిస్తారు.

సింగపూరో, చికాగో ఏదయినా ముందు డబ్బులు కావాలి కదా

    విజయవాడ వద్ద ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించుకోవడంతో తమను సంప్రదించకుండా నిర్ణయం తీసుకొన్నందుకు కాంగ్రెస్, వైకాపాలు మొదట అధికార పార్టీపై విమర్శలు గుప్పించినా, విజయవాడకే అవి కూడా మొగ్గు చూపాయి. ఆ తరువాత సింగపూరా లేక చికాగో నమూనాలో నిర్మించాల అనే దానిపై కూడా ఆసక్తికరమయిన చర్చ కూడా మొదలయింది.   ఒక అమెరికా సంస్థ ప్రతినిధులు వచ్చి చికాగో నమూనాలో కృష్ణా నదికి ఇరువైపులా రాజధానిని నిర్మిస్తే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బొమ్మేసి (పవర్ పాయింట్ ప్రెజంటేషన్ అన్న మాట) చూపించారని, ఆయన కూడా దానిని ‘లైక్’ చేశారని మీడియా వాళ్ళు రాసుకొంటుంటే, ఈలోగా సింగపూరు వాళ్ళు కూడా రంగంలో దిగి, ఆరేళ్ళ క్రితం తమ సంస్థ చైనాలో ‘టియాన్ జిన్’ అనే పర్యావరణ స్నేహపూరితమయిన పట్టణాన్ని ఏవిధంగా నిర్మించామో అదేవిధంగా విజయవాడలో కూడా రాజధానిని నిర్మిస్తామని చంద్రబాబుకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తాజా సమాచారం. బహుశః త్వరలోనే మరికొన్ని దేశాల సంస్థల ప్రతినిధులు స్కెచ్ వేసి చూపించేందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు.   అయితే అన్నిటి కంటే ముందు తేల్చుకోవలసిన విష్యం ఏమిటంటే రాజధాని నిర్మాణానికి భూముల సమీకరణ ఎప్పటిలోగా పూర్తవుతుంది? వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా, ఎప్పటిలోగా నిధులు సమీకరించుకొంటుంది? రాజధాని నిర్మాణ పనుల కోసం కేంద్రం ఎప్పుడు ఎంత మొత్తం విడుదల చేస్తుందనే విషయాలు దృవీకరించుకొన్న తరువాతనే రంగంలో దిగడం అన్ని విధాల మంచిది. లేకుంటే చివరికి కాగితాల మీద స్కెచ్చులు, కంప్యూటర్లలో బొమ్మలే చూసుకొని తృప్తిపడవలసి వస్తుంది.   రాజధాని నమూనా కోసం మంత్రులతో కూడిన ఒక కమిటీ, భూసేకరణ కోసం మరో ఉప కమిటీ కూడా వేసింది కనుక బహుశః ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం తెర వెనుక ఈ పనులన్నీ గట్టిగానే చేస్తోందని అనుకోవలసి ఉంటుంది.   నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సింగపూరుకు చెందిన బిల్డింగ్ అండ్ కంస్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు తమ సంస్థ చైనాలో కేవలం ఆరు సం.లలో ‘టియాన్ జిన్’ అనే పట్టణాన్ని నిర్మించామని తెలిపారు. రాజకీయాలకు తావులేని చైనా వంటి క్రమశిక్షణగల దేశంలో ఒక పట్టణం నిర్మించడానికి ఆరేళ్ళు పడితే, ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడానికే అలవాటు పడిన మనదేశంలో అది కూడా ఇన్ని సమస్యలు, పరిమితుల మధ్య సింగపూరో లేకపోతే చికాగో తరహాలో రాజధాని ఏర్పాటుకి ఎన్నేళ్ళు పడుతుందో ఎవరి ఊహకీ అందని విషయం.   ఈ ఐదేళ్ళలో కొత్త రాజధానికి కొంత మేరయినా రూపురేఖలు తేగలిగినట్లయితే అది అధికార పార్టీ సమర్ధతకు, కార్యదీక్షకు మచ్చు తునకగా నిలుస్తుంది.కానీ మాటలు కార్యరూపం దాల్చకపోయినట్లయితే అది వచ్చే ఎన్నికలలో ప్రధాన అంశంగా మారడం తద్యం. కనుక ఈ విషయంలో చాలా చురుకుగా పనిచేయాల్సి ఉంటుందని అధికార పార్టీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు జ్ఞాపకం ఉంచుకోవడం చాలా అవసరం. 

బీసీల సంక్షేమం కోసం తీర్మానం ఆమోదం

  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీసీలకు తెలుగుదేశం పార్టీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అందరికీ తెలుసు. అందుకు ప్రతిగా బీసీలు కూడా ఆపార్టీకి మద్దతుగా నిలవడంతో ఎన్నికలలో తెదేపా ఘనవిజయం స్వంతం చేసుకొంది. ఎన్నికల సమయంలో అంతకు ముందు పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన ప్రకారం ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల చివరి రోజయిన శనివారం నాడు చంద్రబాబు స్వయంగా బీసీల ప్రయోజనాలను కాపాడేందుకు ఒక తీర్మానం ప్రవేశ పెట్టారు. బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు కేటాయించవలసిందిగా కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన ఆ తీర్మానాన్ని సభ ఆమోదించింది.   ఈ తీర్మానంలో ముఖ్యాంశాలు: 1. బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. 2. బీసీలకు రాజ్యాంగంలో తగిన హోదా కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి. 3. దేశంలో బీసీ జనాభా ఎంతుందో ఖచ్చితంగా తెలుసుకొనేందుకు సర్వే నిర్వహించాలి. 4. కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. ఉప ప్రణాళికలో బీసీలకు కనీసం 25 శాతం నిధులు కేటాయించాలి. 5. బీసీలకు ఉద్యోగాలలోనే కాక పదోన్నతులలో కూడా రిజర్వేషన్ల సౌకర్యం కల్పించాలి.

