విద్యుత్ పై తెలంగాణా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం
విద్యుత్ సంక్షోభంపై తెలంగాణా రాష్ట్ర శాసనసభలో ఈరోజు జరిగిన చర్చ ఊహించిన దానికంటే చాలా వేడిగానే సాగింది. ఈ విద్యుత్ సంక్షోభానికి, రైతుల ఆత్మహత్యలకి గత ప్రభుత్వాలదే బాధ్యత అని, కేంద్రం కూడా తెలంగాణాపట్ల కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందనే కేసీఆర్ వాదన ప్రభుత్వాన్ని కాపాడకపోగా ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్, తెదేపా, బీజేపీలను ఏకత్రాటిపైకి తీసుకువచ్చి వారు కలిసికట్టుగా ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేందుకు మాత్రం బాగా ఉపయోగపడింది. అదేవిధంగా నానాటికీ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నప్పటికీ గత ఐదు నెలలుగా నిర్లిప్తంగా కూర్చొన్న ప్రభుత్వం, శాసనసభా సమావేశాలు మొదలవుతాయనగా హడావుడిగా డిల్లీ పర్యటనలు, విద్యుత్ ఒప్పందాలు చేసుకొని తమ ప్రయత్నలోపం ఏమీ లేదని వాదించడాన్ని కూడా ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. శాసనసభ్యులను మభ్యపెట్టడానికి తప్ప వాటి వల్ల మరే ప్రయోజనమూ లేదని వాదించారు.
మూడేళ్ళ తరువాత నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని కేసీఆర్ సభలో చేసిన ప్రతిజ్ఞ వారి వాదనలను బలపరుస్తున్నట్లుగా ఉంది. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈ సమస్య ఇంత త్వరలో తీరేది కాదని ఆయన చేసిన ప్రతిజ్ఞ స్వయంగా ద్రువీకరించినట్లయింది. కనీసం మూడేళ్ళ తరువాతయినా ఆ హామీ నెరవేర్చడం సాధ్యం కాదని నెరవేరిస్తే, కేసీఆర్ కు తాను స్వయంగా ఇదే సభలో పాలతో అభిషేకం చేస్తానని తెదేపా సభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి తమ పార్టీ సిద్దంగా ఉందని అన్నారు. కానీ తెదేపా వలననే ఈ సమస్య ఏర్పడిందని కేసీఆర్, హరీష్ రావు, ఈటెల ముగ్గురూ గట్టిగా వాదించడంతో ప్రభుత్వం వారి సహకారం అవసరం లేదని చెప్పకనే చెప్పినట్లయింది.
ఈరోజు సభలో జరిగిన వాదోపవాదాలు విన్నట్లయితే, తెరాస ప్రభుత్వం, ప్రతిపక్షాలు కూడా చాలా గట్టిగా కసరత్తు చేసిందని అర్ధమవుతోంది. ప్రభుత్వం చాలా నిరంకుశధోరణితో వ్యవహరించడాన్ని తప్పుపట్టాయి. తెదేపా, బీజేపీ సభ్యులు ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, డా. లక్ష్మణ్ తదితరులు తెలంగాణా ప్రభుత్వానికి కేంద్రంతో మాట్లాడేందుకు నామోషీగా ఉంటే తామే స్వయంగా వెళ్లి మాట్లాడి, అవసరమయితే కేంద్రమంత్రులను రాష్ట్రానికి రప్పించి, పరిస్థితులు వివరించి సహాయం కోరుతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయం అందించేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ కేసీఆర్ సహాయం తీసుకోకుండా, కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించడాన్ని బీజేపీ సభ్యులు తప్పుపట్టారు.
కేంద్రంతో, పొరుగు రాష్ట్రంతో, ప్రతిపక్షాలతో సక్యంగా ఉంటూ, అందరి సహాయసహకారాలు తీసుకొంటూ సమస్యను అధిగమించేందుకు గట్టిగా కృషి చేయమని చెప్పిన తరువాతనే, కేసీఆర్ కొంత వెనక్కి తగ్గినట్లు కనబడ్డారు. పరిష్కారానికి అందరి సహకారం అవసరమని, తప్పకుండా తీసుకొంటామని, త్వరలోనే తాను స్వయంగా ప్రతిపక్షపార్టీలను డిల్లీకి తీసుకువెళతానని కెసిఆర్ ప్రకటించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా మాట్లాడి వారి సహకారం తీసుకొంటామని కేసీఆర్ తెలిపారు.
సుదీర్ఘ చర్చలు, వాదోపవాదాల తరువాత విద్యుత్ అంశంపై శాసనసభ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అందులో విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణా వాటా విద్యుత్ ఇప్పించడానికి కేంద్రమే బాధ్యత తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నిరంతరాయ విద్యుత్ పైలట్ ప్రాజెక్టును తెలంగాణా రాష్ట్రానికి కూడా కేటాయించాలని తీర్మానం చేసి ఆమోదించింది.