లక్షగోవుల కోసం కొడుకు బలికి సిద్ధమైన రుచీకుడు
లక్షగోవుల కోసం కొడుకు బలికి సిద్ధమైన రుచీకుడు
నైమిశారణ్యం - 8
-రచన : యం.వి.ఎస్. సుబ్రహ్మణ్యం
శునశ్శేపుడు
"రుచీకుడు" అను పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను కడు దరిద్రుడు. అతని భార్య గయ్యాళి. వీరికి ముగ్గురు మగపిల్లలు. పెద్ద కుమారుడంటే తండ్రికి ప్రాణం. కడగట్టు కుమారుడంటే తల్లికి ప్రాణం. మధ్య కుమారుడు శునశ్శేపుడంటే ద్వేషమూ లేదు, ప్రేమా లేదు. సంసార పోషణకై రుచీకుడు బిక్షాటన చేస్తూ జీవించే వాడు.
ఆ రోజుల్లో అయోధ్యా నగరాన్ని అంబరీషుడు అను మహారాజు పరిపాలిస్తూ వుండేవాడు. పూర్వజన్మ కర్మానుసారం అంబరీషునికి జలోదరం అనే వ్యాధి పట్టుకుంది. రాజ వైద్యులు ఎన్ని వైద్య ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. అంబరీషుడు ప్రతిదినం వ్యాధి బాధను భరిస్తూ మరణానికి చేరువ అవుతున్నాడు. రాజగురువులు "మహారాజా ! మీకీ వ్యాధి నయం కావాలంటే వరుణ యజ్ఞాన్ని చేయండి." అని సలహా యిచ్చారు.
అంబరీషుడు వరుణ యజ్ఞాన్ని ప్రారంభించాడు. యజ్ఞం యిక పరిసమాప్తి అయ్యే సమయానికి ఒక రాక్షసుడు యజ్ఞ పశువును అపహరించాడు. అది చూసి రాజగురువు "మహారాజా! యజ్ఞ పశువును కాపాడలేకపోయారు. యజ్ఞ భంగమైతే యాగకర్త నాశనం అవుతాడు. నరపశువునైనా యిచ్చి యాగాన్ని పూర్తి చెయ్యి." అని సలహా యిచ్చాడు.
అంబరీషుడు తన కుమారుని బలిపశువుగా నిలిపి యాగాన్ని పూర్తి చేయాలని సంకల్పించాడు. ఆ సంగతి తెలిసి ప్రాణభయంతో అంబరీషుడి కుమారుడు రాజ్యం విడిచి పారిపోయాడు. "ఏ బ్రాహ్మణ బాలునినైనా కొని యాగ పశువుగా నిలిపి, యాగాన్ని పూర్తి చెయ్యి అని సలహా యిచ్చారు " ఋత్వికులు.
"ఎవరైనా తమ పుత్రుని యాగపశువుగా అమ్మితే వారికి లక్షగోవులు ఇస్తానని" ప్రకటించాడు అంబరీషుడు. ఎవ్వరూ తమ పుత్రుని అమ్మటానికి ముందుకు రాలేదు. ఆ సమయంలో రుచీకుడు మహారాజును దర్శించి "నాకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు కర్మిష్ఠి. కనుక అమ్మలేను." అన్నాడు. కడగొట్టు వాడంటే నాకు ప్రేమ అంది భార్య. మీకు అభ్యంతరం లేకపోతే మధ్య వాడిని అమ్ముతాను. తల్లిదండ్రుల ప్రేమ తన మీద ఎంత వుందో అర్థమైన శునశ్శేపుడు. తనంత తానుగా రాజు ముందుకు వచ్చి "నన్ను తీసుకు వెళ్ళండి" అన్నాడు.
అంబరీషుడు లక్షగోవులను రుచీకునకు యిచ్చి, శునశ్శేకుని తనతో తీసుకుని వెళ్ళి యాగం ప్రారంభించాడు. యూప స్థంభానికి శునశ్శేపుని కట్టారు. యాగం జరుగుతోంది. ఆ యాగానికి సప్త ఋషులతో పాటు, విశ్వామిత్రుడు వచ్చాడు.
