జగన్ కి ఆ వివరాలు ఎందుకు?
posted on Dec 9, 2014 @ 8:45PM
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆదాయం, ఖర్చులు, అప్పులు, ప్రణాళికేతర ఖర్చులు వంటి వివరాలు కోరుతూ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ వ్రాసారు. కేంద్రప్రభుత్వం తన ఆదాయ, వ్యయాలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారిక వెబ్ సైట్లో ఉంచుతుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా ఈ వివరాలన్నిటినీ ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో పెడుతున్నట్లయితే ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితి తెలుసుకొనే అవకాశం కలుగుతుందని సూచించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశాలపై అర్ధవంతమయిన చర్చలు చేయాలనే ఉద్దేశ్యంతోనే తానీ వివరాలు కోరుతున్నానని, అందువల్ల అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోగా తను కోరిన వివరాలను తనకు అందజేయాలని ఆయన ముఖ్యమంత్రిని లేఖలో కోరారు.
అయితే దానికి ఆర్ధిక మంత్రి చాలా ఘాటుగా బదులిచ్చారు. అనేక ఆర్ధిక నేరాలలో నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి అటువంటి వివరాలు అడిగే హక్కు లేదని ఆయన అన్నారు. వీలయితే అతనే తన అక్రమాస్తుల వివరాలను ప్రభుత్వానికి అందించి, తన అధికారిక వెబ్ సైట్లో కూడా ఆ వివరాలు పెడితే బాగుంటుందని సూచించారు. యనమల మంచి ధీటుగా, చాలా ఘాటుగానే జవాబు ఇచ్చారు.
అయితే జగన్మోహన్ రెడ్డి ఆర్ధిక నేరాలలో నిందితుడిగా ఉన్నప్పటికీ ఆయన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత కనుక ఆ వివరాలు కోరే హక్కు అతనికి ఉంటుంది. ఒకవేళ ఆయనకు నిజంగా ఆ వివరాలు కావలసి ఉండి ఉంటే, ఆయన ముఖ్యమంత్రికి ఈ విధంగా లేఖ వ్రాసే బదులు, ఒక ప్రజా ప్రతినిధి హోదాలో లేదా క్యాబినెట్ ర్యాంక్ హోదా అనుభవిస్తున్న ఒక ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో సంబంధిత అధికారులకు నేరుగా లేఖ వ్రాసి ఉండేవారు. అప్పుడు వారు ఆయన కోరిన వివరాలను అందజేయడానికి నిరాకరిస్తే అప్పుడు ఆయన ఆ సంగతిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళి ఉంటే, ఆయనను ఎవరూ అనుమానించే, విమర్శించే అవకాశం ఉండేది కాదని చెప్పవచ్చును.
కానీ ఆయన ఉద్దేశ్యం ఆ వివరాలు సేకరించడం కాదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇటువంటి సమాధానం ఏదో రాబట్టడమే కనుక ముఖ్యమంత్రికి లేఖ వ్రాసారు. ఆయన హించినట్లే ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ఘాటుగా బదులిచ్చారు. కనుక ఇప్పుడు ప్రభుత్వం ఏదో దాస్తోందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేయవచ్చును.
కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుండి కూడా పాలనలో పూర్తి పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నారు కనుకనే ఆయన క్రమంగా కాగితాలు, ఫైళ్ళ స్థానంలో కంప్యూటర్లను ప్రవేశపెడుతున్నారు. క్రిందటి సారి జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఎక్కడా కాగితం ఉపయోగించకుండా కంప్యూటర్లతోనే ఆయన సమావేశం నిర్వహించారు. ఆ కంప్యూటర్లలో నిక్షిప్తమయిన వివరాలు అన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ పద్దతిలో ఆన్ లైన్లో భద్రపరిచారు. ఒకవేళ పాలనలో లొసుగులు, అక్రమాలు జరుగుతున్నట్లయితే ఎవరూ కూడా ఈ విధంగా వివరాలను కంప్యూటర్లలో భద్రపరిచే సాహసం చేయరని జగన్ కూడా గుర్తించవలసి ఉంది. అతను నిజంగా సభలో అర్ధవంతమయిన చర్చల కోసమే ఆ వివరాలు కోరి ఉండి ఉంటే ప్రభుత్వం ఆ వివరాలను క్షణాలలో అతనికి అందజేయగలదు. కానీ అతను ప్రభుత్వంపై ఏదో రకంగా బురద జల్లే ఉద్దేశ్యంతోనే ఈవిధంగా లేఖ వ్రాసి ఉండవచ్చనే అభిప్రాయంతోనే బహుశః యనమల ఆ విధంగా సమాధానం ఇచ్చి ఉండవచ్చును. ఏమయినప్పటికీ అసెంబ్లీ సమావేశాలలో ఇది కూడా ఒక వివాదానికి దారి తీయవచ్చును. దీనిపై సభలో అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య వాగ్వాదం జరగడం తధ్యం.