శాసనసభలో జగన్ కు మరోసారి భంగపాటు

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ షరా మామూలుగానే ముందూ వెనుక చూసుకోకుండా అత్యుత్సాహానికి పోయి అధికార పార్టీని తప్పుపట్టబోయి, అధికార పార్టీ చేతిలో మరోమారు భంగపడ్డారు.   ఈరోజు కొంచెం ఆలస్యంగా శాసనసభకు వచ్చిన జగన్, అజెండాలో లేని బీసీ తీర్మానంపై ఏవిధంగా చర్చిస్తున్నారని, అసలు ప్రతిపక్షానికి ఎందుకు తెలియజేయలేదంటూ అధికార పార్టీపై విరుచుకు పడ్డారు. ప్రతీరోజూ అధికారపార్టీ సభ్యులు తనకు నియమ నిబంధనలు తెలియవని సభలో అందరి ముందు ఎద్దేవా చేస్తుండటంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఈరోజు తనకు ఆ విమర్శలను త్రిప్పికొట్టే అవకాశం దొరికిందని సభలో చెలరేగిపోయారు. కానీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన జవాబుతో ఆయన కంగుతిన్నారు.   యనమల ఏమన్నారంటే, “మీరు సభకు ఆలస్యంగా వచ్చి సభలో ఏమి జరుగుతోందో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. మమ్మల్ని విమర్శించేముందు కనీసం సభలో ఉన్న మీ పార్టీ సభ్యులను అడిగి తెలుసుకొన్నా బాగుండేది. కానీ సభా నియమాలు ఏమీ తెలుసుకోకుండా, బీసీ తీర్మానంపై చర్చ మొదలయిన తరువాత మధ్యలో ప్రవేశించి అది అజెండాలో లేదు కనుక దానిని మళ్ళీ మొదలుపెట్టమని అడగటం సభా నియమాల పట్ల మీకు అవగాహన లేదని స్పష్టంజేస్తోంది,” అని ఘాటుగా బదులిచ్చారు.   కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా, అజెండా కాపీని చూపిస్తూ "దీనిలో ఈరోజు ఈ తీర్మానంపై చర్చిస్తామని ఎక్కడ వ్రాసి ఉందో చెప్పమంటూ" ఆయనను నిలదీసారు. “సభలో ఉన్న ప్రతిపక్షానికి తెలియపరచకుండా ఏవిధంగా చర్చ చేప్పట్టారు? అది ఏ నియమ నిబంధనల క్రింద వీలుపడుతుందో చెప్పమంటూ” చాలా ఆవేశంగా ప్రశించారు. కానీ ఆవిధంగా ప్రశ్నించి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరోమారు యనమల చేతిలో భంగపడక తప్పలేదు.   యనమల ఆయన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “ఈరోజు సభా సమావేశాలు మొదలయ్యే ముందే మేము స్పీకర్ గారిని ఈ అంశాన్ని అజెండాలో చేర్చమని కోరి ఈ అంశంపై చర్చకు అనుమతి కూడా తీసుకొన్నాము. ఆ విషయాన్ని స్పీకర్ గారు మీ సభ్యులకు కూడా తెలియజేసారు. కానీ మీరు ఇదేమీ తెలుసుకోకుండా మధ్యలో ప్రవేశించి అజెండాలో ఈ అంశం లేదు కనుక చర్చ జరగడానికి వీలులేదనో లేకపోతే మళ్ళీ మొదటి నుండి చర్చించాలని కోరడం మంచి పద్ధతి కాదు. ఇటువంటి ఆదేశాలు మీరు మీ పార్టీ సభ్యులకు మీ లోటస్ పాండ్ నివాసంలో నిరభ్యంతరంగా ఇచ్చుకోవచ్చును. కానీ ఇది మీ లోటస్ పాండ్ నివసమూ కాదు. ఇక్కడ జరుగుతున్నది మీ పార్టీ సమావేశం కాదు. కనుక సభలో మాట్లాడే ముందు విషయం తెలుసుకొని, సభా నియమ నిబంధనలు క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ఆ తరువాతనే మాట్లాడితే ఇటువంటి పరిస్థితి ఎదురవదు,” అని జవాబిచ్చారు.   అప్పుడు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కూడా కలుగజేసుకొని, ఈ రోజు అజెండాలో బీసీ తీర్మానం ప్రవేశపెట్టి దానిపై చర్చకు అనుమతి తీసుకొందని, ఆవిషయాన్ని సభలో ఉన్న ప్రతిపక్ష సభ్యులకు కూడా తాను ముందే తెలియజేసానని, కనుక దీనిపై అనవసర రాద్దాంతం చేయవద్దని జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు.   కానీ జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.  నోటిమాటగా తీర్మానం ప్రవేశపెట్టేందుకు, దానిపై చర్చ జరిపేందుకు స్పీకరును అనుమతి కోరడం నియమ నిబంధనలకు విరుద్దమని, అది ఏ నిబంధన క్రింద వీలవుతుందో తనకు చెప్పాలని యనమలను నిలదీశారు. అది కూడా మళ్ళీ జగన్ కు మరోసారి చేదు అనుభవమే మిగిల్చింది.   ముఖ్యమంత్రి చంద్రబాబు లేచి మాట్లాడుతూ ‘మంత్రులు ఏదయినా ఒక ముఖ్యమయిన అంశంపై సభలో చర్చ జరగాలని భావిస్తే వారు స్పీకరును నోటిమాటగా అనుమతి కోరవచ్చును. స్పీకరు అనుమతిస్తే దానిని అజెండాలో చేర్చకుండానే సభలో సభ్యులందరికీ తెలియజేసి దానిపై స్పీకర్ చర్చ చేప్పట్టవచ్చును. ఈ నియమం గురించి తెలుసుకోకుండా ప్రతిపక్ష నాయకుడికి  మాకు నియమ నిబంధనల గురించి పాటాలు నేర్పిస్తున్నారు,” అని జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేసారు.   ఆ తరువాత మాట్లాడిన యనమల రామకృష్ణుడు, ఆవిధంగా చర్చకు అనుమతించే నియమ నిబంధనలను రూల్ బుక్ లో నుండి చదివి వినిపించారు. రూల్ బుక్ క్షుణ్ణంగా చదువుకోమని జగన్ కు సలహా కూడా ఇచ్చారు.   ఇంత అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్న తరువాత ఎవరయినా సభలో మళ్ళీ మాట్లాడేందుకు జంకుతారు. కానీ జగన్ మాత్రం ఏ మాత్రం సిగ్గుపడకుండా అధికారపార్టీ సభ్యులు సభలో ప్రతిపక్ష పార్టీ గళం వినిపించకుండా చాలా నియంతృత్వంగా, ఏ మాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించి మళ్ళీ మరో కొత్త సమస్యను కోరి తెచ్చుకొన్నారు. ఆయన ‘అధికార పార్టీ సభ్యులకు మానవత్వం’ లేదని అనడం అన్-పార్లమెంటరీ పదమని యనమల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆ తరువాత కొద్ది సేపు దానిపై కూడా వారిరువురి మధ్య వాదోపవాదాలు సాగాయి.   మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అనుభవలేమి కారణంగా సభలో చాలా దుందుడుకుగా వ్యవహరిస్తూ అధికార పార్టీని ఇబ్బందిపెట్టబోయి చివరికి తనే వారి చేతిలో పదేపదే భంగపడుతున్నారు. అయినప్పటికీ ఆయన తన తీరు మార్చుకోకపోవడం చాలా ఆశ్చరం కలిగిస్తుంది.

