Read more!

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పిన ఆత్మ గుణాలు ప్రాశస్త్యం !!

 

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పిన ఆత్మ గుణాలు ప్రాశస్త్యం !!

జ్ఞానం హి తేషా మధికో విశేషః 

జ్ఞానేన హీనాః పశుభిస్సమానాః ॥ 

ఆహార నిద్రా భయ మైథునాదులు సర్వజంతు సామాన్యంగా మనిషికి కూడా ఉన్నాయి. వాటికంటే ప్రత్యేకమైనది ఏదైనా మనిషిలో ఉంది అంటే అది వివేకం, ఆలోచనాశక్తి, విచక్షణ. అందుకే మనుషులు వాటన్నిటికి ప్రత్యేకంగా ఉన్నారు.   

ఒకసారి ఈ సృష్టిలో పరిణామ క్రమం గమనిస్తే శిలలకంటే వృక్షాలు, వాటి కంటే పశుపక్ష్యాదులు, వాటికంటే మనుష్యులు ఉత్తమంగా కనిపిస్తారు.  ఇతర జంతుజాలం కంటె శరీర నిర్మాణంలో, బుద్ధిలో మనుషులు పూర్ణులు కనుక 'పురుష' శబ్దం సమస్త మానవ పరంగా మన శాస్త్రాలు వాడాయి. 

వివేచనాశక్తిని వినియోగించి భౌతిక విజ్ఞానాన్ని, ఇతర కళల్ని ఆవిష్కరించడం మానవ మేధ మాత్రమే చేయగలదు. ఇంతకంటే అధికమైన పరమాత్మ జ్ఞానాన్ని సాధించడమే పరిణామంలో పరాకాష్ట దశ. ఆ దశను పొందేందుకు ఆధ్యాత్మిక విజ్ఞానసాధనలు అనేకంగా ఆవిష్కరించారు మహర్షులు. మేధాశక్తిని తపస్సుచేత మరింత విస్తృతం మరియు అభివృద్ధి చేసినవాళ్ళు మహర్షులు. ఆ మేధస్సు వల్ల వాళ్ళు అవిష్కరించినవే ఆధ్యాత్మిక విషయాలు. 

యోగం, ధ్యానం, యజ్ఞం, ఆరాధన, సత్ప్రవర్తన, నియమబద్ధమైన జీవన సరళి ఇవన్నీ మానవునిలో స్వయం ప్రజ్ఞను శుద్ధి చేస్తాయి. మన భారతీయుల జీవన విధానమంతా ప్రాచీనకాలం నుండి ఇలా గొప్ప మార్గంలో సాగుతూ వచ్చింది.

మనిషికి  జన్మతః లభించిన ఇంద్రియశక్తుల్ని, బుద్ధిశక్తుల్ని వినియోగించుకుంటూ సుఖంగా బ్రతకడం సామాన్య జీవనం. వాటిని పదును పెట్టుకుంటూ అభివృద్ధి చెందడం యోగజీవనం. ఈ అభివృద్ధిలో ఒక్కొక్క స్థాయి దాటుకుంటూ వెళ్తే కొన్నిరకాల సిద్ధులు లభిస్తాయి. మనలోని అంతర్గత శక్తిని జాగృతం చేసి అద్భుతాలను సాధించడమే ఈ సిద్ధులు లభించడం ద్వారా కలిగే ప్రయోజనం. ఇలా సిద్ధులు పొందిన వారు ప్రస్తుతం మన చుట్టూ ఎందరో ఉన్నారు. 

అయితే - ఎన్ని యోగసాధనలు, జపతపాలు సాగించినా ప్రధానంగా - ఎనిమిది ఆత్మగుణాలు కలిగి ఉన్నప్పుడే వ్యక్తి సంపూర్ణ ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలడు అని మన ధర్మశాస్త్రాలు బోధిస్తున్నాయి. 

