కేసీఆర్ పై నారా లోకేష్ విమర్శలు
posted on Oct 7, 2014 @ 1:37PM
నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాలలోకి రాకపోయినా ఇరు రాష్ట్రాలలో, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చాలా నిశితంగా గమనిస్తూ, అవసరమయినప్పుడు ప్రత్యర్ధ పార్టీల నేతలపై ట్వీటర్-అస్త్రాలను ఎక్కుబెడుతుంటారు. “తెలంగాణాలో కరెంటు కష్టాలకు చంద్రబాబే కారణమని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలకు బదులిస్తూ, తెలంగాణాలో నీళ్ళు లేవు...కరెంటు లేదు..ఉద్యోగాలు లేవు...రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. అయినప్పటికీ ఆయన అన్నిటికీ చంద్రబాబు నాయుడునే నిందిస్తుంటారు. బహుశః అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీపడలేకనే విమర్శలు చేస్తున్నారేమో?” అని ట్వీట్ చేసారు.
ఎన్నికల సమయంలో తమ పార్టీని గెలిపిస్తే తెలంగాణాను ‘బంగారు తెలంగాణా’గా మార్చేస్తామని హామీలు గుప్పించిన కేసీఆర్, ఇప్పుడు సర్వరోగ నివారిణి అన్నట్లు, ప్రతీదానికి గత ప్రభుత్వాలను నిందించడం అలవాటుగా మార్చుకొన్నారు. ఒకవేళ గత ప్రభుత్వాలు తప్పులు చేసి ఉండి ఉంటే, వాటిని సరిదిద్ది బంగారి తెలంగాణా సృష్టించేందుకు కృషి చేయాలి కానీ నిత్యం అదేపనిగా గత ప్రభుత్వాలు తప్పులు నెమరు వేసుకోవడం వలన రాష్ట్ర పరిస్థితుల్లో మార్పు కనబడదు.
నిజానికి ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణా రాష్ట్రం ఇప్పుడు చాలా విషయాలలో బలంగా ఉంది. అయినప్పటికీ ఈ నాలుగు నెలలలో ఆశించినంత గొప్ప మార్పులు కనబడలేదు. పైగా ప్రస్తుత కరెంటు కష్టాలు తీరాలంటే మరో మూడేళ్ళు పడుతుందని స్వయంగా కేసీఆరే చెపుతున్నారు. కరెంటు కొరత వేదిస్తున్నప్పుడు పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించడం కూడా చాలా కష్టమవుతుంది. అంటే ముందుగా కరెంటు సమస్యలు తీరితే తప్ప అభివృద్ధిలో ఆంధ్రాతో పోటీ పడటం సాధ్యం కాదని స్పష్టమవుతోంది.
తెలంగాణాతో పోలిస్తే చాలా సమస్యలను ఎదుర్కొంటున్న ఆంద్రప్రదేశ్ మాత్రం భవిష్యత్ పై చాలా ఆశాజనకంగా ఉండటం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్షాదక్షతల మీద ప్రజలకున్న నమ్మకమేనని చెప్పవచ్చును. వారి అంచనాలను నిజం చేస్తున్నట్లు, అధికారం చేప్పట్టిన మూడు నెలలలోనే రాష్ట్రాన్ని కరెంటు కోతల నుండి విముక్తి చేసారు. కానీ నేటికీ తెలంగాణా ను కరెంటు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్, చంద్రబాబు నాయుడుని నిందిస్తుండటంతో ఆయన కుమారుడు లోకేష్ ఘాటుగా జవాబిచ్చారు.