రామచంద్రయ్యకు కాంగ్రెస్ తప్పులు కనబడవా?

  ఈరోజు శాసనమండలిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై జరిగిన చర్చలో మాజీ మంత్రి సి.రామచంద్రయ్య మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా విజయవాడలో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని తప్పు పట్టారు. అసలు ఇంత హడావుడిగా రాజధానిని ప్రకటించవలసిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఆయన రాయలసీమ ప్రజలకు చాలా అన్యాయం చేసారని ఆరోపించారు. నిజమే! రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తెసుకొన్నాక రాజధానిపై నిర్ణయం తీసుకొని ఉండి ఉంటే ఎవరూ తప్పు పట్టే అవకాశం ఉండేది కాదు.   రామచంద్రయ్య ముఖ్యమంత్రిపై చేసిన విమర్శలకు బహుశః నేడో రేపో తెదేపా తగిన జవాబు చెప్పవచ్చును. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈరోజు అయన అధికార పార్టీని ఏమని విమర్శిస్తున్నారో, రాష్ట్ర విభజన సందర్భంగా ప్రతిపక్షాలు, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని సరిగ్గా అదేవిధంగా విమర్శించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మొండిగా రాష్ట్రవిభజన చేసింది.   కాంగ్రెస్ అధిష్టానం కేవలం రాష్ట్ర ప్రజలనే కాదు, తమ పార్టీకే చెందిన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు, యంపీలపట్ల చాలా అవమానకరంగా వ్యవహరించిన విషయం అందరికీ తెలుసు. కాంగ్రెస్ అధిష్టానం చేసిన పనికి కేవలం రాష్ట్ర ప్రజలే కాదు, అనేకమంది కాంగ్రెస్ నేతల రాజకీయ భవిష్యత్ కూడా సర్వ నాశనం అయింది. అప్పుడు కూడా మిగిలిన కాంగ్రెస్ నేతలెవరూ కూడా అధిష్టానానికి వ్యతిరేఖంగా నోరు మెదిపే సాహసం చేయలేకపోయారు.   పార్లమెంటులో ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ యంపీలను స్వయంగా కాంగ్రెస్ అధిష్టానమే ఆంధ్రా కాంగ్రెస్ యంపీలపైకి ఉసిగొల్పినపుడు రామచంద్రయ్య వంటి కాంగ్రెస్ నేతలెవరూ కూడా నోరు మెదపలేకపోయారు. ఆంధ్రాలో లక్షాలాది ప్రజలు రోడ్లమీదకు వచ్చి రాష్ట్ర విభజన వద్దని ఉద్యమాలు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంటు తలుపులు, కిటికీలు మూసివేసి, టీవీ ప్రసారాలు నిలిపివేసి విభజన బిల్లును మూజు వాణిఓటుతో ఆమోదింపజేసినప్పుడు రామచంద్రయ్య వంటి కాంగ్రెస్ నేతలు ఎక్కడ దాకొన్నారో ఎవరికీ తెలియదు.   మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే రాష్ట్రవిభజనను వ్యతిరేఖిస్తూ అధిష్టానానికి వ్యతిరేఖంగా పోరాడుతుంటే, ఈ కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా ఆయనకు అండగా నిలబడలేదు. పైగా రాష్ట్ర విభజన చేస్తున్న తమ కాంగ్రెస్ అధిష్టానాన్ని వెనకేసుకు వస్తూ తిరిగి ఆయననే విమర్శించేవారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక్క యంపీ, యం.యల్యే సీటు కూడా దక్కకుండా ఓడించి బుద్ది చెప్పారు. కనీసం అప్పుడయినా కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ కూడా జరిగిన దానికి రాష్ట్ర ప్రజలను క్షమాపణ కోరలేదు. కనీసం ఇంతవరకు పశ్చాతాప పడినట్లయినా కనబడలేదు.   కానీ, ఇప్పుడు ప్రజలెనుకొన్న రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో చర్చించి తీసుకొన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి సభాముఖంగా ప్రకటించిన తరువాత దానిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా స్వాగతించారు. ఆ తరువాత దానిపై ఉభయసభలలో చర్చ కూడా జరిగింది. ఆ చర్చలోనే రామచంద్రయ్య ఈ విమర్శలు చేసారు. ఇవన్నీ ఆయన మరిచిపోయి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడం హాస్యాస్పదం

