Read more!

జగన్నాథుని రథయాత్రకు ఆధ్యాత్మిక జీవితానికి సంబంధం ఏంటి!

 

జగన్నాథుని రథయాత్రకు ఆధ్యాత్మిక జీవితానికి సంబంధం ఏంటి!


ఇంద్రద్యుమ్న మహారాజుకు విష్ణుమూర్తి కలలో కనిపించి నదీతీరానికి ఒక కొయ్యదుంగ కొట్టుకు వస్తుందని; దానితో జగన్నాథ, సుభద్ర, బలభద్రుల విగ్రహాలను తయారు చేయమని ఆజ్ఞాపించాడు. విష్ణుమూర్తి సూచించినట్లుగానే నదీతీరాన కొయ్యదుంగ లభించింది. కానీ ఆ దారువును విగ్రహాలుగా మలచడానికి ఏ శిల్పి కూడా ముందుకు రాలేదు. విష్ణుమూర్తి ఆజ్ఞ నెరవేరనందుకు మహారాజు విచారవదనుడై ఉండగా, దేవశిల్పి విశ్వకర్మ మారువేషంలో రాజు దగ్గరకు వచ్చి “దారు విగ్రహాలను నేను మలుస్తాను. కానీ విగ్రహాల పని పూర్తయ్యేంత వరకు ఎవ్వరూ నన్ను ఆటంకపరచకూడదు. నా గదిలోకి ఎవ్వరూ రాకూడదు" అని షరతు పెట్టాడు. ఆ శిల్పి పెట్టిన షరతుకు మహారాజు అంగీకరించి, విగ్రహాలను మలచడానికి ప్రత్యేకమయిన గదిని ఏర్పాటు చేశాడు. 

శిల్పి గది తలుపులను మూసుకొని విగ్రహాలను చెక్కడం ప్రారంభించాడు. అలా పదిహేను రోజులు గడిచిపోయినా అతడు తలుపులు తెరవలేదు. అందువల్ల మహారాజుకు సందేహం వచ్చి, గది తలుపులు తెరచిచూశాడు. శిల్పి పెట్టిన షరతును మహారాజు ఉల్లంఘించడం వల్ల మారువేషంలో ఉన్న దేవశిల్పి విశ్వకర్మ అదృశ్యమయ్యాడు. విగ్రహాలను మలచడం పూర్తికాలేదు. అలా సగం పూర్తయిన విగ్రహాలనే ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండీ అదే రూపాలలో జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడు. భక్తులకు దర్శనమివ్వడం సంప్రదాయంగా వస్తోందని స్థలపురాణం చెబుతోంది.

దేవశిల్పి విశ్వకర్మ చెప్పిన మాటలను విస్మరించడం వల్ల భగవంతుని సంపూర్ణ విగ్రహాలను దర్శించుకునే అదృష్టాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కోల్పోయాడు. ఎన్నో ఏళ్ళుగా జ ధ్యానాలను అనుష్టిస్తున్న సాధకులకు భగవద్దర్శనం లభించకపోతే వారిలో నిరుత్సాహం కలగడం సహజం. కానీ గురూపదేశాల యందు విశ్వాసం ఉంచి, సాధనా జీవితాన్ని కొనసాగించాలి. సాధకుడు అన్ని విధాలా అర్హత సాధించినప్పుడు గురుకృప చేత భగవత్సాక్షాత్కారం తప్పక లభిస్తుంది. అందుకే సాధకులు నిరుత్సాహపడకుండా సహనంతో సాధన చేయాలని శ్రీశారదాదేవి "గురూపదేశానుసారం జపధ్యాన సాధనలను క్రమం తప్పకుండా అనుష్ఠిస్తూ ఉండాలి. మన ఆధ్యాత్మిక పురోగతిని మనమే బేరీజు వేసుకోవడం అహంకారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి గురువాక్యాల యందు సంపూర్ణ విశ్వాసం ఉంచి సాధన చేస్తే గురువు కృపతో భగవంతుని సాక్షాత్కారం లభిస్తుంది” అని సూచించారు. కాబట్టి గురువాజ్ఞను ఉల్లంఘించ కుండా శ్రద్ధ, విశ్వాసాలతో సాధనను అనుష్ఠించినప్పుడే భగవదనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందన్నది ఈ సంఘటన ద్వారా మనం గ్రహించాల్సిన విషయం.

పూరీ రథయాత్రకూ, మన ఆధ్యాత్మిక యాత్రకూ అన్యోన్య సంబంధం ఉంది. జగన్నాథ రథయాత్ర మందగమనంతో ముందుకు వెళుతుంది. కానీ ఒక్కసారి రథం కదిలిందంటే మార్గమధ్యంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా గమ్యం చేరేవరకు ఆగదు. ఎలాంటి క్లిష్టపరిస్థితులు ఎదురైనప్పటికీ రథం వెనుకకు మరలే ప్రసక్తే ఉండదు.

ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించిన సాధకుడు భగవత్సాక్షాత్కారం పొందే వరకు సాధనా మార్గంలో ఎన్ని ప్రలోభాలు, ఆకర్షణలు ఎదురైనప్పటికీ వెనుదిరగకుండా మనో నిగ్రహంతో గమ్యం వైపు పయనించాలి. గమనం ఎంత నెమ్మది అయినప్పటికీ, సురక్షితంగా పయనిస్తూ, పురోగతిని సాధించడమే సాధకుని ధ్యేయం కావాలి. శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనించే సాధకుడు ఎలా ఉండాలో చెబుతూ కూర్మాన్ని ఆదర్శంగా చూపించాడు.

 యదా సంహరతే చాయం కూర్మో ర్గానీవ సర్వశః |

ఇన్డ్రియాణీన్డ్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 


'తాబేలు అవయవాలన్నింటినీ తనలోకి ఇముడ్చుకొన్నట్లు సాధకుడు తన ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుండి ఉపసంహరించుకోవాలి. అలాంటి వాడు స్థిరమైన బుద్ధి కలిగివుంటాడు'

ఆధ్యాత్మిక యాత్రలో ఎలాంటి ఆకర్షణలకూ ప్రలోభ పడకుండా, ఆటంకాలకు నిరుత్సాహపడకుండా, నిత్యానిత్య వస్తు వివేకంతో వ్యవహరిస్తూ గమనాన్ని గమ్యం వైపే సాగించాలి. జగన్నాథరథం ఎప్పుడూ ముందుకే పయనించడంలోని అంతరార్థం ఇదే!


                                   ◆నిశ్శబ్ద.