Read more!

జగన్నాథ రథచక్రాలు కదిలాయి

 

 

 

జగన్నాథ రథచక్రాలు కదిలాయి

 

 

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు... ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన రథయాత్ర గురించిన కబుర్లు మొదలైపోతాయి. ఆ జగన్నాథుని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు, ఆయన రథం మీద ఒక చేయి వేసేందుకు లక్షలాది ప్రజలు పూరీక్షేత్రానికి చేరుకుంటారు. ఆషాఢశుద్ధ విదియ నుంచి తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పర్వదినాలలో వైష్ణవభక్తుల సంబరాలకు అంతు ఉండదు.

 

వేల సంవత్సరాల చరిత్ర:  పూరీ జగన్నాథుని క్షేత్ర మహిమ ఈనాటిది కాదు. పురాణాలలో సైతం ఈ జగన్నాథుని మహిమను వర్ణించి తరించారు. ఈ పురాణ గాథల ప్రకారం ఇంద్రద్యుమ్నుడనే రాజుకి ఒకనాడు కలలో విష్ణుమూర్తి కనిపించి నీలాచల పర్వతం మీద తనకి ఒక దేవాలయాన్ని నిర్మించమనీ, ఆ ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత తాను ‘దారు’ (దుంగ) రూపంలో పూరీ తీరానికి చేరుకుంటాననీ చెప్పాడట. ఆ ఆజ్ఞ ప్రకారమే ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించాడు. విష్ణుమూర్తి ఆనతి ఇచ్చిన మేరకు నిజంగానే శంఖుచక్రాల వంటి గుర్తులతో ఒక దారుబ్రహ్మ పూరీనగర తీరానికి చేరుకుంది.

 

ఆ దారుకి విగ్రహ రూపాన్ని ఇచ్చేందుకు సాక్షాత్తూ దేవతల శిల్పి అయిన విశ్వకర్మే ఒక మానవునిగా ముందుకు వచ్చాడు. అయితే ఆ విశ్వకర్మ ఒక షరతుని ఉంచాడట. తను ఏకాంతంగా ఆ శిల్పాలను చెక్కే పనిలో ఉంటాననీ, ఆ పని పూర్తయి తనంతట తానుగా బయటకు వచ్చేంతవరకూ ఎవ్వరూ లోపలకి రాకూడదన్నదే ఆ షరతు. అయితే రెండు వారాలు గడిచిన తరువాత ఉత్సుకతను నిలువరించుకోలేని ఇంద్రద్యుమ్నుడు ఆ తలుపులు తెరిచి చూశాడట. ఇంకేముంది! సగం మాత్రమే పూర్తయిన శ్రీకృష్ణ, సుభద్ర, బలరాముల విగ్రహాలు కనిపించాయి. రాజుగారు తన మాట తప్పినందుకుగాను విశ్వకర్మ అదృశ్యమైపోయాడు. అప్పటి నుంచి గర్భాలయంలో అదే రీతిలో విగ్రహాలను ఆరాధిస్తూ వస్తున్నారు.

 

ఎలా చూసినా ప్రత్యేకమే!:  పూరీ జగన్నాథుని ప్రత్యేకతలు ఒకటీ రెండూ కాదు. అసలు ఆ విగ్రహాలే తొలి ప్రత్యేకత. ఈ విగ్రహాలు చిత్రమైన రూపంలో ఉండటం వెనుక ఒక ఐతిహ్యాన్ని చెప్పుకున్నప్పటికీ, స్థానిక తెగలు ఆరాధించే రూపంలో ఈ మూర్తులు ఉండటం ఒక విశేషం. దానికి అనుగుణంగా జగన్నాథుని చరిత్రలో ఆయనను ఆదిమజాతివారు ఆరాధించుకున్న ప్రస్తావనలు కూడా కనిపిస్తాయి. అంటే ఈ దైవం అందరివాడన్న మాట! ఇక ప్రతి 12 లేక 19 సంవత్సరాలకు ఓసారి ‘నవకళేబర’ పేరుతో ఈ దారు విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ఉంచడం మరో విశేషం.
సాధారణంగా ఎక్కడన్నా రథయాత్ర జరిగినప్పుడు ఉత్సవ విగ్రహాలను ఊరేగించడం ఆనవాయితీ. కానీ అందుకు విరుద్ధంగా సాక్షాత్తూ మూలవిరాట్టులే రథయాత్రకు కదిలిరావడం ఒక అద్భుతం. ఇక స్వామివారు సతీసమేతంగా కాకుండా అన్నాచెల్లెల్లతో గర్భాలయంలో కొలువై ఉండటం విచిత్రం. అరుదైన ఈ విషయాన్ని జీర్ణించుకోవడం కష్టం కాబట్టి చాలామంది భక్తులు సుభద్ర అంటే శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరని అపోహపడుతూ ఉంటారు.

 

రథయాత్ర!:  హైందవ క్షేత్రాలలో పూరీకి ఉన్న ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. చార్‌ధామ్ యాత్ర పేరుతో బదరీనాధ్‌, ద్వారక, రామేశ్వరాలతో పాటుగా పూరీకి కూడా చోటు ఉంది. అందుకే పూరీ క్షేత్రాన్ని త్రిమతాచార్యులైన శంకర, రామానుజ, మధ్వాచార్యులతో పాటుగా గురునానక్‌, తులసీదాసు, చైతన్యమహాప్రభు వంటి మహామహులెందరో దర్శించినట్లు చరిత్ర పేర్కొంటోంది. సహజంగానే ఇంతటి ప్రాచుర్యం ఉన్న పూరీక్షేత్రం రథయాత్ర సమయంలో మరింత శోభని సంతరించుకుంటుంది.

 

రథయాత్రలో భాగంగా ఉన్నతమైన రథాల మీద జగన్నాథుడు, బలరాముడు, సుభద్రలు... సమీపంలోని గుండిచా అనే మరో ఆలయానికి బయల్దేరి వెళతారు. గుండిచా మందిరం వారి పిన్నిగారి స్వస్థలమనీ, జగన్నాథుని ఉద్యానవనమనీ ప్రతీతి. ఆషాఢశుద్ధ దశమి వరకూ ఆ ఆలయంలో విశ్రమించిన జగన్నాథుడు తన గర్భాలయానికి తిరుగు ప్రయాణం కట్టడంతో రథయాత్ర పండుగ ముగుస్తుంది. ఈ కాలంలో వీలైనంతమంది భక్తులు పూరీని చేరుకుని, వివిధ అవతారాలలో కొలువై ఉండే శ్రీకృష్ణుని దర్శించుకుంటారు. ఇక సాధ్యంకానివారు తమ తమ ప్రాంతాలలోనే జగన్నాథ రథయాత్రను పోలి ఉండే రథయాత్రలను సాగించి, ముచ్చటను తీర్చుకుంటారు.

 

-నిర్జర.