నరేంద్ర మోడీకి పాక్ ప్రధాని మామిడిపళ్ళ సందేశం

  భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య గొప్ప సంబంధాలు ఎప్పుడూ లేవు. అందుకు పాకిస్తాన్నే నిందించక తప్పదు. భారత్ ఎప్పుడూ కూడా పాకిస్తాన్ కు స్నేహస్తం అందిస్తూనే ఉంది. కానీ పాక్ ప్రభుత్వంపై సైన్యం, ముస్లిం చాంధసవాదుల పెత్తనం చేస్తుండటంతో భారత్ తో బలమయిన స్నేహ సంబంధాలు పెంచుకోవాలని పాక్ ప్రభుత్వాధినేతలు కోరుకొంటునప్పటికీ వీలుపడటం లేదు. అందుకే ఇరుదేశాలకు స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినా వాటి మధ్య ఇంతవరకు పటిష్టమయిన స్నేహ సంబంధాలు ఏర్పడలేకపోయాయి.   మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు పటిష్టం కోవాలనే ఆలోచనతో, పాక్ ప్రధానిని తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించడం, ఆయన దానిని మన్నించి రావడం, ఆ తరువాత ఇరువురు ప్రధానులు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వరకు అంతా సవ్యంగానే సాగిపోయింది. కానీ మళ్ళీ షరా మామూలుగానే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సేనలు పదేపదే భారత జవాన్లపై, సరిహద్దు గ్రామాలపై కాల్పులకి తెగబడటంతో, రెండు దేశాల నడుమ చిగురిస్తున్న స్నేహ పుష్పం వడిలిపోవడం మొదలయింది.   భారత్ లో పాకిస్తాన్ హై కమీషనర్ అబ్దుల్ బాసిత్, భారత ప్రభుత్వం వారిస్తున్నా వినకుండా డిల్లీలోనే కాశ్మీరు వేర్పాటువాదులతో సమావేశం అవడంతో, ఉభయదేశాల విదేశాంగశాఖ కార్యదర్శుల స్థాయిలో జరగవలసిన సమావేశం భారత్ ఏకపక్షంగా రద్దు చేసుకోవడం ద్వారా పాక్ తీరుకు తన నిరసన, ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి సరిహద్దులలో కాల్పులు తిరిగి మొదలయినప్పుడే భారత ప్రభుత్వం ఆ పని చేసిఉండేది. కానీ సహనంతో ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. రెండు దేశాల మధ్య స్నేహ పుష్పం వికసిస్తున్న ప్రతీసారి దానికి ముగింపు ఇంచుమించుగా ఇలాగే ఉండటానికి కారణం ముందే చెప్పుకొన్నాము.   పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత ప్రధాని మోడీతో కొంచెం సన్నిహితమవుతున్నట్లు సూచనలు కనబడగానే, ప్రతిపక్ష నేతలు ఇమ్రాన్ ఖాన్ మరియు తహీరుల్ ఖాద్రీల నేతృత్వంలో అకస్మాత్తుగా తిరుగుబాటు మొదలయింది. వారిరువురు నవాజ్ షరీఫ్ వెంటనే ప్రధాని పదవిలో నుండి దిగిపోవాలంటూ ప్రజలతో కలిసి పార్లమెంటును, ప్రధాని నివాసాన్ని ముట్టడించి ఆందోళన చేస్తున్నారు. అయితే అందుకు వారు చెపుతున్న కారణాలు వేరు. వారిరువురినీ పాకిస్తాన్ సైన్యంలో మత ఛాందసవాదులయిన సైనికాధికారులే నడిపిస్తున్నారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందుకే నేటికీ వారిరువురినీ పాక్ సైన్యం ఉపేక్షిస్తోంది. ప్రజాసమస్యలను సాకుగా చూపి పాకిస్తాన్ లో ప్రభుత్వాలను నేరుగానో లేదా ఈవిధంగా పరోక్షంగానో కూలద్రోయడం పాక్ సైన్యానికి అలవాటే.బహుశః ఇప్పుడు కూడా అదే జరుగుతోందని భావించవచ్చును.   అయితే ఇంత జరిగినా, జరుగుతున్నా పాకిస్తాన్ ప్రధాని భారత్ తో స్నేహ సంబంధాలు పునరుద్దరించుకోవాలని తాపత్రయపడటం చాలా మంచి ఆలోచనే. ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి, ప్రధాని మోడీకి మరియు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు భారత్ లో తమ అధికారుల ద్వారా పాకిస్తాన్ లో సుప్రసిద్దమయిన సింద్రీ, చౌస రకం అత్యుత్తమ మామిడి పళ్ళను బహుమతిగా పంపించారు. తద్వారా భారత్ తో తిరిగి సత్సంబంధాలు నెలకొల్పుకోవాలనే తన బలమయిన కోరికను వ్యక్తం చేసారు. బహుశః మోడీ ప్రభుత్వం కూడా అందుకు సానుకూలంగా స్పందించవచ్చును. కానీ పాక్ ప్రభుత్వంపై పాక్ సైన్యం, మత ఛాందసవాదుల పెత్తనం కొనసాగుతున్నంత కాలం భారత్-పాక్ సంబంధాలు మూడడుగులు ముందుకీ మూడడుగులు వెనక్కీ సాగుతూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోవచ్చును.

