జయలలితకు సంఘీభావం తెలపడం సమంజసమేనా?
posted on Sep 30, 2014 @ 8:09PM
అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విదించడంతో తమిళనాట ఆమె పార్టీ కార్యకర్తలు వీరంగం ఆడి బస్సులను తగులబెట్టారు. దుఖాణాలను బలవంతంగా మూయించారు. ఆమెకు మద్దతుగా తమిళ సినీ పరిశ్రమ అంతా తరలివచ్చి చెన్నైలో ఈరోజు నిరాహారదీక్ష చేసారు. తెలంగాణాలో విజయశాంతి కూడా ఆమెకు మద్దతు ప్రకటించారు. బహుశః ఇంకా చాలా మంది ఆమెకు మద్దతు ప్రకటిస్తూ ఉండవచ్చు కూడా.
అయితే 18ఏళ్ళపాటు ఆమె కేసును క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఆమె నేరం చేసిందని అభిప్రాయపడిన ప్రత్యేక కోర్టు ఆమెకు జైలు శిక్ష వేసింది. అటువంటప్పుడు ఆమెకు మద్దతు తెలుపుతున్న వారందరూ తమ చర్యలను ఏవిధంగా సమర్దించుకొంటారు? ఆమెను కోర్టు దోషిగా నిర్ధారించి జైలు శిక్ష వేసినందుకు నిరసనగా అధికార పార్టీకి చెందినవారే బస్సులను తగులబెట్టడం, బందులు నిర్వహించడాన్ని ఏవిధంగా సమర్దించుకొంటారు? కోర్టు దోషిగా తేల్చిన వ్యక్తి కోసం యావత్ సినీ పరిశ్రమ నిరాహార దీక్ష చేయడాన్ని ఏమనాలి?
వీరందరి ప్రతిచర్యలు గమనిస్తే ఆమెకు జైలు శిక్ష విదించి కోర్టే తప్పు చేసిందేమో? అని అనిపించేలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రజలకు నచ్చిన వ్యక్తి దోషి అని తెలిసినా శిక్షించ కూడదన్నట్లుంది వారి ధోరణి. ఈ విధంగా ప్రజలు తాము అభిమానించే నేతలను దేశంలో కోర్టులు శిక్షించ కూడదని, వారు దేశంలో చట్టాలకు అతీతులుగా ఉంచాలనే ఆలోచన చాలా ప్రమాదకర ధోరణి. నిరాక్షరాస్యులు, లోకజ్ఞానం లేని వారు ఆవిధంగా ఆలోచిస్తే వారిని తప్పు పట్టలేము. కానీ అధికారంలో ఉన్నవారు, చదువుకొన్నవారు, అన్నీ తెలిసినవారు కూడా ఆమెకు సంఘీబావం పలకడం, ఆమె కోసం బస్సులు తగులబెడుతూ మరొక నేరానికి పాల్పడటం, ఆత్మహత్యలు చేసుకోవడం చాలా విచారకరం.
ఒకవేళ ఆమె తనకు ప్రత్యేకకోర్టులో అన్యాయం జరిగిందని భావిస్తే, హైకోర్టుకు లేకపోతే సుప్రీం కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేయవచ్చును. ఆమె తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని బయటకు వస్తే, ఆమెకు బ్రహ్మ రధం పట్టినా తప్పులేదు. కానీ కోర్టు దోషిగా నిర్దారించి జైలు శిక్ష విదిస్తే దానిని నిరసించడం, ఆమెకు సంఘీభావం ప్రకటించడం, ఆమె కోసం ఆత్మహత్యలు చేసుకోవడం, బస్సులు తగులబెట్టడం చాలా శోచనీయం.