జగన్‌కి తెలంగాణ మీద లవ్వెందుకు పుట్టిందంటే...
posted on Oct 10, 2014 @ 6:25PM
జగన్ పార్టీ తెలంగాణలో ఎప్పుడో బాల్చీ తన్నేసింది. తెలంగాణలో వైకాపా అంత్యక్రియలు, దినవారాలు ఎప్పుడో అయిపోయాయి. అప్పటి నుంచి జగన్ బాబు ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైపోయి తన ప్రతాపం అక్కడే చూపిస్తున్నారు. ఎవరి పేరు చెబితే ఆంధ్రప్రదేశ్ ప్రజల కడుపు మండిపోతుందో ఆ వ్యక్తి కేసీఆర్‌తో జగన్ దోస్తీ కట్టి స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అంటూ పాటలు పాడుతున్నాడు. ఆ పాటలనే తన మీడియాలో కూడా వినిపిస్తూ కేసీఆర్ మీద తనకున్న భక్తిని యథాశక్తి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ అధికారం చేపట్టిన ఈ నాలుగు నెలల కాలంలో తెలంగాణలో ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా వాటి గురించి పల్లెత్తు మాట కూడా అనకుండా జగన్ తెలంగాణ అంటే తనకు ఎంతమాత్రం పట్టనట్టే వ్యవహరించాడు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ గానీ, ఆయన పార్టీ గానీ తిరిగి తెలంగాణలో ఎంటరయ్యే అవకాశం లేదని అందరూ అనుకున్నారు.
అయితే జగన్ బాబుకి సడెన్‌గా తెలంగాణ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. కేసీఆర్ సరిగా పరిపాలించడం లేదన్న విషయం గుర్తుకొచ్చింది. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో తన పార్టీకే అధికారం దక్కేస్తుందని ఆశ పుట్టుకొచ్చింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతని తన సోదరీమణి షర్మిలకి అప్పగించేశాడు. వైఎస్సార్ పోయినప్పుడు తెలంగాణలో కూడా ఎంతోమంది గుండె ఆగి చనిపోయారట. వాళ్ళ కుటుంబాలని ఐదేళ్ళ తర్వాత పరామర్శించి రమ్మంటూ షర్మిలకి పురమాయించేశాడు. ఇదంతా చూస్తుంటే జగన్‌కి తెలంగాణ మీద సడెన్‌గా ఇంత లవ్వు ఎందుకు పుట్టిందా అనే సందేహం అందర్లోనూ కలిగింది.
తెలంగాణలో తిరిగి కాలు మోపడం వెనుక కారణాలని జగన్ పైకి ఎన్ని చెబుతున్నప్పటికీ, మొన్నటి వరకూ తన భుజాన ఎక్కించుకుని తిరిగిన కేసీఆర్ని ఇప్పుడు సడెన్‌గా విమర్శిస్తున్నప్పటికీ జగన్ పార్టీ రీ ఎంట్రీ వెనుక చాలా పెద్ద ప్లానే వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జగన్, షర్మిల పాత్రధారులైన ఆ ప్లానుకు సూత్రధారి మరెవరోకాదు.. కేసీఆరేనని కూడా అంటున్నారు. ఈ ప్లాన్ వెనుక వున్న సంగతులను కూడా విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వెలమ దొరల సామాజిక వర్గం అధికారంలోకి రావడంతో రెడ్డి సామాజికవర్గం దిగాలు పడిపోయింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వుండగా తెలంగాణ ప్రాంతంలో మొన్నటి వరకు హవా నడిపిన రెడ్డి సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దిగాలు పడిపోయింది. రాష్ట్ర రాజకీయాలను శాశించే బలమైన నాయకుడు తమ సామాజిక వర్గం నుంచి ఎవరైనా వస్తారా అన్న ఎదురుచూపు ఆ సామాజికవర్గంలో వుంది. కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులు వున్నప్పటికీ వాళ్ళు చురుకుగా వ్యవహరించే పరిస్థితి లేదు. కేసీఆర్ గవర్నమెంట్‌ని ఎదుర్కొనే శక్తీ లేదు. దాంతో ఆ సామాజిక వర్గం ఎంతో లోటుగా భావిస్తోంది. ఆ లోటును గ్రహించిన చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఆ సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం మీద బాణంలా సంధించి వదిలారు. బాగా చదువుకున్నవాడు, తెలివైనవాడు, మాటకారితనం వున్నవాడు, ముక్కుసూటిగా వ్యవహరించేవాడూ అయిన రేవంత్‌రెడ్డి గత కొంతకాలంగా కేసీఆర్ ప్రభుత్వం మీద మాటల తూటాలు విసురుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ‘దొరల’ మీదే తన పోరాటం అంటున్న రేవంత్ రెడ్డి మాటలు తెలంగాణలోని రెడ్డి సామాజికవర్గానికి కొత్త ఆశలు కలిగేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సామాజికవర్గం తెలంగాణ తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులు అవుతూ చేరువ అవుతున్నారు.
రెడ్డి సామాజికవర్గం తెలుగుదేశం పార్టీకి చేరువ కావడాన్ని గ్రహించిన కేసీఆర్ తన చిరకాల మిత్రుడు జగన్మోహన్‌రెడ్డిని మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ చేసి రెడ్డి సామాజికవర్గం పూర్తిగా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళకుండా కాపాడుకునే ప్రయత్నం ప్రారంభించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం జగన్ పార్టీ నాయకులు పైపైకి తనను విమర్శిస్తూ రెడ్డి సామాజిక వర్గాన్ని చెయ్యిజారిపోకుండా చూసుకుంటే ఆ తర్వాత జగనూ, తానూ బాబాయ్, అబ్బాయ్‌లా కలసిపోతే ఆయన సామాజిక వర్గం కూడా తనతో దోస్తీ చేస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇదంతా ఆలోచించే కేసీఆర్ మళ్ళీ తెలంగాణలో వైకాపాని సమాధిలోంచి బయటకి వెలికి తీయించారని విశ్లేషిస్తున్నారు.