ఇల్లలకగానే పండగ కాదు

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి రోజు, మంచి ముహూర్తం వగైరాలన్నీ సరిచూసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని విజయవాడ వద్ద ఏర్పాటు చేయబోతున్నట్లు నిన్న శాసనసభలో ప్రకటించారు. ఇంతవరకు ఈ అంశంపై జరిగిన రాజకీయాలు, చర్చలు, లెక్కలు ఒక ఎత్తయితే, ఇక ముందు జరుగబోయేవన్నీ మరో ఎత్తు. రాజధానిపై రాయలసీమ ప్రజల అభ్యంతరాలు, రాజధాని నిర్మాణం కోసం అవసరమయిన భూసేకరణ, దానికి నిధులు, రాజధాని రూపురేఖలు, అవసరమయిన సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ కార్యక్రమాలు, కాలపరిమితి వంటివి చాలానే ఉన్నాయి. వీటిలో మొదటి మూడు సమస్యలను ప్రభుత్వం సమర్ధంగా పరిష్కరించగలిగితే రాజధాని నిర్మాణం గురించి ఆలోచించవచ్చును. వీ.జీ.టీ.యం. పరిధిలో దాదాపు 45,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ చెప్పిన మాట వాస్తవమయితే, ఇక ప్రభుత్వం భూసేకరణ, దాని కోసం నిధుల సమీకరణ గురించి పెద్దగా ఆలోచించనవసరం ఉండదు. బహుశః అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ పరిసర ప్రాంతాలలో రాజధానిని ఏర్పాటు చేస్తామని దైర్యంగా ప్రకటించి ఉండవచ్చును.   ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ అవి ఆక్రమణకు గురయ్యాయని రెవెన్యూ శాఖే స్వయంగా చెప్పినట్లు సమాచారం. అదే నిజమయితే, ఆభూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ చాలా ప్రయాసపడకతప్పదు. దాని వలన రాజధాని నిర్మాణపనులలో జాప్యం అనివార్యం కావచ్చును. కానీ చాలా దూరదృష్టితో ఆలోచించే అలవాటున్న చంద్రబాబు నాయుడు భూసేకరణపై ఎంతో కొంత స్పష్టత ఉన్న కారణంగానే బహుశః విజయవాడ వద్ద రాజధాని ఏర్పాటు ప్రకటన చేసి ఉండవచ్చును. ఆయన అందుకోసం ప్రత్యేకంగా మంత్రులతో కూడిన ఒక ఉప కమిటీని వేశారు కూడా.   భూసేకరణ కంటే ముందే మొదలయ్యే మరో అధ్యాయం నిధుల సమీకరణ. ఈ మూడు నెలలలో విజయవాడ పరిసర ప్రాంతాలలో ఊహించనంతగా పెరిగిపోయిన భూముల ధరలకు తోడు ఈ ఏడాది నుండి కొత్తగా అమలులోకి వచ్చిన భూసేకరణ చట్టాలు భూసేకరణ పనిని మరింత కష్టంగా, క్లిష్టంగా మార్చివేస్తున్నాయి. ప్రభుత్వం ఈ సమస్యలను అధిగమించి భూసేకరణ కార్యక్రమం పూర్తి చేయవలసి ఉంటుంది. దానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు.   అదేవిధంగా రాజధాని నిర్మాణం కోసం తగిన డిజైన్, సాంకేతిక పరిజ్ఞానం అందించే సంస్థలను ఎంచుకోవలసి ఉంటుంది. అయితే చేతిలో డబ్బుంటే అదేమీ పెద్ద సమస్య కాదు. కనుక నిధుల కోసం కేంద్రంవైపే చూడాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎంత నిధులు విడుదల చేస్తుందనే విషయం కూడా తెలియవలసి ఉంది. దానిని బట్టే మిగిలిన అన్ని పనులు ఎప్పుడు, ఏవిధంగా మొదలుపెట్టి ఎంతకాలంలో పూర్తి చేయాలనే విషయంపై ఒక స్పష్టత వస్తుంది.   రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాలు, విద్యావైద్య సంస్థలు, పారిశ్రామికవాడలు, విమానాశ్రయాలు, పోర్టులు, సింగపూర్ ను తలదన్నే విధంగా రాష్ట్ర రాజధాని, జిల్లాకో స్మార్ట్ సిటీ, వైజాగ్, విజయవాడ మరియు తిరుపతి నగరాలను మెగాసిటీలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఐదేళ్ళ సమయం మాత్రమే ఉందనే సంగతి గుర్తుంచుకొని తదనుగుణంగా చాలా వేగంగా పనిచేయాల్సి ఉంటుంది. అధికార తెలుగుదేశం పార్టీ ఈ ఐదేళ్ళలోనే తన ఈ హామీలలో సగమయినా నెరవేర్చకపోతే, అది వచ్చే ఎన్నికలలో పార్టీపై వ్యతిరేఖ ప్రభావం చూపే అవకాశం ఉంటుందనే విషయం కూడా గుర్తుంచుకోవడం మంచిది.

వైకాపా తీరు మారదా?

