ప్రతిపక్షాలను ఏకం చేసిన కేసీఆర్
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆకర్ష పధకంతో ప్రతిపక్షాల నేతలను తెరాసలోకి ఆకర్షించి, రాష్ట్రంలో ప్రతిపక్షాలను బలహీనపరచాలని భావించారు. కానీ ఆయన విద్యుత్ సమస్యలపై చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షాలకు యూద్రుదాది చేసేందుకు చేజేతులా మంచి అవకాశం ఇచ్చారు. అంతే కాదు ఇదివరకు మీడియాపై నోరు జారి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్, “రాష్ట్రంలో ప్రస్తుత కరెంటు కష్టాలకు గత ప్రభుత్వాలే కారణమని, ప్రతిపక్ష నేతలు పరిస్థితులను అర్ధం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నారని, కుక్కలు మొరిగితే మనం పట్టించుకొంటామా?” అని చేసిన వ్యాఖ్యలతో ఆయన మళ్ళీ మరో అటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు.
తెదేపా, కాంగ్రెస్ పార్టీల నేతలిరువురూ మూకుమ్మడిగా ఆయనపై ఎదురుదాడి ఆరంభించారు. కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణ, తెదేపా నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి ముగ్గురూ కూడా ఆయనపై వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఎన్నికల సమయంలో తెరాస అధికారంలోకి రాగానే రోజుకి 8గంటలు చొప్పున విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్, తన హామీని అమలు చేయలేక, గత ప్రభుత్వాలను విమర్శించడం చేతకానితనమేనని వారు విమర్శించారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించలేని కేసీఆర్, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే గత ప్రభుత్వాలను నిందిస్తున్నారని వారు ఆరోపించారు.
విద్యుత్ సమస్యల గురించి ప్రజల తరపున ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తే, వారిని మొరిగే కుక్కలతో పోల్చడం ఆయన అహంకారానికి నిదర్శనమని వారు విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు, రైతులు, పరిశ్రమలు తీవ్ర విద్యుత్ సమస్యలతో నానా బాధలు పడుతుంటే, ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించకుండా, తన బాధ్యత గుర్తు చేస్తున్న ప్రతిపక్షాలను, గత ప్రభుత్వాలను నిందిస్తూ ప్రజలను మరో మూడేళ్ళు ఓపిక పట్టమని కేసీఆర్ చెప్పడం బాధ్యతారాహిత్యమేనని కాంగ్రెస్, తెదేపా నేతలు విమర్శించారు.
రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని తెలిసి ఉన్నప్పటికీ పొరుగు రాష్ట్రమయిన ఛత్తిస్ ఘర్ నుండి విద్యుత్ సరఫరా కోసం వేస్తున్న హై-ట్రాన్స్ మిషన్ లైన్ల నిర్మాణాన్ని తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చేక మధ్యలో ఎందుకు నిలిపివేసిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రజలకు పిట్టకధలు చెపుతూ కాలక్షేపం చేస్తున్నారని అయితే ఇది ఎంతో కాలం సాగదని ప్రజల సహనం నశిస్తోందని ఎర్రబెల్లి అన్నారు. ఆంద్ర, తెలంగాణాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన తన అసమర్ధతను కప్పిపుచ్చుకోవాడానికి ఇంకా తెలంగాణా సెంటిమెంటును అడ్డంపెట్టుకోవడాన్ని ఎర్రబెల్లి ఆక్షేపించారు. ఇకనయినా కేసీఆర్ తన మాట తీరు మార్చుకొని ప్రతిపక్షాలను గౌరవించడం నేర్చుకోవాలని, లేకుంటే ప్రజలే ఆయనకు గుణపాటం చెపుతారని కాంగ్రెస్, తెదేపా నేతలు హెచ్చరించారు.