ఏపీ రైతుల రుణమాఫీ.. బ్యాంకుల ఓవర్ యాక్షన్!
రైతు రుణమాఫీ... ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రత్యర్థులు ఆలోచించడానికి కూడా బెంబేలెత్తిపోయిన అంశం. రాష్ట్రంలో పేద రైతుల కష్టాలను అర్థం చేసుకున్న చంద్రబాబు నాయుడు అర్హులైన పేద రైతులందరికీ వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కట్టుబడి వున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అర్హులైన రైతుల రుణాలు మాఫీ మాఫీ చేయడానికి ఆయన కసరత్తు చేస్తున్నారు. రైతులకు ఆదుకోవడానికి ఆదాయ మార్గాల అన్వేషణలో, తగిన ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నమై వున్నారు. ఈ విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధిని రైతులు కూడా అర్థం చేసుకుని సహకరిస్తున్నారు.
రైతుల రుణమాఫీ అంటే బొజ్జ నిండిన భూస్వాములు ఊబుసుపోక తీసుకున్న రుణాలు మాఫీ చేయడం కాదు. భూమి మీద అప్పు తీసుకుని వాటితో వడ్డీ వ్యాపారాలు చేసే బడాబాబుల పాలిట వరప్రసాదం కాదు. పంటలు ఏవీ వేయకపోయినా భూములు ఉన్నాయి కాబట్టి క్రాప్ లోన్ పేరిట తీసుకున్న రుణాలను మాఫీ చేయడం ఎంతమాత్రం కాదు. నిజానికి రైతు రుణమాఫీ అంటే... ఇతరులకు అన్నం పెట్టే ప్రయత్నంలో వివిధ కారణాల వల్ల తన కడుపు మాడే పరిస్థితికి వచ్చిన నిరుపేద రైతుల రుణాలు మాఫీ చేయడం. అలాంటి పేద రైతుల రుణాలు మాఫీ చేయడమే చంద్రబాబు నాయుడు ప్రధానోద్దేశం. రుణమాఫీ చేయడానికి నిజమైన అర్హులైన రైతుల రుణాలను మాఫీ చేయడమే న్యాయంగానీ, బడాబడా భూస్వాములకు మేలు చేయడం ఎంతమాత్రం న్యాయం కాదు. అందుకే ఈ విషయంలో అర్హులైన రైతులకు అన్యాయం జరగకూడదు. అనర్హులైన వారికి అప్పనంగా రుణమాఫీ చేయకూడదు.
చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 30వ తేదీ, 2013 సంవత్సరంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ ప్రస్తావన తెచ్చారు. అంటే ఆ ఏడాది రైతులు తీసుకున్న పంట రుణాల మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు స్పష్టంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కోరిన మేరకు బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాలను లెక్కగట్టడం ప్రారంభించాయి. అన్ని రకాలుగా లెక్కలు వేసి మొత్తం రాష్ట్రంలో మొత్తం ఒక కోటి 5 లక్షల రైతుల బ్యాంకు ఖాతాలు వున్నాయని, ఆ ఖాతాలున్న రైతులు తీసుకున్న రుణాలు 87,612 కోట్లు అని తేల్చాయి. ఈ అంకె చూసి ప్రతిపక్ష నాయకుడు జగన్ గుడ్లు తేలేశాడు. ఇంత భారీ మొత్తంలో రుణాలు వుంటాయి కాబట్టే రైతు రుణమాఫీ సాధ్యం కాదని తాను ముందే చెప్పానని కాకలు తీరిన ఆర్థికవేత్తలాగా ప్రకటనలు చేశాడు. కొంతమంది అయితే చంద్రబాబు నాయుడు ఇంత భారీ స్థాయిలో రుణమాఫీ ఎలా చేస్తాడో ఏంటోనని సానుభూతి వ్యక్తం చేశారు. అయితే నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాఫీ చేయాల్సిన రుణాలు ఇంత భారీ స్థాయిలో లేవు. ‘తెలుగువన్’ చేసిన పరిశోధనలో అనేక ఆసక్తికర విషయాలు, బ్యాంకుల తెలివితేటలు బయటపడటంతోపాటు... అర్హులైన రైతుల రుణాలు మాఫీ చాలా సులభంగా చేయొచ్చని కూడా క్రిస్టల్ క్లియర్‌గా తెలిసిపోయింది.
