మరో ఇద్దరితో పవన్ కళ్యాణ్ కటీఫ్
posted on Dec 10, 2014 @ 5:54PM
‘పవర్‌స్టార్’ పవన్ కళ్యాణ్ తానే స్వయంగా అందర్నీ దూరం చేసుకుంటూ వుంటారా? లేక పవన్ కళ్యాణ్‌కే అందరూ దూరమైపోతూ వుంటారా? ఈ ప్రశ్న ‘‘విత్తు ముందా.. చెట్టు ముందా’’ అనే ప్రశ్నకంటే చాలా క్లిష్టమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానాలు వెతికే రిస్కు చేయడం కంటే... అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమయిందో ఆ పాయింట్లోకి వెళ్తే మంచిది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనూ, వ్యక్తిగతంగానూ ఆయనకి ఎంతోమంది దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆటోమేటిగ్గా దూరమయ్యారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ), ‘జనసేన’ పార్టీకి సోలో ప్రతినిధిగా వున్న రాజు రవితేజ కూడా చేరారు. అరె... మొన్నటి వరకూ వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్‌కి జిగిరీ దోస్తుల్లా వున్నారే... ఇంతలోనే ఏమైందన్న సందేహం కలుగుతోంది కదూ?
ఈమధ్యకాలంలో పవన్ కళ్యాణ్‌కి బాగా సన్నిహితమైన వ్యక్తుల్లో పీవీపీ కూడా ఒకరు. పీవీపీ అంటే సామాన్యమైన వ్యక్తేమీ కాదు... పెద్ద వ్యాపారవేత్త. సినిమా రంగంలో కూడా విజయాలు సాధించాడు. అలాంటి పీవీపీ పవన్ కళ్యాణ్‌తో సినిమాలు తీయాలన్న ఉద్దేశంతో ఆయనకి చేరువయ్యారు. అలా పవన్‌కి, పీవీపికి మంచి స్నేహం కుదిరింది. ఆ స్నేహంతోనే ‘జనసేన’ పార్టీకి సంబంధించిన రెండు భారీ బహిరంగసభల్ని పీవీపీ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. అందుకు ప్రత్యుపకారంగానే గడచిన ఎన్నికలలో విజయవాడ పార్లమెంట్ స్థానానికి తెలుగుదేశం టిక్కెట్ కోసం పీవీపీని పవన్ కళ్యాణ్ రికమండ్ చేశారు. చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ మాట కాదనలేక పీవీపీకి పార్లమెంట్ టిక్కెట్ కూడా ఇచ్చారు. అయితే ఆ టిక్కెట్ని ఆశించిన తెలుగుదేశం నాయకుడు కేశినేని నాని పట్టుపట్టడంతో చంద్రబాబు పీవీపీకి సారీ చెప్పేశారు. అయితే ఆ దశలో పవన్ కళ్యాణ్ పట్టుబట్టి తనకు టిక్కెట్ ఇప్పిస్తారని పీవీపీ ఆశించారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎక్కువ చొరవ చూపించకపోవడంతో విజయవాడ ఎంపీ కావాలన్న పీవీపీ కల కరిగిపోయింది.
తన కలను నిజం చేసే విషయంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా చొరవ చూపలేదని పీవీపీ మనసు కష్టపెట్టుకున్నారని తెలుస్తోంది. అందుకే విజయవాడలో భారీ షాపింగ్ మాల్‌ని నిర్మించిన పీవీపీ దాని ప్రారంభోత్సవానికి సచిన్ టెండూల్కర్ని ఆహ్వానించారు. అప్పటి వరకూ సన్నిహితంగా వున్న పవన్ కళ్యాణ్‌ని మాత్రం ఆహ్వానించలేదు. అక్కడితో ఆగని పీవీపీ జనసేన సభల కోసం తాను ఖర్చుపెట్టిన డబ్బుతోపాటు, సినిమా కోసం ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేయాలని పవన్ కళ్యాణ్‌ని డిమాండ్ చేశారట. దాంతో పవన్ కళ్యాణ్ రెండు కోట్లు మినహా మిగతా డబ్బంతా తిరిగి ఇచ్చేశారట. ఆ రెండు కోట్లు త్వరలో సర్దుతానని చెప్పారట. ఇలా వీరిద్దరి స్నేహ సుమం వాడిపోయింది.
ఇక పవన్ కళ్యాణ్‌కి దూరమైన మరో మిత్రుడు రాజు రవితేజ. పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీని పెట్టకముందు రాజు రవితేజ అంటే ఎవరికీ తెలియదు. పవన్ కళ్యాణే స్వయంగా రాజు రవితేజ తన పార్టీ వ్యవహారాలన్నీ చూస్తారని ప్రకటించడంతో రాజు రవితేజ సడెన్‌గా లైమ్ లైట్‌లోకి వచ్చారు. చాలాకాలంపాటు పవన్ కళ్యాణ్ అంటే రాజు రవితేజ, రాజు రవితేజ అంటే పవన్ కళ్యాణ్ అన్నట్టుగా వీరిద్దరి మధ్య స్నేహ బంధం వెల్లివిరిసింది. అయితే ఆ తర్వాత ఏమైందోగానీ రాజు రవితేజని పార్టీ వ్యవహారాల నుంచి పవన్ కళ్యాణ్ దూరంగా పెట్టడం ప్రారంభించారు. పార్టీకి సంబంధించి ఏదైనా చెప్పాలంటే తానే చెబుతానని తన పార్టీకి వేరే ప్రతినిధులెవరూ లేరని పవన్ వెల్లడించడంతో రాజు రవితేజ ఎంత వేగంగా లైమ్ లైట్లోకి వచ్చారో అంతే వేగంగా చీకట్లోకి వెళ్ళిపోయారు. ఇదీ జరిగింది. ఇక భవిష్యత్తులో పవన్ కళ్యాణ్‌కి ఎవరెవరు చేరువవుతారో.. ఎవరెవరు దూరమవుతారో వేచి చూడాలి.