 1.దయ, 2. క్షాంతి, 3. అనసూయ, 4. శౌచం, 5. అనాయాసం, 6. మాంగల్యం, 7. అకార్పణ్యం, 8. అస్పృహా. ఈ అష్ట గుణాలతో కూడిన అనుష్ఠానమే 'చిత్తశుద్ధి'ని ఇస్తుంది. శుద్ధమైన చిత్తమే పరతత్త్వ జ్ఞానాన్ని పొందగలదు. 

1. దయ: పరుల దుఃఖానికి స్పందించడమే కరుణ. మనల్ని ద్వేషించే వాడైనప్పటికీ ఆపదలో ఉన్నప్పుడు రక్షించడమే దయ. అటువంటి దయ (అపదలో రక్షణ) సర్వ ప్రాణికోటి పట్ల కలిగి ఉండాలి. 

2. క్షాంతి: దీనికి 'ఓరిమి' అని అర్థం. దుఃఖం కలిగినప్పుడు ఉద్వేగానికి లోనుకాకపోవడమే క్షమ. 'ఓర్చినమ్మకి తేటనీరు' అని సామెత. కొద్దిసేపు ఓరిమి వహించినవాడికి, దీర్ఘకాలిక సత్ప్రయోజనాలు సిద్ధిస్తాయి. 

3. అనసూయ: ఇతరుల సద్గుణాలను గుర్తించకపోవడం, గుర్తించినా వెల్లడి చేయకపోవడం, సుగుణాలను కూడా దుర్గుణాలుగా పేర్కొనడం... ఈ భావాలను 'అసూయ' అంటారు. అది లేకపోవడం అనసూయ.

4. శౌచం: అభోజ్య (తినకూడని) పదార్థాలను, దుర్జనులతో సంపర్కాన్ని విడిచి, స్వధర్మాన్ని పాటించడమే శౌచం. మనుస్మృతి ప్రకారం సంపాదనలో అక్రమం, అధర్మం లేకపోవడమే శౌచం.

5. అనాయాసం: శరీరాన్ని బాధించే తక్కువ పనులు చేయడం ఆయాసం. అది లేకపోవడం అనాయాసం. 

6. మాంగల్యం: నిందింపదగిన పనులను వదలి, ప్రశస్త కర్మలను (శ్రేష్ఠమయిన పనులను) ఆచరించడమే మాంగల్యం. 

7. అకార్పణ్యం: పిసినితనం లేకుండా సత్పాత్రునకు శక్తికొద్దీ నిరహంకారంగా అనుదినం దానమివ్వడమే అకార్పణ్యం. 

8. అస్పృహా: ఇతరుల ద్రవ్యాలపై ఆశ, అపేక్ష స్పృహ అది లేకపోవడమే అస్పృహా. 

వ్యక్తికీ, సమాజానికీ కూడా హితకరమైన ఈ ఎనిమిది గుణాలను అలవరచుకోవడం, పెంపొందించడం వ్యక్తి ఆత్మను శుద్ధం చేసి, వ్యక్తిత్వానికి పరిణతిని సమకూర్చుతుంది అని మహర్షులు చెబుతారు. మానవత్వాన్ని పరిణమింపజేసి దివ్యత్వంగా మలచగలిగే దైవికమైన గుణాలు ఇవి. ఈ దైవీ సంపద కలిగి ఉన్నవాడు మోక్షాన్ని పొందుతాడు- దైవీసంపద్విమోక్షాయ - అని గీతాచార్యుని వచనం. ఈ గుణ సంపత్తి ఉన్నవారినే ఉత్తమ ఆదర్శ పురుషులుగా ధార్మిక గ్రంథాలు కీర్తించాయి. 

పురాణ పురుషులందరూ ఈ అష్టగుణాలు పుష్టి చేతనే గౌరవస్థానాన్ని సాధించారు. భౌతిక సంపదలకన్నా మనం సమకూర్చుకోవలసిన అంతస్సంపదలు ఇవే. 

◆ వెంకటేష్ పువ్వాడ