 శాసనసభలో నేడు వైకాపా సభ్యులు, వారి అధినేత జగన్మోహన్ రెడ్డి అవలంభించిన ద్వంద వైఖరి వ్యవహరించిన తీరు చూస్తే వారికి ఇంకా పాత అలవాట్లు పోలేదనిపించింది. ఇదివరకు భూటకపు సమైక్యవాదంతో, సమైక్య ఉద్యమాలతో సీమాంధ్ర ప్రజలను ప్రసన్నం చేసుకొని ఎన్నికలలో గెలుద్దామని భంగపడినట్లే, మళ్ళీ ఇప్పుడు కూడా రాజధాని విషయంలో రభసచేసి రాయలసీమ ప్రజల మెప్పు పొందాలని ప్రయత్నించి మంత్రి అచ్చెం నాయుడు చేతిలో భంగపడ్డారు.   రాజధానిపై చర్చకు పట్టుబడుతూ సభను స్తంభింప జేసిన వైకాపా సభ్యుల నేత జగన్మోహన్ రెడ్డిని, “అసలు మీ పార్టీ రాజధానిని ఎక్కడ నిర్మించాలని కోరుకొంటోందో స్పష్టంగా చెప్పండి,” అని మంత్రి అచ్చెం నాయుడు నిలదీయడంతో, జగన్ నోట కాసేపు మాట రాలేదు. ఎందుకంటే ఆయన ఏ ప్రాంతం పేరు చెప్పినా మరో ప్రాంతం వారికి అది ఆగ్రహం కలిగించవచ్చును. బహుశః అందుకే రాజధానిపై తమ పార్టీ వైఖరి చెప్పకుండా, ఆ సమస్యను అధికార తెలుగుదేశం పార్టీ మీదకి నెట్టేసి రాజధానిపై చర్చ అంటూ సభలో నానా రభస చేసి రాయలసీమ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేసారు. అయితే తీరా చేసి అచ్చెం నాయుడు నిలదీసినప్పుడు జగన్ ఏ కడపో, కర్నూలో అనంతపురమో అని దైర్యం చేసి చెప్పి ఉంటే కనీసం అక్కడి ప్రజల మద్దతు ఆయనకు దొరికి ఉండేది. కానీ చెప్పలేకపోయారు.   మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో రాజధాని అని ప్రకటించిన తరువాత, కోస్తా ఆంధ్రాలో కూడా తన పార్టీకి ఇబ్బంది లేకుండా చూసుకొనేందుకు, తాము కూడా ఆ ప్రతిపాదనకు స్వాగతం పలుకుతున్నామని జగన్ ప్రకటించారు. అంతేకాక అంతవరకు సభలో నానా రభస చేసిన వైకాపా సభ్యులు రాజధానిపై జరిగిన చర్చలో ఎంచక్కా పాల్గొన్నారు. అటువంటప్పుడు ఈ రభస అంతా ఎందుకంటే రాయలసీమ ప్రజలను ఆకట్టుకోవడానికేనని అర్ధమవుతోంది.   అయితే వైకాపా అనుసరించిన ఈ ద్వంద వైఖరి వలన రెండు ప్రాంతాల ప్రజలలో ఆయన పట్ల మరింత అపనమ్మకం పెరుగుతుందే తప్ప ఆయన చేసిన పనిని మెచ్చుకొనేవారు ఉండరు. నిజాయితీకి, విశ్వసనీయతకు, విలువలకు తానే కేర్ ఆఫ్ అడ్రెస్స్ అని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో కూడా తన ద్వంద వైఖరిని ప్రదర్శించి తనలో, తన పార్టీ తీరులో ఎటువంటి మార్పులు రాలేదని మరోసారి నిరూపించి చూపారు.

రాజధానిపై రభస

  ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో దీర్ఘకాల రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చర్చించాల్సిన అధికార, ప్రతిపక్షాలు ఒకదానినొకటి విమర్శలు చేసుకొంటున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ దీనిపై శాసనసభలో ఎటువంటి చర్చకు అనుమతించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొంటోందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా ఆరోపిస్తుంటే, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సభా వ్యవహారాలు తెలియకుండా వ్యవహరిస్తున్నారని, సభలో అజెండాపై చర్చించకపోగా అజెండాను తానే నిర్ణయించాలనుకోవడం అవివేకమని అధికార పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజధాని అంశంపై సభలో ముందు చర్చించిన తరువాతనే ప్రకటన చేయాలని వైకాపా డిమాండ్ చేస్తుంటే, ప్రకటన చేసిన తరువాతనే దానిపై చర్చ జరపాలనే చిన్న విషయం కూడా ప్రతిపక్ష పార్టీకి తెలియదని అధికార పార్టీ సభ్యుల సమాధానం. అధికార పార్టీ ఇందులో తన ప్రయోజనాలను మాత్రమే చూసుకొంటోంది తప్ప దీర్ఘకాల రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని వైకాపా ఆరోపిస్తుంటే, వైకాపా తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని తెదేపా సభ్యుల ఆరోపణ.   ఈ విధంగా అధికార ప్రతిపక్షాల సభ్యులు ప్రకటనకు ముందు చర్చ జరగాలా లేక తరువాత జరగాలా అనే దానిపై తీవ్రంగా వాదోపవాదాలు చేసుకొన్నారు తప్ప రాజధాని ఏర్పాటుపై జరగవలసిన అసలు చర్చ జరపకుండానే సభలో నుండి బయటపడ్డారు. వారి ఈ ఆరోపణ ప్రత్యారోపణలు, విమర్శలు ప్రతి విమర్శల మధ్య అసలు విషయం కనబడకుండా పోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు సభలో రాజధాని అంశంపై ఒక ప్రకటన చేసేవరకు కూడా బహుశః సభలో ఈ రభస కొనసాగినా ఆశ్చర్యం లేదు. కనీసం ముఖ్యమంత్రి ప్రకటన తరువాతయినా సభలో దీనిపై అర్ధవంతమయిన చర్చ జరిగితే చూసి తరించాలని ప్రజలు కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. వారిది అత్యాశేమీ కాదు కదా!

