Read more!

విశ్వామిత్రుడి పుట్టుక వెనుక ఆసక్తి కథ!!

 

 విశ్వామిత్రుడి పుట్టుక వెనుక ఆసక్తి కథ!!
 

విశ్వామిత్రుడు పుట్టుక వెనుక జరిగిన కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఒకనాడు చ్యవన మహర్షి కుశిక మహారాజు దగ్గరకు వెళ్ళాడు. ఆ రాజు చ్యవనుడ్ని ఘనంగా ఆహ్వానించాడు. "మునీంద్రా! మమ్మల్ని ఆజ్ఞాపించి మీ పనులు చేయించుకోండి" అన్నాడు చాలా వినయంగా. "రాజా! నువ్వూ, నీ భార్యా నాకు ఉపచారాలు చేస్తే చాలు" అన్నాడు చ్యవనుడు. "చిత్తం అలాగే దయచెయ్యండి  స్వామీ!' అంటూ కుశికుడు ఆయన్ని అంతఃపురంలోకి తీసుకువెళ్ళి హంసతూలికా తల్పం, మణిపీఠం ఏర్పాటు చేశాడు.

"మహారాజా! ఇక నేను విశ్రమిస్తాను. నువ్వూ, నీ భార్యా మేలుకుని నా కాళ్ళు ఒత్తుతూ వుండండి. నా అంతట నేను లేచేవరకూ నన్ను నిద్రలేపకండి!" అన్నాడు మహర్షి. కుశికుడూ, అతని భార్యా నిద్రాహారాలు మాని సేవిస్తున్నారు. అలా నలభైరెండు రోజులు గడిచాయి. ఆ మరునాడు మహర్షి నిద్ర లేచి "రథం తయారు చెయ్యి. దాన్ని నువ్వూ, నీ భార్యా లాగాలి. నేను రథమెక్కి, బంగారం, రత్నాలూ, గోవులూ, గుర్రాలూ యాచకులకు దానమిస్తూ పోతాను" అన్నాడు. సరేనన్నాడు రాజు.

మహర్షికి కావల్సిన ధన వస్తు వాహనాలన్నిటినీ తెచ్చి ఇమ్మని మంత్రులను ఆజ్ఞాపించి తన భార్యాతో కలసి రథం లాగటం ప్రారంభించారు. చ్యవనుడు రథమెక్కి ములుకోలతో వాళ్ళిద్దరినీ నెత్తురు వచ్చేలా బాదుతూ, ఆశ్రితులకు దానాలు చేస్తూ వెళ్ళాడు. రథం ఊరి చివరకు వెళ్ళగానే అక్కడ దిగాడు మహర్షి, శరీరాలు చిట్లి రక్తం కారుతున్నా రాజదంపతులు చిరునవ్వు నవ్వుతూ వుండేసరికి ఆశ్చర్యపోయాడు. 

"మహారాజా! పాపం బాగా అలిసిపోయావు. ఇంక నీ పట్టణానికి వెళ్ళిపో, నేను ఇక్కడ తపస్సు చేసుకుంటాను. రేపు నువ్వూ, నీ భార్యా మళ్ళీ నా దగ్గరకు రండి". అని వాళ్ళిద్దరి శరీరాలూ ప్రేమగా నిమిరాడాయన. గాయాలన్నీ పోయి హాయిగా అనిపించింది. 

"మునినాథా! మీ హస్త స్పర్శతో మా శరీరాలకు నూతన శక్తి వచ్చింది. శ్రమ, గాయాలూ మాయమైపోయాయి. మీ మహిమను ఏమని పొగడగలం?" అంటూ నమస్కరించి వెనుదిరిగి వెళ్ళిపోయాడు కుశికరాజు.  మరునాడు ఆ ముని వున్నచోటుకి మళ్ళీ వచ్చారు. అక్కడ ఆయన లేకపోగా ఒక విశాలమైన, అందమైన మణిమయ భవనం కనిపించింది. రాజదంపతులిద్దరూ వింతగా దానిచుట్టూ తిరిగారు.