నిజానికి బ్యాంకులు ప్రకటించిన 87,612 కోట్లు ఈ ఏడాది తీసుకున్న రైతు క్రాప్ రుణాల మొత్తం కాదు... ఈ మొత్తంలో చంద్రబాబు ప్రకటించిన సంవత్సరానికి కాకుండా అంతకు ముందు సంవత్సరాలలో తీసుకున్న రైతు రుణాలు 30,190 కోట్లు వున్నాయి. దశాబ్దాల తరబడి మొండి బకాయిలుగా మిగిలిపోయి, బ్యాంకులు కూడా వసూలు చేయలేక చేతులు ఎత్తేసిన రుణాలు 6,480 కోట్లు వున్నాయి. ఇక బంగారం తాకట్టు పెట్టి వ్యక్తిగత అవసరాల కోసం, వ్యవసాయేతర పనుల కోసం తీసుకున్న రుణాలు, రుణమాఫీ పరిధిలోకి రాని హార్టీకల్చరల్ రుణాలు, భూస్వాములు తీసుకున్న రుణాలు, ఒకే కుటుంబంలో ఒకరికి మించి తీసుకున్న రుణాలు..... ఇలా రకరకాల ‘మాఫీ’తో సంబంధం లేని రుణాలన్నీ కలిపి 87,612 కోట్లు అయింది. ఈ మొత్తంలో ప్రభుత్వం నిజంగా మాఫీ చేయాల్సిన రుణం కేవలం 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉంటుంది.
అయితే బ్యాంకులు మాత్రం తెలివిగా ఈ లెక్కలను బయటపెట్టడం లేదు. నిజానికి ప్రభుత్వం చేయాల్సిన రుణమాఫీ 15 నుంచి 20 వేల కోట్ల రూపాయల మధ్యలో వున్నప్పటికీ ఆ లెక్కలు, అంకెలను బయటపెట్టకుండా ‘‘రైతులు బ్యాంకులకు 87,612 కోట్లు బాకీ వున్నారు’’ అనే విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నాయి. ఇక్కడ బ్యాంకుల స్వార్థం ఏమిటంటే, ప్రభుత్వం ఎలాగూ రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది కాబట్టి, ఎన్నో సంవత్సరాలుగా తాము ఇచ్చిన రుణాలన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన వేసేసి తాము చేతులు దులిపేసుకుంటే ఒక పనైపోతుంది కదా అనే!చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణాలు మాఫీ చేయడం చాలా సులువైన విషయం. అయితే మధ్యలో బ్యాంకులు మైండ్ గేమ్ ఆడుతూ స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ వుండటం వల్లే రైతు రుణమాఫీ అంశం చాలామందికి భూతద్దంలో కనిపిస్తూ భయపెడుతోంది. నిజానికి బ్యాంకులు ఇప్పటికైనా చంద్రబాబుతో మైండ్ గేమ్ ఆడటం ఆపేయాలి. రైతు రుణమాఫీ అంశాన్ని అడ్డు పెట్టుకుని అవకాశవాదంతో, స్వార్థంతో వ్యవహరించడం మానుకోవాలి. ఇంతకాలం తాము భరిస్తున్న రుణాల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన వేయాలని భావించడం పద్ధతి కాదని తెలుసుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం చెల్లించాల్సిన వాస్తవ రుణాన్ని బ్యాంకులు ఎలాంటి తిరకాసులు పెట్టకుండా బయటపెడితే పేద రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వ లక్ష్యమూ నెరవేరుతుంది.