శునశ్శేపుడు ధైర్యంగా ముందుకు వచ్చాడన్న మాటే కానీ, చిన్న తనం కారణంగా ప్రాణ భయం పట్టుకుంది. కానీ ఎటూ పారిపోలేని పరిస్థితి. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. అతని కన్నీరు ఎవరి గుండెలను కరిగించడం లేదు. యాగం జరుగుతూనే వుంది. ఆ యాగం చూడటానికి రుచీకుడు వచ్చాడు. అతని గుండె కరగలేదు. ఇదంతా చూస్తున్న విశ్వామిత్రుని మనస్సు శునశ్శేపుడుని పట్ల జాలితో నిండిపోయింది. ఆయన శునశ్శేపుని దగ్గరకు వెళ్ళి "కుమారా, భయపడకు. నీకు వరుణ మంత్రాన్ని ఉపదేశిస్తాను. క్షణకాలం వృథా చేయకుండా ఆ మంత్రాన్ని పఠించు. నీకు మేలు జరుగుతుంది." అని చెప్పి వరుణ మంత్రాన్ని ఉపదేశించాడు.
శునశ్శేపుడు వరుణ మంత్రాన్ని పఠిస్తూనే ఉన్నాడు. అతన్ని యాగానికి బలి యిచ్చే సమయం దగ్గిర పడింది. అతన్ని చూసి తలనరికే కసాయి వాడు కూడా జీలిపడి శునశ్శేపుని తల నరకనని వెనక్కి వెళ్ళి పోయాడు. యాగం ఆగింది. అప్పుడు రుచీకుడు లేచి "మరో లక్ష గోవులిస్తే వాడి తల నేను నరుకుతాను" అన్నాడు. యాగానికి వచ్చిన వారంతా రుచీకుని అసహ్యించుకున్నారు. అంబరీషుడు రుచీకుని కోరికకు అంగీకరించాడు. రుచీకుడు బలి ఖడ్గాన్ని చేత పట్టుకుని కొడుకు దగ్గరకు నడిచాడు. యాగం తిరిగి ప్రారంభమైంది. వీటితో ఏ సంబంధం లేనట్టు శునశ్శేపుడు వరుణ ధ్యానం చేస్తూనే ఉన్నాడు. బలి యిచ్చే సమయం దగ్గర పడగానే కొడుకు తల నరకటానికి కత్తిపైకెత్తాడు రుచీకుడు.
అప్పుడు వరుణదేవుడు ప్రత్యక్షమై "ఈ బలి నేను స్వీకరించను" అన్నాడు.
అప్పుడు అంబరీషుడు "నేను ధర్మ బద్ధంగా యాగం జరిపిస్తున్నాను. బలి స్వీకరించనంటే న్యామా? మరి నాకీ రోగం తగ్గేదెలా? " అని వరుణ దేవుని ప్రశ్నించాడు. అర్థం చేసుకున్న వరుణుడు అంబరీషుని రోగ విముక్తుని చేసి, బలి స్థంభానికి కట్టబడిన శునశ్శేపుని విడుదల చేసి, దీవించాడు.
అప్పుడు శునశ్శేపుడు ఆ సభాసదులను ఉద్దేశ్యించి "ధర్మనిర్ణేతలారా! ఇప్పుడు నాకు ఎవరు తండ్రి?
- జన్మనిచ్చిన ఈ రుచీకుడా!
- గోధనమిచ్చి కొనుక్కున్న అంబరీష మహారాజా?
- లేక నాకు ప్రాణదానం చేసిన విశ్వామిత్ర మహర్షా? " అని ప్రశ్నించాడు.
యాగశాలలో కొంతసేపు నిశబ్దం చోటు చేసకుంది. తరువాత వాద, ప్రతివాదాలు జరిగాయి. ఆ తరువాత "నీకు పునఃజన్మను ప్రసాదించిన ఈ విశ్వామిత్రుడే నీ తండ్రి" అని అందరూ ముక్త కంఠంతో పలికారు.
శునశ్శేపుడు విశ్వామిత్రుని పాదాలకు నమస్కరించాడు.
విశ్వామిత్రుడు చిరునవ్వుతో ముందుకు కదిలాడు.
శునశ్శేపుడు పితృభక్తితో, విశ్వామిత్రుని అనుసరించాడు.