జయలలిత కేసు ఫార్మాట్ మనకి సూటవుతుందా?
posted on Oct 7, 2014 @ 12:17PM
పిచ్చి పూర్తిగా తగ్గిపోయింది ఇక రోకలి తలకు చుట్టూ అన్నట్లుంది తమిళనాట జయలలిత అభిమానుల పరిస్థితి. ఈరోజు కర్ణాటక హైకోర్టు ఆమె బెయిలు పిటిషను విచారణకు చేప్పట్టబోతుండటంతో తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఆమె అభిమానులు, ఏ.ఐ.డి.యం.కె. పార్టీ కార్యకర్తలు, నేతలు వీరావేశంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరావేశంతో ఎందుకంటే, ఆమెకు బెయిలు దొరకాలని కొందరు తమ శరీరాలను సూదులు, బల్లేలు, కత్తులతో పొడుచుకొంటుంటే, మరికొందరు అగ్ని గుండాల మీద నడుస్తూ దేవుళ్ళకు మొక్కుకొంటున్నారు.
అటువంటి సాహాసాలు చేయలేనివారు విస్తరాకు కూడా లేకుండా గుళ్ళలో ఒట్టి నేల మీద భోజనాలు వడ్డించుకొని తింటూ జయలలితకు బెయిలు దొరకాలని దేవుళ్ళను వేడుకొంటున్నారు. మదురై జిల్లాలో ఏ.ఐ.డి.యం.కె. పార్టీ కార్యకర్తలు కొందరు గుండు కొట్టించుకొని కామాక్షమ్మ గుడిలో అంగ ప్రదక్షిణాలు చేస్తున్నారు.
పార్టీకి చెందిన మరి కొంతమంది సౌండ్ పార్టీలు ‘మహా సుదర్శన హోమాలు’, ‘రుద్ర యజ్ఞాలు’ నిర్వహిస్తుంటే, అంత శక్తి లేని చోట మోటా నేతలు స్వామీ కార్యం స్వకార్యం అన్నట్లుగా జయలలిత విడుదల కోసం ఆమె పేరిట గుళ్ళలో పోటాపోటీగా అర్చనలు, అభిషేకాలు చేయించేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు, మానవ హారాలు, రాస్తా రోకోలు షరా మామూలుగానే సాగిపోతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజు అన్ని గుళ్ళు, రోడ్లు ఏ.ఐ.డి.యం.కె. పార్టీ కార్యకర్తలతో కిటకిటలాడిపోతున్నాయి. అయితే ఇవన్నీ నిజంగా ఆమె విడుదల కోరుతూ చేస్తున్నావా లేక ఆమె దృష్టిలో పడేందుకు, ఆమెను ప్రసన్నం చేసుకొనేందుకు ఆ పార్టీ నేతలే చేయిస్తున్నవా? అనే వెర్రి ప్రశ్న వేస్తున్నారు కొందరు అజ్ఞానులు, పామరులు.
ఏమయినప్పటికీ ఒకప్పుడు మనోళ్ళు ఎవరయినా జైల్లోకి వెళ్ళినప్పుడు, ఏదో జైలు గేటు వరకు వెళ్లి సాగనంపి రావడమే కానీ మనోళ్ళు ఎవరూ కూడా గట్టిగా ఈ మాత్రం హడావుడి చేయలేకపోయారు. బహుశః ఇటువంటి కేసులకీ ఇటువంటి రకరకాల కార్యక్రమాలు నిర్వహించవచ్చనే ఐడియా మనోళ్ళకి లేకపోవడం చేతనే ఆ పొరపాటు జరిగి ఉండవచ్చును. కనుక ఇప్పుడు తమిళనాడులో ఏ.ఐ.డి.యం.కె. పార్టీ కార్యకర్తలు, నేతలు నిర్వహిస్తున్న విభిన్నమయిన ఈ వ్రత విధి విధానాలన్నిటినీ మనం కూడా క్షుణ్ణంగా అవగాహన చేసుకొని, జాగ్రత్తగా గుర్తుంచుకొంటే రేపు మనోళ్ళు ఎవరయినా ఇటువంటి కేసుల్లో జైలుకి వెళితే అప్పుడు మనమూ తూచా తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ ఎంచక్కా చేసుకోవచ్చును.