అఖిలపక్ష సమావేశం మంచిదే కదా

  ఇంతవరకు రాజధాని విషయంపై వ్యూహాత్మకంగా మౌనం పాటించిన వైకాపా ఇప్పుడు తెదేపా ప్రభుత్వం విజయవాడ-గుంటూరు వద్ద రాజధాని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకొన్న తరువాత అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టింది. అభివృద్ధి చెందిన ప్రాంతంలో రాజధాని నిర్మించడం కంటే, వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో నిర్మిస్తే ఆ ప్రాంతం కూడా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని వైకాపా వాదన. అదేవిధంగా రాజధాని ఏర్పాటుపై శివరామ కృష్ణన్ కమిటీ సమర్పించిన నివేదికను కూడా బహిర్గతం చేయమని ప్రతిపక్షాలు గట్టిగా కోరుతున్నాయి. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి లోతుగా చర్చించి అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొన్న తరువాతనే ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని కోరుతోంది. అసెంబ్లీలోకి అడుగుపెట్టలేని కారణంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతోంది.   రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన విషయం కనుక కాంగ్రెస్, వైకాపాల సూచనలను తప్పుపట్టలేము. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పనిని మొదటే చేసి ఉండి ఉంటే చాలా హుందాగా ఉండేది. ఇప్పటికయినా మించి పోయింది ఏమీ లేదు కనుక ప్రభుత్వం ఒకసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించినట్లయితే ప్రతిపక్ష పార్టీలను గౌరవించినట్లు ఉంటుంది. వారి నుండి ప్రభుత్వానికి ఇంకా ఏదయినా మంచి సలహా దొరికినా దొరకవచ్చును. పైగా వారిని సంప్రదించి నిర్ణయం తీసుకొంటున్నందున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక ఎవరూ నిందించే అవకాశం ఉండదు. ఒకవేళ అందరూ కలిసి కూర్చొని చర్చించిన తరువాత ఈ అంశంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేసినట్లయితే ప్రజల దృష్టిలో అవే పలుచనవుతాయి. కానీ ప్రభుత్వం రాజధానిపై ఒక నిర్ణయం ప్రకటించిన తరువాత, ఇక ఆ తరువాత వచ్చే సమస్యలన్నిటికీ రాష్ట్రప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయం కూడా గుర్తుంచుకోవాలి.   కర్నూలు రాజధానిని చేయమని కోరుతున్న రాయలసీమ ప్రజలు విజయవాడ వద్ద రాజధాని ఏర్పాటు చేసినట్లయితే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడమే కాకుండా అప్పుడే రెండు మూడు సార్లు కర్నూలులో ధర్నాలు, ర్యాలీలు బహిరంగ సభలు, బందులు నిర్వహించారు. అందువలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు శాసనసభలో తన నిర్ణయం ప్రకటించేసిన తరువాత ఎదురవ్వబోయే ఇటువంటి సమస్యలతో ప్రతిపక్షాలకు ఎటువంటి సంబందమూ ఉండదు కనుక అవి కూడా రాష్ట్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించవచ్చును. అందువలన ప్రభుత్వం ప్రతిపక్షాలతో కూడా ఈ అంశంపై చర్చించడమే అన్ని విధాల ఉత్తమం. అయితే ప్రతిపక్షాలు కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఈ అంశంపై రాజకీయాలు చేయకుండా నిజాయితీగా వ్యవహరిస్తే అందరూ హర్షిస్తారు. కానీ పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సున్నితమయిన ఈ అంశంపై రాజకీయాలు చేస్తే ప్రజల దృష్టిలో మరింత పలుచనవడం ఖాయం.

మంచి ముహూర్థం ఒకటే సరిపోతుందా?

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అంశంపై నిన్న శాసనసభలో ప్రకటన చేయవలసిఉంది. కానీ, రేపు దశమి మంచిరోజు కనుక రేపే ప్రకటన చేయాలని నిర్ణయించుకొన్నారు. అందుకు సిద్దాంతులు మధ్యాహ్నం 12.57 నిమిషాలకి ముహూర్తం కూడా ఖరారు చేసారు. రాజధానిపై ప్రకటనకు మంచి ముహూర్తం చూసుకోవడం వరకు బాగానే ఉంది. కానీ విజయవాడ వద్ద రాజధాని ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న రాయలసీమవాసుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని వారికి ముందుగా నచ్చజెప్పి ప్రకటన చేసినట్లయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా పనిమొదలవుతుంది కనుక మొదలుపెట్టిన వేళా విశేషం అని తృప్తి పడటానికి అవకాశం ఉండేది. కానీ మంచి ముహూర్తం చూసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిపై ప్రకటన చేసిన తరువాత రేపటి నుండి రాష్ట్రంలో మళ్ళీ ఉద్యమాలు, నిరసనలు మొదలయితే అది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా!

తెలంగాణాలో పర్యటిస్తా..పార్టీని బలోపేతం చేస్తా..చంద్రబాబు

  తెదేపా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు పార్టీని వీడటంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందిస్తూ, “తెలుగుదేశం పార్టీకి పార్టీ కార్యకర్తలే బలం. పార్టీలో నుండి ఎందరు నేతలు బయటకు వెళ్ళిపోయినా, నేటికీ పార్టీ అంతే పటిష్టంగా నిలబడి ఉండటమే అందుకు ఒక సజీవ ఉదాహరణ. అందువలన ఒకరిద్దరు నేతలు పార్టీని వీడిపోయినంత మాత్రాన్న పార్టీకి ఎటువంటి నష్టం లేదు. పార్టీకి ఎల్లప్పుడు అండగా నిలబడుతున్న కార్యకర్తలలో నుండే సమర్దులయిన నాయకులను తయారుచేసుకోగల శక్తి నాకుంది. అందువలన ఒక నేత బయటకు వెళ్లిపోతే వందమంది నేతలను తయారు చేసుకొనే శక్తి, అవకాశం నాకుంది. తెలంగాణాలో కూడా పార్టీని బలోపేతం చేసుకోవడమే కాకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తప్పకుండా విజయం సాధించే విధంగా పార్టీని తీర్చిదిద్దుతాను. త్వరలోనే ఖమ్మం జిల్లాలో మరియు ఇతర తెలంగాణా జిల్లాలో కూడా నేను పర్యటించి పార్టీ కార్యకర్తలతో, స్థానిక నేతలతో మాట్లాడుతాను,” అని అన్నారు.   చంద్రబాబు స్పందన అందరూ ఊహించిందే. కానీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న ఆయన, తెలంగాణకు సమయం కేటాయించగలరా లేదో అనుమానమే. ఒకవేళ చెప్పినట్లుగానే ఆయన తెలంగాణాలో తరచూ పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసుకోగలిగితే మంచిదే. కానీ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో తెదేపాను పూర్తిగా ఖాళీ చేసేస్తామని పదేపదే చెపుతున్న అధికార తెరాస పార్టీ చూస్తూ ఊరుకొంటుందని భావించలేము. కనుక ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు తెలంగాణాలో పర్యటించగలిగినట్లయితే, అప్పుడు తెరాస కూడా తప్పకుండా ఆయనను రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయడం తధ్యమని చెప్పవచ్చును.

