వచ్చే మహానాడు నాటికి జాతీయపార్టీగా తెదేపా
posted on Sep 21, 2014 8:29AM
రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలలో తమ పార్టీని కొనసాగించేందుకు తెలుగుదేశం పార్టీని జాతీయపార్టీగా మార్పు చేయవలసిన అవసరం ఏర్పడింది. దీనిపై చర్చించేందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో నిన్న హైదరాబాదులో సమావేశమయ్యారు. వారు పార్టీ అధ్యక్షుడికి ఈ విషయంపై కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. పార్టీని జాతీయపార్టీగా మారుస్తున్నందున పార్టీ పేరు కూడా అందుకు తగిన విధంగా ఉండాలని సూచించారు. అఖిలభారత తెదేపా, జాతీయ తెదేపా, తెదేపా(జాతీయ పార్టీ) వంటి కొన్నిపేర్లు సూచించారు. కానీ పార్టీలో కొందరు నేతలు పార్టీని జాతీయ పార్టీగా మార్చుతున్నప్పటికీ దాని పేరులో ఎటువంటి మార్పు చేయనవసరం లేదని చెపుతూ అందుకు ఉదాహరణగా జాతీయాపార్టీలయిన కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలను ప్రస్తావించారు.
జాతీయ పార్టీ హోదా పొందేందుకు కనీసం మూడు రాష్ట్రాలలో పార్టీ ఎన్నికలలో పోటీ చేయవలసి ఉంటుంది. కనుక వచ్చే ఎన్నికలలో తమిళనాడు, కర్నాటక, ఒడిషా రాష్ట్రాలలో తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు పార్టీని ఇప్పటి నుండే క్రమంగా విస్తరించి, ఆ ప్రాంతాలలో పోటీ చేయడం ద్వారా ఆ అర్హత సాధించవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దేశంలో వివిధ ప్రాంతీయ పార్టీలు, జాతీయపార్టీలుగా ఏవిధంగా మార్పు చెందాయనే విషయంపై అధ్యయనం చేయమని చంద్రబాబు తన పార్టీ నేతలకు సూచించారు.
నిన్న జరిగిన ఈ పోలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ నుండి వెళ్ళిపోయిన నామా నాగేశ్వర రావు స్థానంలో సుజనా చౌదరిని తీసుకొన్నారు. కొత్తగా రేవంత్ రెడ్డి, వెంకట వీరయ్యలను దీనిలో సభ్యులు తీసుకొన్నారు. ఆంధ్ర, తెలంగాణా రెండు రాష్ట్రాల పార్టీ శాఖలకు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయాలని, తెలంగాణాలో పార్టీ కార్యాలయం నిర్మించేందుకు అవసరమయిన భూమిని సమకూర్చమని తెలంగాణా ప్రభుత్వాన్ని కోరాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ఇవి కాక ఇంకా అనేక ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. వచ్చే ఏడాది విజయవాడలో నిర్వహించనున్న ‘మహానాడు’ సమావేశంలో పార్టీని జాతీయపార్టీగా ప్రకటించేందుకు అవసరమయిన ఏర్పాట్లు చేసేందుకు చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాలకు చెందిన నేతలతో ఒక కమిటీని వేయాలని భావిస్తున్నారు.