Read more!

నారదునికి కోతిముఖం

 

 

 

నారదునికి కోతిముఖం

 

 

లోకంలోకెల్లా గొప్ప భక్తులు ఎవరు అన్న ప్రసక్తి వచ్చినప్పుడు నారదుని పేరు గుర్తుకురాక మానదు. అయితే భగవంతునికి చేరువ చేయవలసిన భక్తే, ఆయనలోని అహంకారాన్ని పెంచి పోషించింది. నలుగురి ముందరా తలదించుకునేలా చేసింది. అదెలాగంటే...

 

నారదుడు భగవన్నామస్మరణలో మునిగిపోతే ఆయనను కామదేవుడు కూడా కదిలించలేడు. ‘కాముడు శివుడంతటి వాడి ధ్యానాన్ని కూడా చెడగొట్టాడు కానీ, నీ ధ్యానాన్ని మాత్రం భంగపరచలేకపోయాడు’ అంటూ ఎవరో ఓసారి నారదుడిని తెగ పొగిడేశారు. ఆ మాటలకు నారదుడు ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ‘ఔను కదా! తాను శివునికన్నా గొప్పవాడిని కదా!’ అనుకున్నాడు. ఆనాటి నుంచి నారదునిలో అహంకారం ఇంతింతగా పెరిగిపోయింది.

 

రోజురోజుకీ నారదునిలో వస్తున్న మార్పుని పసిగట్టాడు నారాయణుడు. తన భక్తునికి ఎలాగైనా బుద్ధి చెప్పి దారికి తీసుకురావాలని నిశ్చయించుకున్నాడు. అందుకు అనుగుణంగా తన సతి లక్ష్మీదేవిని భూమిమీద అవతరించమన్నాడు. అయోధ్య రాజ్యాన్ని పాలిస్తున్న అంబరీషుడు అనే రాజుకి కుమార్తగా లక్ష్మీదేవి అవతరించింది. ఆమెకు శ్రీమతి అన్న పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచసాగారు రాజదంపతులు. ఒకసారి నారదుడు లోకసంచారం చేస్తూ ఆ అంబరీషుని అంతఃపురానికి కూడా చేరుకున్నాడు. అక్కడ అందాలరాశిగా ఉన్న లక్ష్మీదేవిని చూసిన నారదుని మనసు చలించిపోయింది. ఎలాగైనా ఆమెను తన భార్యగా చేసుకోవాలన్న మోహం మొదలైంది. తన మనసులో ఉన్న మాటను అంబరీషుని వద్ద ప్రస్తావించాడు నారదుడు.

 

నారదుని కోరికను విన్న అంబరీషునికి ఏం చేయాలో పాలుపోలేదు. తన కుమార్తె మనసుని తెలుసుకోకుండా ఔనంటే తప్పు. పోనీ అంతటి రుషి మాటను కాదంటే ఏం జరుగుతుందోనన్న భయం. అందుకని మధ్యేమార్గంగా ఓ ఉపాయాన్ని ఆలోచించాడు అంబరీషుడు. ‘స్వామీ నేను ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాను. అందులో కనుక నా కుమార్తె మిమ్మల్ని వరిస్తే, ఆమెను మీకిచ్చి వివాహం జరిపించడానికి నాకేమీ అభ్యంతరం లేదు!’ అన్నాడు. అంతవరకూ బాగానే ఉందికానీ, స్వయంవరంలో రాజకుమారి తననే వరిస్తుందన్న నమ్మకం ఏమిటి అన్న అనుమానం కలిగింది నారదునికి. అందుకోసం ఏదన్నా ఉపాయాన్ని సూచించమంటూ సాక్షాత్తూ ఆ శివుని చెంతకు వెళ్లాడు. నారదుని అనుమానాన్ని విన్న శివుడు చిరునవ్వుతో ‘నారాయణుడిని మించిన అందగాడు ఎవరుంటారు. నువ్వు కనుక విష్ణుమూర్తి అంత అందంగా కనిపిస్తే ఆ అమ్మాయి తప్పకుండా నిన్ను వరించి తీరుతుంది’ అన్నాడు.

