ఆయన దగ్గర చాలా నేర్చుకొన్నా: చిరంజీవి
posted on Oct 6, 2014 @ 11:57AM
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రముఖ హాస్యనటుడు స్వర్గీయ అల్లు రామలింగయ్య విగ్రహాన్ని మాజీ కేంద్ర మంత్రి మరియు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి నిన్నఆవిష్కరించారు. డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయితలు పరుచూరి సోదరులకు అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ స్వర్గీయ అల్లు రామలింగయ్య గొప్పదనం గురించి వివరించి, జీవితాన్ని బంగారు బాట పట్టించేందుకు అవసరమైన అనేక మార్గదర్శక నీతి సూక్తులను ఆయన దగ్గర నేర్చుకున్నానని చెప్పారు.
కానీ, ఆయన మెగాస్టారుగా సినీ రంగంలో ఆర్జించిన మంచిపేరు, ప్రఖ్యాతులు, ప్రజాభిమానం అన్నిటినీ కూడా ఆయన రాజకీయాలలోకి వచ్చిన తరువాత పోగొట్టుకొన్నారు. అందుకు ఆయన పరిస్తితులనో లేక వేరెవరినో నిందించడం కంటే తనను తానే నిందించుకోవలసి ఉంటుంది. సినీ పరిశ్రమలో ఆయన ఆ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డారో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా సినిమాలలో ఆయన ఒక గొప్ప ఆదర్శమూర్తిగా, ప్రజల కోసం ఎంతటి త్యాగానికయినా సిద్దపడే వ్యక్తిగా తనను తాను ఆవిష్కరించుకోవడం చూసిన ప్రజలు, ఆయన నిజ జీవితంలో కూడా అంతే గొప్ప విలువలు కలిగి ఉంటారని భావించారు. కానీ ఆయన రాజకీయాలలోకి అడుగుపెట్టిన తరువాత, సినిమాలలో చూసిన చిరంజీవికి, నిజజీవితంలో చిరంజీవికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని పదేపదే నిరూపిస్తూ వచ్చేరు.
సినిమాలలో అంచెలంచెలుగా సమున్నత స్థాయికి ఎదిగిన ఆయన, రాజకీయాలలో మాత్రం అడ్డుదారిలో పైకి ఎదగాలని ప్రయత్నించి భంగపడ్డారు. నిజం చెప్పాలంటే ఆయన అసలు వ్యక్తిత్వం ఏమిటో ఆయన రాజకీయాలలోకి వచ్చిన తరువాతే ప్రజలకు అర్ధమయింది. అంతకు ముందు సినీనటులు డా.రాజశేఖర్, జీవిత వంటివారు ఆయనపై ఎన్ని ఆరోపణలు చేసినా నమ్మని ప్రజలు, ఆయన రాజకీయాలలో అనుసరించిన ద్వంద వైఖరిని చూసిన తరువాత ఆ ఆరోపణలు నిజమని నమ్మక తప్పలేదు.
కర్నాటకకు చెందిన జైరామ్ రమేష్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపికయిన కారణంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడుతుంటే, ప్రజాసేవ చేసేందుకే రాజకీయాలలోకి వచ్చేనని పదేపదే చెప్పుకొనే చిరంజీవి తన రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా కనబడుతుండటంతో, రాజ్యసభ సభ్యుడిననే సంగతి కూడా మరిచిపోయినట్లు మళ్ళీ 150వ సినిమా తీయడానికి సిద్దమయిపోతున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్న చిరంజీవి ‘స్వర్గీయ అల్లు రామలింగయ్య దగ్గర జీవితాన్ని బంగారు బాట పట్టించేందుకు అవసరమైన అనేక మార్గదర్శక నీతి సూక్తులను నేర్చుకున్నానని’ చెప్పుకోవడం వింటే నిజమేనని ఎవరయినా ఒప్పుకోక తప్పదు మరి.