అందరినీ ఊరిస్తున్న తమిళనాడులో రాజకీయ శూన్యత
posted on Dec 10, 2014 @ 11:04AM
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆమె బెయిలు పొందినప్పటికీ ఆమెపై అనర్హత వేటు పడింది. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమయిన డి.యం.కె.పార్టీ అధినేత కరుణానిధి (90) వయోభారంతో పార్టీని నడిపించలేక అవస్థలు పడుతుంటే, అతని ఇరువురు కుమారులు అళగిరి, మరియు స్టాలిన్ తండ్రి తరువాత పార్టీని స్వంతం చేసుకొనేందుకు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొంటుండటంతో ఆ పార్టీ కూడా అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతోంది.
ఇదే అదునుగా రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పాలనే ఆలోచనతో రాష్ట్ర పి.సి.సి.అధ్యక్షుడుగా ఉన్న వాసన్ కాంగ్రెస్ పార్టీని వీడి స్వంత కుంపటి పెట్టుకొన్నారు. తమిళ సినిమా రంగాన్ని శాసిస్తున్న సూపర్ స్టార్ రజనీ కాంత్ ని తన పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు గట్టిగానే చేసారు. కానీ అవీ ఫలించలేదు. రాష్ట్రంలో నెలకొన్న ఈ రాజకీయ అస్థిరతను చూసి రజనీకాంత్ కూడా రాజకీయాలలోకి ప్రవేశించాలని కొంచెం ఊగిసలాడారు. కానీ దైర్యం చేయలేకపోయారు.
అలాగే తమిళనాట విశేష ఆదరణ ఉన్న మరో హీరో విజయ్ కూడా రాజకీయపార్టీ పెట్టేందుకు ఊగిసలాడుతున్నారు. ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది అభిమానులు, 350 అభిమాన సంఘాలు ఉన్నందున, వారి మద్దతుతో రాజకీయాలలో చాల తేలికగా రాణించవచ్చని భావించారు. అందుకు ఆయన అభిమానులు కూడా మద్దతు తెలిపారు. కానీ ఆయన తండ్రి మాత్రం గట్టిగా వ్యతిరేకించారు. సినీ రంగంలో పతాక స్థాయికి చేరి మంచి పేరు, డబ్బు, అభిమానుల ఆదరణ సంపాదించుకొంటున్న ఈ సమయంలో దానిని వీడి, రాజకీయాలలో ప్రవేశించడం అంటే ఆత్మహత్యతో సమానమని ఆయన గట్టిగా హెచ్చరించడంతో విజయ్ కూడా ఆ ఆలోచన విరమించుకొన్నారు.
అయితే రాజకీయాలలో చేరాలనే ఆ దురద మాత్రం వదిలించుకోలేక పోయారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలలో దేనిలోనూ చేరే అవకాశం, ఆలోచనా రెండూ లేవు కనుక ఆయన త్వరలో బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు తాజా సమాచారం. దేశంలో అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని తహతహలాడుతున్న బీజేపీ కూడా ఆయన వంటి మంచి ప్రజాధారణగల నేత వచ్చి చేరుతానంటే తప్పకుండా స్వాగతిస్తుంది. ఆయన కనుక చేరితే తమిళనాట నెలకొన్న ఈ రాజకీయ శూన్యతను బీజేపీ భర్తీ చేసేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేయవచ్చును. బీజేపీ కాక మరో నాలుగయిదు ప్రాంతీయ పార్టీలు కూడా రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.
అయితే జయలలితపై అనర్హత వేటు పడినప్పటికీ, ఆమె అధికారంలో లేనప్పటికీ, ప్రభుత్వాన్ని నడుపుతున్నది మాత్రం ఆమె వీర విధేయులే. పైగా అధికార అన్నాడియంకె ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉంది. మరోనాలుగున్నరేళ్ళ వరకు అసెంబ్లీకి ఎన్నికలు కూడా లేవు. కనుక ఆమె కూడా చాలా నిశ్చింతగానే కనిపిస్తున్నారు.