అమరావతిలో రాజధాని బెస్ట్! వాస్తు ఎక్స్‌పర్ట్ అడ్వైజ్
మొదట ఆంద్రప్రదేశ్ రాజధాని ఎక్కడ నిర్మించాలని చర్చ. ఎక్కడకడితే ఏ పార్టీకి ఎంత లాభమో అనేదానిపై మరో రసవత్తరమయిన చర్చ...ఆ తరువాత దాని గురించి ప్రతిపక్షాలకు మాట మాత్రంగా చెప్పలేదని రచ్చ రచ్చ. తరువాత సింగపూరు మోడలా... లేక చికాగో మోడల్లో నిర్మించాలా అనే మరో ఆసక్తికరమయిన చర్చ. తరువాత భూసేకరణ..అందుకు నిధుల సమీకరణ..ఇత్యాది సమస్యలు. ఇవ్వనీ సరిపోవన్నట్లు కొత్తగా వాస్తు సమస్యలు..పరిష్కారాలు..వాటిపై మళ్ళీ చర్చలు విమర్శలు.. ఇదంతా చూస్తుంటే ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుంది.
ఇక వాస్తు స్పెషలిస్టులు కూడా ప్రజలలో భాగమే కనుక వారు కూడా ఈ చర్చలో ఎంట్రీ ఇచ్చేరు. వాస్తు ప్రకారం కృష్ణా నదికి కుడివైపు రాజధానిని నిర్మిస్తే, నదీ ప్రవాహం ఉత్తరం నుండి ఈశాన్యం వైపు ప్రవహిస్తుంటుంది కనుక రాష్ట్రానికి, ప్రజలకి, ప్రభుత్వానికి, దాని అధిపతికి కూడా మంచి జరుగుతుందని స్పెషలిస్టుల సలహా.
రాష్ట్ర ప్రభుత్వం మొదట నూజివీడు వద్ద రాజధాని నిర్మిద్దామని అనుకొన్నా, అప్పుడు రాజధానికి కృష్ణానది ఆగ్నేయం వైపు ప్రవహిస్తుంటుంది. దానికి వాస్తు స్పెషలిస్టులు ఒప్పుకోలేదు కనుక ప్రభుత్వం ఆ ఆలోచన విరమించుకొని (కృష్ణ) ఒడ్డునపడే పడే ఆలోచన చేస్తోందని పబ్లిక్ టాక్. అందుకే చంద్రబాబు మొదటి నుండి మంగళగిరి జపం చేస్తున్నారని టాక్ వినబడుతోంది.
అయితే మంగళగిరి వద్ద కంటే అమరావతి వద్ద ఉన్న వైకుంటపురం రాజధానికి వాస్తుపరంగా చాలా అనువయిన ప్రాంతమని, ఎందుకంటే అక్కడ నిర్మిస్తే రాజధానికి నది ఖచ్చితంగా ఈశాన్యం వైపే ప్రవహిస్తోంటుందని ఎక్స్ పర్ట్ అడ్వైజ్ లభిస్తోంది. అందువలన అమరావతా మంగళగిరా అనే దానిపై కూడా మరో చర్చ అవసరంపడుతోంది.
ఇక ఏ శాస్త్రానికయినా అమెండ్మెంటులు, పండితుల వాదోపవాదాలు, భిన్నాభిప్రాయాలు అనివార్యం కనుక గుంటూరు వాస్తు స్పెషలిస్టులు అసలు గుంటూరే అన్ని విధాల రాజధానికి అనువయిందని బల్ల గుద్దిమరీ వాదిస్తున్నారు. ఏవిధంగా అంటే “గుంటూరు సముద్ర మట్టానికి 36 మీటర్ల ఎత్తులో ఉంటే, విజయవాడ కేవలం 12.5 మీటర్ల ఎత్తులో ఉంది కనుక, యజమాని అంటే సచివాలయం ఎప్పుడు ఉన్నతమయిన స్థానంలోనే ఉండాలనుకొంటే గుంటూరులోనే సెటిల్ అవడం మంచిది. అలాకాక పల్లపు ప్రాంతమయిన విజయవాడలో పాలకులు, ఎగువ ప్రాంతాలలో ప్రజలు ఉన్నట్లయితే శాస్త్రం ఎలాగు ఒప్పుకోదు, పైగా అరిష్టం కూడాను...” అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
కానీ మంగళగిరికి మొగ్గుతున్నవాళ్ళు బ్రహ్మం గారి కాలజ్ఞానం కూడా కోట్ చేస్తూ “మంగళగిరి మెగా సిటీ అవుతుందని అయన ఎప్పుడో చెప్పారు. అటువంటప్పుడు వేరే ఎక్కడో రాజధాని ఎలా నిర్మిస్తారు?” అని ప్రశ్నిస్తున్నారు.
నిత్యం అందరూ పూజలు, పునస్కారాలు, వాస్తు, గ్రహ దోష పరిహారాలు ఎన్ని చేసుకొంటున్నా ఆ విషయం పబ్లిక్ గా చెప్పుకోవడానికి హేతువాదులు అభ్యంతరం చెపుతుంటారు కనుక, విజయవాడ యంపీ కెశినేని నాని “ఈ వాస్తు టాక్ అంతా ఒట్టి రబ్బిష్..ప్రభుత్వం అదేమీ చూడటంలేదు..అందంతా గిట్టని వాళ్ళు చేస్తున్న ప్రచారం మాత్రమే..మా ప్రభుత్వం అందరూ మెచ్చుకొనే విధంగా సింగపూరు వంటి గొప్ప రాజధానిని ఏవిధంగా నిర్మించాలని మాత్రమే ఆలోచిస్తోంది తప్ప వాస్తు గురించి కాదు,” అని మ్యాటర్ కట్ చేసే ప్రయత్నం చేసారు. (అందువలన సింగపూరు, చికాగో నగరాలు వాస్తు ప్రకారం నిర్మింపబడ్డాయో లేదో ముందు తెలుసుకొంటే ప్రభుత్వం నిజం చెపుతోందా లేదో ఈజీగా కనిపెట్టేయవచ్చును. ఆ రెండు నగరాలు బాగానే అభివృద్ధి చెందాయి కనుక వాటి వాస్తు కూడా బాగానే ఉందని ఒప్పుకోక తప్పదు. కనుక మన రాజధానికి కూడా అదే వాస్తు సూటవుతుందని బాబుగారు భావిస్తున్నారేమో.)
ఏమయినప్పటికీ ప్రభుత్వం మాత్రం (వాస్తు స్పెషలిస్టులు సూచించిన విధంగా) క్రిష్ణమ్మకు కుడివైపుకే ఫిక్స్ అయిపోయినట్లుగానే కనిపిస్తోంది. కృష్ణా నదికి కుడివైపునున్న 11మండలాలలో సర్వే నిర్వహించమని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు టాక్ వినబడుతోంది. ఈ వాస్తు పుణ్యమాని ఇంతకాలానికి మా పంట పండబోతోందని అక్కడి రైతులు చాలా సంతోషిస్తున్నారుట. ఎందుకంటే ఎకరానికి కోటి రూపాయలు చెపుతున్నారు కదా మరి!