 

శివుని ఉపాయాన్ని విన్న నారదునికి అది సబబుగానే తోచింది. అందుకని నిదానంగా వైకుంఠానికి చేరుకున్నాడు. ‘స్వామీ భూలోకంలో శ్రీమతి అనే రాజకుమారికి స్వయంవరం జరుగుతోంది. ఆ స్వయంవరంలో పాల్గొని ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని అనుకుంటున్నాను. మరి ఆ స్వయంవరంలో నెగ్గాలంటే నీ అంత అందం ఉండాలని పరమేశ్వరుడు చెప్పాడు. కాబట్టి ఆ రోజున ఆ రాజకుమారి నన్ను చూసినప్పుడు అచ్చు మీలాగే కనిపించేలా అనుగ్రహించండి’ అన్నడు. స్వామివారు చిరునవ్వి ఊరుకున్నారు. నారదుడు ఆ చిరునవ్వునే అనుగ్రహంగా భావించి బయల్దేరిపోయాడు.

 

స్వయంవరం రోజు రానే వచ్చింది. వరుని వరించేందుకు పూలదండ చేపట్టి వచ్చిన రాజకుమారికి అక్కడ నారదుడు కనిపించలేదు సరికదా అందరి మధ్యా కోతిమొహంతో ఉన్న ఓ సన్యాసి కనిపించాడు. అతడిని చూడగానే రాజకుమారి నిలువెల్లా భయంతో వణికిపోయింది. ఆ సన్యాసి పక్కనే ఒక మోహనాంగుడు కనిపించడంతోనే అసంకల్పితంగా ఆయన మెడలో దండ వేసింది. శ్రీమతి ఎప్పుడైతే అలా దండ వేసిందో వారిరువురూ మాయమైపోయారు. ఇదంతా చూస్తున్న నారదునికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. తన కళ్ల ముందే అసలైన విష్ణుమూర్తి రావడం, రాజకుమారి ఆయనను వరించి మాయమైపోవడం చూసి ఆయనకు మతిపోయింది. ఇంతలో ఎదురుగుండా ఉన్న కొలనులో తన ప్రతిబింబాన్ని చూసుకుని నారదునికి జరగినది అర్థమైంది.

 

విష్ణుమూర్తి తన మొహాన్ని కోతి మొహంగా మార్చేశాడనీ, అటుపై రాజకుమారిని కాస్తా తానే ఎగరేసుకుపోయాడని అర్థమైంది. వెంటనే పట్టరాని ఆవేశంతో... తాను ప్రేమించిన స్త్రీని తన నుంచి దూరం చేశాడు కాబట్టి, విష్ణుమూర్తి కూడా సతీ వియోగంతో బాధపడతాడనీ, చివరికి ఓ కోతి కారణంగానే వారిరువురూ కలుసుకుంటారనీ శపించాడు. జరిగిన దానికి నారాయణుని పట్ల నారదునిలో ఆవేశం కలిగిన మాట వాస్తవమే కానీ, సమయం గడిచే కొద్దీ ఆ సంఘటన వెనుక ఉన్న ఆంతర్యం బోధపడింది. కామానికి సైతం లొంగననుకుని గర్వించిన తనకి బుద్ధి చెప్పేందుకే నారాయణుడు ఈ నాటకమాడాడని తెలిసి వచ్చింది. మరోవైపు రామాయణంలో రాముడు సీత నుంచి దూరం కావడం, వారిరువురినీ కలిపేందుకు హనుమంతుడు తోడ్పడటం తెలిసిందే! అలా రామాయణంలోని కీలక ఘట్టాలకు నారదుని శాపం ఒక భూమికగా నిలిచింది.

 

- నిర్జర.