జయమ్మ ఓదార్పు యాత్ర కబుర్లు
posted on Sep 29, 2014 @ 4:53PM
అదేమిటో ఈ వెర్రిబాగుల జనాలు అక్కడెక్కడో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసుకి రాష్ట్రంలో మన రెడ్డిగారి కేసులకి ముడిపెట్టేసి, ‘అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత?’ అని ఏవేవో కాకి లెక్కలు కట్టేస్తున్నారు. మరి అదేమీ వెర్రి ఆనందమో ఏమో? పైగా అన్నీ అచ్చం ఇక్కడిలాగే జరగడం వెనుక రాజకీయ కుట్ర ఏమయినా ఉందా? అనే అనుమానాలొకటి? వారి అనుమానాలను అంత వీజీగా కొట్టిపారేయడానికి లేదట. ఎందుకంటే జయలలిత అరెస్టు కావడంతో అక్కడ కూడా అనేకమంది ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొంటున్నారుట. ఇంకెంతో మంది గుండెలు పెటేల్ పెటేల్మని కుండల్లా బ్రద్దలయినపోతున్నాయిట. ఇదంతా చూస్తున్నా మీకేమి గుర్తుకు రాకపోతే గజినీలాగా మెమొరీ లాసుందేమో చూపించుకొండని ఉంచిత సలహా ఒకటి.
అందువల్ల జయమ్మను ఇంకా మరికొన్నాళ్ళు ఇలాగే జైల్లో ఉంచినట్లయితే ఇంకా ఎన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకొంటారో ఊహించడం కష్టం కనుక ఆ (మానవీయ) కోణంలో ఆలోచించయినా ఆమెకు బెయిలు మంజూరు చేయమని ఆమె తరపున వాదిస్తున్న జెట్మలానీగారు కోర్టు వారిని అడిగారో లేదో అని ఇక్కడి జనాలు ఒకటే ఇదయిపోతున్నారు. ఏమయినప్పటికీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా జయమ్మ కారణంగానే జనాలు ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు కనుక ఇక తప్పనిసరిగా ఆమె కూడా వీలు వెంబడి ఓదార్పు యాత్రలు చేయక తప్పదని ఇక్కడి జనాలు అభిప్రాయపడుతున్నారు.
ఇంతవరకు ఆమె చేసింది చూసి మిగిలినవారు ఫాలో అయిపోవడమే తప్ప ఆమె ఏనాడు ఎవరినీ ఫాలో అయిన దాఖలాలు లేనప్పటికీ, ఓదార్పు యాత్రలు చేయడంలో మంచి అనుభవం ఉన్న మన రెడ్డిగారిని సంప్రదించడంలో తప్పేమీ లేదని జనాలు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు వైకాపా జాతీయపార్టీ అయిపోతోంది కనుక ఒకటేమిటి ఏడ్చేవాళ్ళు ఉండాలే కానీ అవసరమయితే చుట్టుపక్కల మరో నాలుగయిదు రాష్ట్రాలలో కూడా ఓదార్పు యాత్రలు చేసుకోగోలదని బల్ల గుద్ది వాదిస్తున్నారు అభిమానులు.
కానీ ఒట్టి తమిళనాడుకే పరిమితమయిన జయమ్మ ప్రస్తుతం సెల్లులో తనను తాను ఓదార్చుకొంటూ, అందులో నుండి బయటపడ్డాక తన కోసం ప్రాణాలు పోగొట్టుకొంటున్న తమిళ తంభిల కుటుంబాలను ఓదార్చక తప్పేలా లేదు. కానీ నాలుగేళ్ళు జైలులో కూర్చొంటే, పదేళ్ళ దాక ఎన్నికలలో పోటీ చేసేందుకు వీలుండదు కనుక, ఎవరినో ఓదార్చడం కంటే తనను తానే ఓదార్చుకోవడమే మంచిదని ‘నిపుణులు’ అభిప్రాయపడుతున్నారు.
ముష్టి అరవై కోట్ల అక్రమాస్తుల కేసును పట్టుకొని ఇరవై ఏళ్ళు సాగదీయగలిగినప్పుడు, ఇప్పుడు జెట్మలానీ గారు తిమ్మిని బమ్మిని చేసేసి కోర్టు కళ్ళకు మరో నల్లగుడ్డ ముక్కను గట్టిగా కట్టేసి బెయిలు మీద విడిపించకుండా ఉంటారా? అని సానుకూల దృక్పధంతో ఆలోచిస్తున్న వారూ లేకపోలేదు. అటువంటి వారు ఒకవేళ ఆమె బెయిలుపై బయట పడగలిగినట్లయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు, బెయిలు దొరికినప్పుడే ఓదార్పు యాత్రలు చేసుకోవాలని సూచిస్తున్నారు.
అయితే ఎంతసేపు ఆమె కేసులు, ఆమె బెయిలు, ఆమె ఓదార్పు యాత్రల గురించి మాట్లాడటమే కానీ మనోళ్ళ గొప్పదనం గురించి చెప్పుకొనే మంచి బుద్ధులు, మంచి అలవాట్లు బొత్తిగా మనోళ్ళకి లేవని జనాలు చాలా బాధ పడుతున్నారు. అది చూసి నిక్షేపంగా బెయిలు మీద తిరుగుతున్నవాడిని పట్టుకొని ఆ మాటనడానికి మీకు నోరెలా వచ్చిందని కసురుకొనే వారు లేకపోలేదు.
అయినా జయమ్మ జైల్లోకి వెళ్ళింది కదాని మన రెడ్డిగారు, కనిమోలి, రాజావారు అందరూ అలాగే జైలుపాలయిపోతారనుకోవడం అవివేకం కాదా? ఎంత చెట్టుకు అంత గాలన్నట్లు ఎవరి కేసులు వారివి. ఎవరు ఎప్పుడు లోపలకి వెళతారో ఎప్పుడు ఎలా బయటకు వస్తారో ఎవరికీ తెలియదు. కానీ లోకులు కాకులు వంటి వారు. మడమ తిప్పని మంచి వాళ్లకే కష్టాలన్నీ. అలాగని జైలు శిక్ష పడగానే బెంబేలు ఎత్తిపోనవసరం లేదంటున్నారు నిపుణులు.
విలాసవంతమయిన తమ జీవితాలను ప్రజల కోసమే త్యాగం చేసేసి జైలుకు వెళుతున్నట్లు చెప్పుకొనే ఒక కొత్త వెసులుబాటు కనుగొనబడిందిప్పుడు. పంటి బిగువున తాము భరించిన జైలు కష్టాలన్నీ ప్రజల కోసమే పడుతున్నట్లు చెప్పుకోనే వెసులుబాటున్నపుడు జైలు శిక్ష కూడా రాజకీయ జీవితానికి పెట్టుబడి క్రిందే భావించడం అలవాటు చేసుకోగలిగితే ఇంక ఏ బాధ ఉండదు. అప్పుడు పోలీసు వ్యానులో ఎక్కుతున్నప్పుడు, జైల్లోకి వెళుతున్నప్పుడు, మధ్యమధ్య కోర్టు కేసులకి హాజరవుతున్నప్పుడు, బెయిలు మీద బయటకు వస్తున్నప్పుడు హుషారుగా అభిమానులు వెంటరాగా ఎంచక్కా ఊరేగింపులు కూడా నిర్వహించుకోవచ్చునని అనుభవజ్ఞుల సలహా.