"దేవీ! చూశావా ఇది స్వర్గలోకంలా వుంది. మహర్షి దయవల్ల ఈ శరీరాలతో ఈ ప్రదేశాలు చూడడం మనకు సాధ్యమైంది" అంటూ భార్యతో కలసి ఆ భవంతిలోకి వెళ్ళాడు కుశికుడు. అందులో ఒక మణిమయ పర్యంకం మీద పడుకుని ఉన్నాడు  మహర్షి.  తీరా దగ్గరకు వెళ్ళబోయేసరికి ఆయన, ఆ మేడా కూడా మాయమయ్యారు. రాజదంపతులిద్దరూ తెల్లబోయి అటూ, ఇటూ చూసేసరికి ఒకచోట తపస్సు చేసుకుంటూ చ్యవనుడు కనిపించాడు.

"రాణీ! ఈ మహాముని యోగబలం చూశావా? రాజ్యం సులభంగా సంపాదించుకోవచ్చు. కాని ఈ బ్రాహ్మణత్వం, తపస్సు దుర్లభాలు సుమా!" అన్నాడు. కుశికుడు కళ్ళు తెరచి "ఇలా రండి!" అని పిలిచాడు.  రాజు దంపతులు ఇద్దరూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు.

"మహారాజా! ఇంద్రియాలను జయించావు నువ్వు ఏం కావాలో కోరుకో!" అన్నాడు చ్యవనుడు. "అయ్యా మిమ్మల్ని సేవించడం కంటే మాకింకేం కావాలి? ఒక్క సంగతి చెప్పండి. మా ఇంటికి వచ్చింది మొదలు మీరు ప్రవర్తించిన విధానం చూస్తే ఆశ్చర్యంగా వుంది. దానికి అర్థమేమిటో తెలియలేదు నాకు” అన్నాడు కుశికుడు.

మహర్షి నవ్వుతూ ఇలా చెప్పాడు..

"ఒకనాడు బ్రహ్మ ప్రసంగవశాన చెప్పాడు.. భృగు కుశిక వంశాలకు సంకరం కలుగుతుందని. అది విని మా వంశానికి సంకరం కలగడం ఇష్టంలేక కుశిక వంశాన్ని నిర్మూలించాలని నీ దగ్గరకు వచ్చాను. నీ దగ్గర ఎప్పుడైనా ఏలోటైనా కనిపిస్తుందేమో శపిద్దామని ఎన్నో నాటకాలు ఆడాను. కానీ నువ్వు ఉత్తముడివి. నీ గొప్పతనం చూసి మెచ్చుకుని, నువ్వూ, నీ భార్యా ఈ శరీరాలతోనే స్వర్గలోకం చూసేటట్టు చేశాను. అది చూసి నువ్వు రాచరికం మీద ఉదాసీనతా, బ్రాహ్మణ్యం మీద ఆసక్తి కనబరిచావు. నీ మనుమడు బ్రహ్మతేజస్వంతుడౌతాడు. బ్రహ్మర్షిగా త్రిలోకపూజ్యుడౌతాడు. నీకు భార్గవ వంశంతో సంబంధం కలుగుతుంది. సుఖంగా వుండు" అని చ్యవనుడు దీవించాడు.

కుశికుడి కొడుకు గాధిరాజు, అతని కూతురు సత్యవతిని భార్గవ వంశస్థుడు ఋచీకుడు పెళ్ళి చేసుకున్నాడు. గాధికి విశ్వామిత్రుడు పుట్టి చ్యవనుడి ఆశీర్వాదం వల్ల బ్రహ్మర్షి అయ్యాడు. ఉత్తమ క్షత్రియ కులమైన కుశిక వంశంలో పరమ బ్రాహ్మణుడైన విశ్వామిత్రుడు ఆ విధంగా జన్మించాడు. 


                                              *నిశ్శబ్ద.