ఎర్ర పార్టీలకీ కులం స్టిక్కర్లు ..
posted on Dec 8, 2014 @ 2:56PM
కడవంత గుమ్మడికాయ కూడా కత్తిపీటకు లోకువేనన్నట్లుగా ఏ రంగంలో ఎంత సుప్రసిద్దులయినప్పటికీ వారు కూడా వారి కులానికి, మతానికీ, ప్రాంతానికీ కట్టుబడి వ్యవహరించక తప్పదు. భారతదేశం రాజకీయాలలో కుల మతాల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తాము 100 పర్సంట్ లౌకికవాద పార్టీలమని భుజాలు చరుచుకొనే కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా ఈ కులసమీకరణలు లేకుండా ఏ శుభకార్యం తలపెట్టవు అంటే అతిశయోక్తి కాదు. అందుకు కాంగ్రెసే కాదు ఏ రాజకీయ పార్టీ కూడా మినహాయింపు కాదు లెఫ్ట్ పార్టీలతో సహా. కులమతాల లెక్కలకు తాము అతీతులమని చెప్పుకొనే లెఫ్ట్ పార్టీలు, చివరికి మావోయిష్టులలో కూడా అప్పుడప్పుడు ఈ కులసమీకరణాలు సరి చూసుకోక తప్పడం లేదీరోజుల్లో. అందుకే జనాలు కూడా కులాల వారిగా కార్తీకమాసంలో వన(కుల) భోజనాలు ఏర్పాటు చేసుకోవడం అందరికీ తెలిసిందే.
ఒకప్పుడు అవి కేవలం విందు వినోద సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితమయ్యి ఉండేవి. కానీ ప్రజలలో కుల చైతన్యంతో బాటు రాజకీయ చైతన్యం కూడా క్రమంగా పెరుగుతుండటంతో, ఈ వన (కుల)భోజనాలకి తమ ‘కులపోడు’ అయిన ఏ రాజకీయ నాయకుడినో తోలుకొని రావడం ఇప్పుడు ఆనవాయితీగా మారిపోయింది. ఆ విధంగా ఆ నేతతో పరిచయం చేసుకొని ఎప్పుడయినా అవసరపడితే తమ ఆ కులపోడి సహాయం పొందాలనే ఆలోచన నిర్వాహకులదయితే, కులపోళ్ళు ఓట్లు అంటే పెరట్లో కోళ్ళవంటివని నమ్మే సదరు నేతలు కూడా వారు పిలవగానే ఆ పేరంటానికి వచ్చి హాజరు వేయించుకొని, టోటల్ ఎన్ని కోళ్ళు ఉన్నాయో ఓసారి లెక్క చూసుకొన్నాక, తాము కులపోళ్ళకి ఏవిధంగా ప్రిఫరెన్స్ ఇస్తున్నదీ చెప్పుకొని, అవసరమయితే తమని సంప్రదించమని ఒక అభయహస్తం పడేసి, ఎన్నికల సమయంలో గుర్తుంచుకోమని ఒక విన్నపం చేసుకొని దర్జాగా వచ్చిన కారులోనే వెళ్ళిపోతారు. ఆవిధంగా వన(కుల) భోజనాలు పూర్తవుతుంటాయి.
ఇక విషయంలోకి వస్తే, ఈ వన(కుల) భోజనాలకి రమ్మనిపిలిస్తే రాము పొమ్మని చెప్పే సాహసం ఎవరూ చేయలేరు. చివరికి కులం, మతం పేరు చెపితే కళ్ళెర్ర జేసే ఎరెర్ర పార్టీ ఓళ్ళు కూడా కాదనలేని పరిస్థితి ఏర్పడింది. అలాగని వస్తే మీడియావాళ్ళు ఇలా కాకుల్లా పొడిచేసే ప్రమాదం ఉంటుంది. చట్టానికి ఎవరూ అతీతులు కానట్లే ఎవరూ కూడా కులానికి అతీతులు కారు గనుక ఎర్రనేతలు ఫోటోలు బ్యానర్లు కూడా వన(కుల) భోజనాలలో ప్రత్యక్షం అవుతున్నాయి. దైర్యం ఉన్నవాళ్ళు చడీ చప్పుడు చేయకుండా వెళ్లివచ్చేస్తున్నారు. లేకుంటే ఏదో ఊర్లోనో, రాష్ట్రంలోనో ఓ ఎర్ర మీటింగ్ పెట్టుకొని తప్పించుకొంటారు. అయినప్పటికీ నిర్వాహకులే కొంచెం చొరవ తీసేసుకొంటూ ‘ఈడూ మన కులపోడే’ అనే ఫోటో బ్యానర్లు పెట్టేసుకొని మమ అనిపించేస్తున్నారు.
ఇటువంటి సమస్యే సీపీయం తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి టీ. వీరభద్రం, ఖమ్మం జిల్లా కార్యదర్శి పి. సుదర్శన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బి. హేమంత్ రావు, పార్టీ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వర రావు, సీపీఐ (యం.యల్.) న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర నేత పోటు రంగ రావు, తదితరుల ఫోటోలున్న ఫ్లెక్సీ బ్యానర్లు ఇటీవల జిల్లాలో నిర్వహించిన వన(కుల) భోజనాల కార్యక్రమంలో దర్శనమిచ్చాయి. అయితే వాటిని ఖండిస్తే ఏమవుతుందో వారికీ తెలుసు కనుక తమ ఫోటోలు, బ్యానర్లు పెట్టుకొనంత మాత్రాన్న తమకి ఆ కుల ఫీలింగ్ అంత లేదని చెప్పుకొనేందుకు మిక్స్ డ్ విజిటేబిల్ కర్రీ లాగ అందరు కులపోళ్ళన్ని పోగేసి మళ్ళీ వారు ‘సమానత్వ భోజనాలు’ అనే కార్యక్రమాలు నిర్వహించ వలసివచ్చింది.
ఎన్నికలు వచ్చే వరకు ఈ కుల, మతాతీతం ట్యాగ్ కాపాడుకోవడం కోసం ఈ తిప్పలు తప్పవు. కానీ ఎన్నికలలో మాత్రం కంప్యూటరో లేకపోతే ఓ కాలిక్యులెటర్ పట్టుకొని మరీ పక్కగా కులసమీకరణాల లెక్కలు సరిచూసుకొన్న తరువాతనే సీట్ల కేటాయింపులు చేస్తారు. దానిని బట్టే జనాల ఓట్లు కూడా పడుతుంటాయి. ఏమి చేస్తాం కులానికి ఎవరూ అతీతులు కారాయె మరి!