Read more!

వైభవ గోదావరి – 13 సంగమ గోదావరి

 

 

వైభవ గోదావరి – 13

సంగమ గోదావరి

 

 

ఇవాళ్టితో గోదావరి పుష్కరాలు సమాప్తం. మన వైభవ గోదావరి ధారావాహిక కూడా ఈ రోజు పూర్తవుతుంది. ఇవాళ యానాం, మురమళ్ళ, అంతర్వేదిల గురించి ముచ్చటించుకుందాము.

యానాం : ఆంధ్ర ప్రదేశ్ లోని ఫ్రెంచ్ కాలనీ యానాం. చుట్టూ తూర్పు గోదావరి జిల్లా ... మధ్యలో యానాం .. మన దేశంలో వున్న మూడు ఫ్రెంచ్ కాలనీల్లో ఇది ఒకటి.. 30 స్క్వేర్ కిలో మీటర్ల విస్తీర్ణంలో వున్న ఈ ఫ్రెంచ్ కాలనీలో బీచ్, చిన్న పిల్లల పార్కు,, వెంకటేశ్వర స్వామి కోవెల, పోచమ్మ కోవెల వగైరా దర్శనీయ ప్రదేశాలున్నాయి.ఇక్కడ గోదావరి పాయ గౌతమి, బంగాళాఖాతంలో కలుస్తుంది. కాలనీ లోకి వెళ్ళి రావటానికి ఆటోలు దొరుకుతాయి. మన వాహనాలలో వెళ్ళాలంటే కొంత రుసుము చెల్లించాల్సి వుంటుంది. మేము వెళ్ళింది మధ్యాహ్న సమయంలో. సమయాభావం వల్ల ఆటోలోనే ఒక రౌండ్ వేసి వచ్చాము


 

శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్ధానం, మురమళ్ళ వృధ్ధ గోదావరీ తటంలో వున్న క్షేత్రం మురమళ్ళ. ఇక్కడ స్వామి శ్రీ భద్రకాళీసమేత శ్రీ వీరేశ్వరస్వామి. పురాణ కధల ప్రకారం దక్షుడు యజ్ఞం చేయటం, దానికి పరమశివుణ్ణి ఆహ్వానించకపోవటం, సతీదేవి పుట్టింట్లో జరిగే యజ్ఞం చూడాలనే ఆకాంక్షతో వెళ్ళటం, అక్కడ శివుడికి జరిగిన అవమానాన్ని సహించలేక యోగాగ్నిలో భస్మమవటం అందరికీ తెలిసిందే. సతీదేవి భస్మమవటంతో కోపించిన శివుడు వీరభద్రుడుని సృష్టించి దక్షయజ్ఞ వినాశనానికి పంపుతాడు. ఆయననే ఇక్కడ వీరేశ్వరుడంటారు. ఆయన మహా భయంకర రూపందాల్చి దక్షయజ్ఞాన్ని నాశనం చేస్తాడు. తర్వాత దక్షుడు పశ్చాత్తాపపడటంతో ఆయనకి మేక తల అతికించి ఆ యజ్ఞాన్ని పరిపూర్తి చేస్తారు. కానీ సతీ దహనంవల్ల వీరేశ్వరుడు ఎంతకీ శాంతించడు. ఆ భయంకర రూపాన్ని చూసి భయకంపితులైన మునులు, దేవతలు విష్ణుమూర్తిని వీరేశ్వరుడిని శాంతింపచేయమని ప్రార్ధిస్తారు. విష్ణుమూర్తి నరసింహావతారంలో వీరేశ్వరుడ్ని శాంతింపచేయబోతాడు.

కానీ వీరేశ్వరుడు శాంతించడు సరికదా నరసింహస్వామి నడుం పట్టుకుని వదలడు. దానితో నరసింహస్వామి తన నరసింహావతార లీలను అక్కడే వదిలి బ్రహ్మలోకానికి వెళ్ళి అందరూ కలిసి ఆది పరాశక్తిని ప్రార్ధిస్తారు. ఆవిడ ప్రత్యక్షమై విషయం తెలుసుకుని, తన షోడశ కళలలోని ఒక కళ భద్రకాళిని వీరభద్రుని శాంతింపచెయ్యటానికి భూలోకానికి పంపింది. భద్రకాళి అమ్మవారు ఎంత ప్రయత్నించినా వీరభద్రుడు శాంతించలేదు. అప్పుడావిడ శరభ అశ్శరభ అంటూ పక్కనే వున్న తటాకంలో మనిగి కన్యరూపందాల్చి తటాకమునుండి బయటకువచ్చి వీరేశ్వరుని చూసింది.

కన్యరూపంలోవున్న భద్రకాళిని చూసి వీరేశ్వరుడు శాంతించాడు. ఇదంతా జరిగింది మహామునులందరూ గౌతమీ తటంలో ఆశ్రమాలు ఏర్పరుచుకుని నివసిస్తున్న ప్రదేశంలో. దానిని మునిమండలి అనేవారు. మునులందరూ ఆ మునిమండలిలో వీరేశ్వరస్వామికి, భద్రకాళికి గాంధర్వ పధ్ధతిన వివాహం జరిపి స్వామిని శాంతింపచేశారు. అప్పటినుంచి ఆ క్షేత్రంలో స్వామికి నిత్యం గాంధర్వ పధ్ధతిలో కళ్యాణం జరిపిస్తున్నారు. ఈ మునిమండలే కాలక్రమేణా మురమళ్ళగా నామాంతరం చెందింది. ఇక్కడ స్వామివారి నిత్య కళ్యాణానికి ఇంకొక విశేషం వున్నది. తమ సంతానానికి వివాహం ఆలస్యమవుతున్నవారు ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయిస్తే త్వరలో వారి సంతానం వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. భక్తులు అలా చేయించే కళ్యాణాలే నిత్యం జరుగుతూంటాయి. అంతేకాదు. స్వామివారి నిత్య కళ్యాణానికి భక్తులేకాక అగస్త్యుడు, శుకుడు, విశ్వామిత్రుడు, వశిష్టుడు, గౌతముడు, వ్యాసుడు మొదలగు ఋషీశ్వరులనేకులు ప్రతి నిత్యం విచ్చేస్తారని పురాణ కధనం. శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి మహిమ, క్షేత్ర మహిమల దృష్ట్యా అవకాశంవున్నవారు తప్పక దర్శించవలసిన ఆలయం ఇది.
 

అంతర్వేది : గోదావరి పాయ వశిష్ట గోదావరి, సాగర సంగమం చేసే ప్రదేశం ఇది. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. క్షేత్ర పాలకుడు శ్రీ నీలకంఠేశ్వరస్వామి. ఇక్కడ బ్రహ్మదేవుడు నదికీ, సముద్రానికీ మధ్య వేదిక నెలకొల్పి, యజ్ఞం చేశాడనీ, అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చిందంటారు.

వశిష్టుడి తపో ఫలితంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వెలిశాడు. ఈ క్షేత్రం గురించి వివరాలు ఈ పత్రికలో శ్రీ నరసింహ క్షేత్రాలు – 1 లో చదవండి.13 రోజులనుంచీ గోదావరి పుష్కరాల సందర్భంగా గోదావరీ తీరాన వున్న కొన్ని పుణ్య క్షేత్రాల గురించి తెలుసుకున్నాము. ఈ వ్యాసాలను ఆదరించిన పాఠకులకు నమస్సులతో తిరిగి మరో క్షేత్ర దర్శనంలో త్వరలో కలుసుకుందాము.

పి.యస్.యమ్. లక్ష్మి

తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)