Read more!

అధికమాసం అంటే ఏంటి.. నిజ శ్రావణ మాసం ఎప్పటి నుంచి!

 

అధికమాసం అంటే ఏంటి.. నిజ శ్రావణ మాసం ఎప్పటి నుంచి!

చాంద్రమానంలో ఒక నెల అంటే 29.53 రోజులు. దీనిప్రకారం చాంద్రమానంలో ఒక సంవత్సరం అంటే 354 రోజులు. అనగా చాంద్రమాన పద్ధతిలో సంవత్సరానికి 11 రోజుల తేడా ఏర్పడుతుంది. సౌరమానం చాంద్రమానంలో ఈ తేడా ప్రతీ నాలుగు సంవత్సరాలలో 31 రోజులు అవుతుంది. అది అధిక మాసంగా ఏర్పడును.

అందుచేత 32 నెలలకు ఒకసారి ఏర్పడు మాసాన్ని అధిక మాసంగా, చాంద్రమాన సంవత్సరానికి సౌరమాన సంవత్సరానికి ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెల అధికంగా జోడించి అధిక మాసమ అని అంటారు.

ఇలా ఈ అధిక మాసము శూన్యమాసమైనందున శుభకార్యాలు ఆచరించడానికి నిషిద్ధము. అధికమాసంలో వివాహము, ఉపనయనము, గర్భాదానం, గృహారంభం, గృహప్రవేశం వంటివి నిషేధించారు. అధికమాసంలో ఎలాంటి శుభకార్యాలను ఆచరించకూడదు. పితృ కార్యాలను కూడా అధికమాసాన్ని వదిలేసి నిజమాసంలోనే ఆచరించవలెను.

అధిక మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు

18 జూలై 2023 మంగళవారం నుంచి 16 ఆగస్టు 2023 బుధవారం వరకు అధిక శ్రావణ మాసం అవుతోందని చిలకమర్తి తెలిపారు. ఇక నిజ శ్రావణం 17 ఆగస్టు 2023 గురువారం నుంచి 15 సెప్టెంబరు 2023 వరకు ఉంటుందని వివరించారు. అధిక మాసం శూన్య మాసం. భగవత్ సాక్షాత్కారాానికి సంబంధించిన కార్యక్రమాలు, పుణ్యార్చన సంపాదించే కార్యాల ఆచరించవచ్చు. అనగా హోమాలు, విష్ణుసహస్రనామ పారాయణం, అష్టాదశ పురాణాలు, మహాభారత పఠనం, రామాయణ పఠనం వంటివి చేయవచ్చు.

అధిక మాసంలో ఆచరించవలసినవి

దైవారాధనలు, వ్రతాలు, పితృ ఆరాధన, అధికమాస పూజ, దానధర్మాలు వంటివి ఆచరించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. పురాణాల ప్రకారం అధిక మాసానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన విశేషమున్నది. మహావిష్ణువుకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసం అధిక మాసము. మహావిష్ణువు అధికమాసానికి పురుషోత్తమ మాసమని పేరు ఇచ్చినట్లుగా చెప్పబడినది.

విష్ణుమూర్తి అధికమాస మహాత్యాన్ని చెబుతూ ఈ మాసంలో చేసేటటువంటి మంచి పనులకు అధికమైన ఫలితాలు వస్తాయని అందుకనే ఈ మాసానికి అధికమాసమని పేరు. అందువలన అధిక మాసంలో విష్ణుమూర్తిని ఆరాధించడం, విష్ణు సహస్ర నామాలు పఠించడం ఏకాదశి రోజు ఉపవాసము వ్రతాలు దీక్షలు వంటివి చేయడం వల్ల మామూలు మాసముల కన్న అధికమైన ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

అనాథలకు మూగ జీవాలకు ఆహారాన్ని అందించడం, దానధర్మాలు ఆచరించడం వల్ల మామూలు మాసంలో చేసేటివంటి వాటి కంటే అధికమైన ఫలితం పురుషోత్తమమైన మాసం అయినటువంటి అధికమాసంలో లభిస్తుందని చిలకమర్తి వివరించారు.

పూర్వం ఇంద్రుడు అధిక మాస వ్రతాన్ని ఆచరించి ఇంద్ర పదవిని పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఒకానొకప్పుడు లక్ష్మీదేవి స్వయముగా అధికమాస మహిమ గురించి మహావిష్ణువును అడుగగా మహావిష్ణువు ఈ అధిక మాసమైనటువంటి పురుషోత్తమ మాసములో ఎవరైతే పుణ్య నదీ స్నానాలు జప హోమాలు, దానాలు వంటివి ఆచరిస్తారో వారికి మామూలు మాసంలో వచ్చేటటువంటి ఫలితాలు కన్నా అధిక రెట్ల ఫలితాలు వస్తాయని చెప్పారు.

నిజ శ్రావణ మాస తేదీలు..

నిజ శ్రావణ మాసం 17 ఆగస్టు 2023 గురువారం నుంచి 15 సెప్టెంబరు 2023 వరకు ఉంటుందని చిలకమర్తి వివరించారు. శ్రావణ సోమవార శివారాధన, మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మీ పూజలు, నాగ పంచమి, పుత్రద ఏకాదశి, జంద్యాల పూర్ణిమ (శ్రావణ పూర్ణిమ) వంటి పండగలన్నీ కూడా నిజ శ్రావణ మాసంలో 17 ఆగస్టు 2023 నుంచి 15 సెప్టెంబరు 2023 మధ్య జరుపుకోవాలి.