కేసీఆర్ పై యుద్ధానికి చేతులు కలిపిన ఎర్రబెల్లి, రేవంత్
posted on Oct 6, 2014 @ 4:03PM
ఆ మధ్య తెదేపా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని రహస్యంగా కలిసినట్లు వార్తలు రావడంతో, ఇక నేడో రేపో ఆయన తెదేపాను వీడి తెరాసలో చేరబోతున్నారని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈరోజు ఆయన రేవంత్ రెడ్డితో కలిసి కేసీఆర్ పై విరుచుకుపడటంతో అందరూ ఆశ్చర్యపోక తప్పలేదు. తెలంగాణాలో ప్రస్తుత కరెంటు కష్టాలకు గత ప్రభుత్వాలే కారణమని తెరాస నేతలు చెప్పుకోవడం చూసి, వారిని ధీటుగా ఎదుర్కోమని చంద్రబాబు కోరడంతో, ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి తెలంగాణా మంత్రులపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
"ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రోజుకి 8 గంటలు నాణ్యమయిన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు మరో మూడేళ్ళు ఆగాలని చెప్పడాన్ని ఇంటికి నిప్పు అంటుకొంటే నుయ్యి త్రవ్వడం మొదలు పెట్టినట్లుందని" ఎర్రవెల్లి ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉందని తెలిసినప్పటికీ కనీసం పక్క రాష్ట్రాల నుండి, కేంద్రం నుండి అదనపు విద్యుత్ ఎందుకు తెచ్చుకోలేకపోయారని ఆయన ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి కూడా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై సరికొత్త ఆరోపణలతో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన మంత్రివర్గంలో మిగిలిన వారినందరినీ డమ్మీలుగా మార్చేవేసారని ఆక్షేపించారు. ఇంతవరకు మెట్రో రైలు విషయంలో కాస్త దూరమయిన ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి ఇద్దరూ మళ్ళీ ఒకే వేదికపై నుండి తెరాస ప్రభుత్వాన్ని, దాని అధినేత కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించడంతో వారిలో చీలిక తెచ్చి లబ్దిపొందుదామనే కేసీఆర్ ప్రయత్నం బెడిసి కొట్టినట్లయింది.
వారిరువురితో సహా తెలంగాణా-తెదేపా ముఖ్య నేతలందరూ త్వరలో తెలంగాణాలో బస్సు యాత్ర మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్నట్లు తాజా సమాచారం. కేసీఆర్ ఆకర్షకు విరుగుడుగా ఈ బస్సు యాత్ర చేప్పట్టి తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోవాలనేది దీని ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది. తెలంగాణాలో మిగిలిన తెదేపా నేతలు కూడా ఏకత్రాటిపైకి రాగలిగితే, పార్టీ మళ్ళీ పుంజుకోవడం పెద్ద కష్టమయిన పనేమీ కాదని చెప్పవచ్చును.