Read more!

హనుమంతుడు లంకను కాల్చిన తరువాత ఏమిజరిగింది?

 

హనుమంతుడు లంకను కాల్చిన తరువాత ఏమిజరిగింది?

హనుమంతుడు లంకను కాల్చేసిన తరువాత చారణులు అటుగా వెళ్తూ (భూమికి దగ్గరగా ఆకాశంలో ఎగురుతూ శుభవార్తలు చెప్పే దేవ గాయకులు) "ఏమి ఆశ్చర్యం, ఇవ్వాళ ఒక వానరుడైన హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఆ లంక అంతా కాలిపోతుంది, కాని శింశుపా వృక్షము, ఆ వృక్షము కింద కూర్చున్న సీతమ్మకి ఎటువంటి అపకారము జరగలేదు. అలాగే విభీషణుడి ఇల్లుకి కూడా ఏమి జరగలేదు" అన్నారు. 

 హనుమంతుడు శింశుపా వృక్షం కిందన కూర్చున్న సీతమ్మ దగ్గరికి వచ్చి "అమ్మా లంకంతా కాల్చేశాను. రావణుడికి చెప్పవలసిన మాట చెప్పేశాను, నువ్వేమి బెంగపెట్టుకోకు. వాడు ఇప్పటికే భయంతో సగం చచ్చిపోయాడు. రాముడి కోసం వాడిని వదిలేశాను, లేకపోతే వాడి పది తలకాయలు గిల్లేసేవాడిని. అమ్మా! నేను బయలుదేరతాను, తొందరలోనే నీకు పట్టాభిషేకం జరుగుతుంది, శోకమునకు గురికాకు" అని సీతమ్మతో చెప్పి ఒక్క దూకు దూకి ఆకాశంలోకి ఎగిరి నల్లటి వనాలతో, ఎర్రటి మచ్చలు కలిగిన ఏసుగులతో ఉన్న అరిష్టం అనే పర్వతం మీద దిగి, అక్కడినుండి బయలుదేరాడు. హనుమ ఆ పర్వతం మీద నుండి ఎగిరేసరికి అది భూమిలోకి నొక్కుకుపోయింది.

ఆకాశంలో మేఘాల్ని తాకుతున్నాడ, అన్నట్టుగా ఎగురుకుంటూ  ఉత్తర దిక్కున హనుమ కోసం ఎదురుచూస్తున్న వానరముల వైపు వెళుతూ ఇంకా సముద్రతీరం కొంచెం దూరంలో ఉందనగా ఒక పెద్ద నాదం చేశాడు. 

సముద్రతీరం దగ్గర హనుమంతుడి కోసం ఎదురుచూస్తున్న వానరాలు ఆకాశం బద్దలయ్యిందా అనుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ జాంబవంతుడి దగ్గరికి వచ్చి "తాత, అంత పెద్ద అరుపు వినిపిస్తోంది, అది హనుమదేనా?" అన్నారు.

జాంబవంతుడు ఆ అరుపును మరొక్కసారి విని "అది కచ్చితంగా హనుమే. హనుమకి ఒక కార్యం చెబితే అవ్వకపోవడం అన్నది ఉండదు. తాను వెళ్ళిన పని అయ్యింది కాబట్టే ఇంత పెద్ద మహానాదం చేశాడు" అన్నాడు.

హనుమని అంత దూరంలో చూడగానే వానరులంతా పరుగులు తీశారు, అప్పుడు హనుమంతుడు "చూడబడెను సీతమ్మ" అని ఒక పెద్ద కేక వేసి మహేంద్రగిరి పర్వతం మీద దిగారు. జాంబవంతుడు, అంగదుడు, గంధమాదనుడు మొదలైనవారు తప్ప మిగిలిన వానరములన్నీ తమ తోకల్ని కర్రలలా నిలువుగా పెట్టి, ఆ తోకల్ని చేతులతో పట్టుకుని హనుమ దిగిన కొండ ఎక్కి, ఆయనని ముట్టుకొని పారిపోతున్నారు. అప్పుడు హనుమంతుడు గుహలో ఉన్న అంగదుడు మొదలైన వారికి తన ప్రయాణం గురించి చెప్పాడు.

 "నిజంగా ఆ రావణుడికి ఎంత తపఃశక్తి ఉందో, సీతమ్మని ముట్టుకుని కూడా వాడు బూడిద కాలేదు. కాని సీతమ్మ పాతివ్రత్యం చేత రావణుడు ఎప్పుడో మరణించాడు, రాముడు నిమిత్తంగా వెళ్ళి బాణం వేసి చంపడం ఒకటే మిగిలింది" అన్నాడు.

అప్పుడు అంగదుడు "అంతా తెలిసిపోయింది కదా, ఇంక రాముడికి చెప్పడం ఎందుకు. ఇలాగే వెళ్ళిపోయి ఆ రావణుడిని సంహరించి, సీతమ్మని తీసుకొని వచ్చి రాముడికి ఇచ్చేద్దాము" అన్నాడు.

 జాంబవంతుడు అంగధుడితో "తప్పు. అలా చెయ్యకూడదు, పెద్దలు చెప్పినట్టు చెయ్యాలి తప్ప స్వతంత్రంగా చెయ్యకూడదు. ఈ విషయాలని రాముడికి చెప్పి రాముడు ఎలా చెబితే అలా చేద్దాము" అన్నాడు.

                                   ◆వెంకటేష్ పువ్వాడ.