చీపుర్లు పట్టుకోబోతున్న నాగార్జున, సానియా మిర్జా
posted on Oct 9, 2014 @ 10:56AM
గతంలో సినిమా కళాకారులు రాష్ట్రంలో వరదలు, తుఫానులు లేదా ఏవయినా అటువంటి ఉపద్రవ పరిస్థితులు ఏర్పడినప్పుడు అందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి భారీ విరాళాలు అందజేయడమే కాకుండా, ప్రజల మధ్యకు వెళ్లి స్వయంగా విరాళాలు సేకరించేవారు. స్వర్గీయ యన్టీఆర్ నేతృత్వంలో తెలుగు సినిమా కళాకారులు అటువంటి కార్యక్రమాలలో చాలా సార్లు పాల్గొన్నారు. అయితే కాలక్రమంలో సినిమా కళాకారులలో అటువంటి ఆలోచనలు తగ్గిపోయి వారి ద్యాసంతా నిత్యం సినిమా షూటింగులు, వ్యాపార ప్రకటనలు, టీవీ షోలలో యాంకరింగ్ చేసుకొంటూ కోట్లు కూడబెట్టుకోవడంపైనే ఉంది. వారందరూ విధిగా తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడం మరిచిపోరు కానీ ఏనాడు కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి సమాజ హితానికి పాటుపడిన దాఖలాలు లేవు. మహా అయితే తమపెరిత ఒక బ్లడ్ బ్యాంకో తెరిచి, దానికి తమ అభిమానులను రక్తం ఇమ్మని చెప్తారు తప్ప స్వయంగా రక్తం కూడా ఇవ్వరు. కానీ తాము ప్రజాసేవ చేయడం ఎన్నడూ మరిచిపోలేదని చెప్పుకోవడానికి కొందరు రాజకీయాలలో ప్రవేశిస్తే, ఆ ఓపికలేని వాళ్ళు అప్పుడప్పుడు ఎక్సిబిషన్ క్రికెట్ మ్యాచులు ఆడుకొంటారు. రాజకీయాలలో ప్రవేశించిన సినిమా నటులు ఎంత గొప్పగా ప్రజాసేవ చేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. వారి గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ‘స్వచ్చ భారత్’ కార్యక్రమానికి పిలుపినిచ్చినప్పుడు, అందులో స్వచ్చందంగా పాల్గొన్నవారిని వ్రేళ్ళ మీద లెక్కించవచ్చును. ఆయన ప్రత్యేకంగా బొట్టుపెట్టి పిలిస్తే తప్ప తమంతట తాము అందులో పాల్గొనడం నామోషీగా భావించేవారు కొందరయితే, అటువంటి కార్యక్రమాలలో పాల్గొనే బదులు ఆ సమయంలో నాలుగు కమర్షియల్ యాడ్స్ చేసుకొంటే మరో నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చనేవారు లేకపోలేదు.
మోడీ పిలుపందుకొని ముంబైలో స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా సచిన్ టెండూల్కర్, అనిల్ అంభానీ వంటి ప్రముఖులు చీపుర్లు చేతపట్టుకొని ముంబై నగరంలో రోడ్లు ఊడ్చారు. కానీ మన తెలుగు చిత్ర పరిశ్రమ నుండి కానీ ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు గానీ ఎవరూ కూడా ఇంతవరకు స్వచ్చందంగా ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. కారణం తమను ఎవరూ బొట్టు పెట్టి పిలవకపోవడమే.
కానీ అనిల్ అంభానీ పిలుపందుకొని హీరో నాగార్జున, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా త్వరలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. అయితే ఆ పని వారిని ఎవరూ పిలవక మునుపే చేసి ఉండి ఉంటే అది వారికి మరింత వన్నె తెచ్చేది.
జీవితంలో డబ్బు, కార్లు, బంగ్లాలు, ఆస్తులు, కీర్తి ప్రతిష్టలు ఆర్జించడం ఎంత ముఖ్యమో తమకు అవన్నీ కల్పించిన సమాజం కోసం ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం కూడా అంతే ముఖ్యమని, అది తమ బాధ్యతా కూడా అని మన సినీ తారలు, క్రీడాకారులు ఎప్పుడు గ్రహిస్తారో?ఈవిధంగా వారిని ప్రతీసారి ఎవరో ఒకరు ఏదో ఒక కార్యక్రమానికి బొట్టుపెట్టి ఆహ్వానించినప్పుడే కదలడం కంటే వారంతట వారే చొరవ తీసుకొని రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడితే వారికీ సమాజంలో మరింత గౌరవం పెరుగుతుంది. ప్రజలు కూడా సంతోషిస్తారు.