తుమ్మల వెనుక అదృశ్యహస్తం ఎవరిది?

  చెరువు మీద అలిగిన సామెత చందాన తెలుగుదేశం పార్టీని విడిచిపెడతా... విడిచిపెడతా అని ఎప్పటి నుంచో బెదిరిస్తూ వచ్చిన ఖమ్మం జిల్లా తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు ఎట్టకేలకు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తెలుగుదేశం అధినేతకు ఏకవాక్య రాజీనామా లేఖను రాసేసి, ఆ లేఖమీద సంతకం చేసే సమయంలో కన్నీరు కూడా పెట్టుకుని సెంటిమెంట్ సీన్ పండించారు. ఎన్టీఆర్ హయాం నుంచి తెలుగుదేశం పార్టీలో వున్న తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఖమ్మం జిల్లా టీడీపీలోని తన ప్రత్యర్థి నామా నాగేశ్వరరావును సాకుగా చూపించి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టారు. ఇటీవల తుమ్మల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సహా పలువురు తెలుగుదేశం నాయకులు తుమ్మలను పరామర్శించారు. తమ సొంత మనిషి అనారోగ్యానికి గురయ్యారన్న సానుభూతిని ప్రదర్శించారు. అయితే ఆ సమయంలో తుమ్మల త్వరలో చేరబోయే పార్టీకి సంబంధించిన వారెవరూ పరామర్శించిన పాపాన పోలేదు. దీన్ని గమనించైనా తుమ్మల తెలుగుదేశం పార్టీని వీడరన్న అభిప్రాయాలు కలిగాయి. అయితే, తుమ్మల ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మర్నాడు చేసిన ఘనకార్యం తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టడమే. తుమ్మల తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టడం పార్టీకి నష్టమా, ఆయనకే నష్టమా, పార్టీని విడిచినందుకు ఆయనకు లభించిన ‘హామీలు, తాయిలాలు’ వాస్తవరూపాన్ని ధరిస్తాయా, చివరకు చెవిలో పూలుగా మిగులుతాయా.... ఇలాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. అయితే ఎంతో అనుబంధం వున్న తెలుగుదేశం పార్టీని తుమ్మల విడిచిపెట్టడం వెనుక వున్న అదృశ్యహస్తం గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.   ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అధినేతగా వున్న ఒక వ్యక్తి అదృశ్య హస్తం తుమ్మల తెలుగుదేశం పార్టీ వీడటానికి కారణమైందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ ‘మీడియా వ్యక్తి’ తుమ్మలకు సన్నిహితుడు. ఆయనగారు తుమ్మలకు తెలుగుదేశం పార్టీలో వున్న అసంతృప్తిని కనిపెట్టారు. అలాగే తెలంగాణలోని అధికార పార్టీకి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడి అవసరాన్నీ గుర్తించారు. ప్రస్తుతం తెలంగాణలో తన మీడియా సంస్థకు సంబంధించి ఇబ్బందిని ఎదుర్కొంటున్న ఆయన ఒకే దెబ్బకు మూడు పిట్టలు పడేలా ఒక పథకం ఆలోచించారు. అది తుమ్మలను తెలుగుదేశం నుంచి బయటకి తీసుకొచ్చి తెలంగాణ పార్టీలో చేర్పించడం ద్వారా అటు తుమ్మలకు వున్న అసంతృప్తిని తొలగించడం, ఇటు తెలంగాణ పార్టీకి ఉన్న నాయకత్వ లోటుని తీర్చడం. ఈ ఉభయులకూ ఈ మేలు చేయడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో తన మీడియాకి వున్న ఇబ్బందికర పరిస్థితులు తొలగిపోయేలా చేసుకోవడం. ఈ ప్లాన్‌తో పావులు కదిపి, సంప్రదింపులు జరిపిన ఆయన ఇప్పటి వరకు కొంతమేర సక్సెస్ అయ్యారు. కాకపోతే ఈ ఎపిసోడ్‌లో ట్విస్ట్ ఏమిటంటే, సదరు మీడియా వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా సన్నిహితుడు కావడం. అంటే, తన మీడియా సంస్థను కాపాడుకోవడం కోసం తన సన్నిహితుడి పార్టీకే చిల్లు పెట్టడానికి ఆవ్యక్తి పూనుకున్నాడన్నమాట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాలవారు తుమ్మల పేరు చెబితే ఎంత కస్సుమంటున్నారో సదరు ‘మీడియా వ్యక్తి’ పేరు చెప్పినా అంతకంటే ఎక్కువ బుస్సుమంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికైనా ఆ వ్యక్తి అసలు స్వరూపాన్ని అర్థం చేసుకుని దూరంగా పెడితే మంచిదని భావిస్తున్నారు.