మైసూరు రాజులకి ఓ రాణి శాపం - తలకాడు!

 

 

మైసూరు రాజులకి ఓ రాణి శాపం - తలకాడు!

 

 

400 ఏళ్ల క్రితం మైసూరు రాజ్యాన్ని విజయనగర రాజులు పాలించేవారు. వారిలో ‘శ్రీ రంగరాయ’ ఒకరు. ఆయన ఏదో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ ఉండేవారట. ఆ వ్యాధి ఎలాంటి చికిత్సలకీ లొంగకపోవడంతో... శ్రీరంగరాయ, తలకాడుకి వెళ్లి అక్కడ వైద్యానాథుని ఆలయంలో ప్రార్థనలు నిర్వహించసాగారు. కానీ విధిలిఖితం! ఆయన వ్యాధి ఉపశమించకపోగా, ఆఖరి క్షణాలు దగ్గరపడ్డాయి. ఈ విషయం తెలిసిన ఆయన భార్య అలమేలమ్మ తను ఉంటున్న ‘శ్రీరంగపట్నం’ని వీడి, తలకాడుకి బయల్దేరింది. వెళ్తూ వెళ్తూ శ్రీరంగపట్నాన్ని ‘రాజా ఒడయార్‌’ అనే నమ్మకస్తునికి అప్పగించింది.

 

 

రాణిగారి దుస్థిని గమనించిని ‘రాజాఒడయార్’, శ్రీరంగపట్నాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. అంతేకాదు! రాణిగారి వద్ద ఉన్న బంగారం మొత్తాన్నీ తీసుకురమ్మంటూ తన సైన్యాన్ని పంపాడు. రాజాఒడయార్‌ సైన్యం తన వెంటపడటం చూసిన రాణికి పట్టరాని ఆవేశం వచ్చింది. అటు భర్తనీ, ఇటు రాజ్యాన్నీ దక్కించుకోలేని దైన్యంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కావేరీ నదిలోని ‘మాలంగి’ అనే ప్రాంతంలో దూకుతూ... తన దుగ్ధనంతా ఒక శాపంగా మార్చిందని చెబుతారు. ‘ఇక మీదట తలకాడు క్షేత్రం ఇసుకలో మునిగిపోతుంది, నేను చనిపోయే మాళంగి ప్రదేశం ఒక సుడిగుండంగా మారిపోతుంది, రాజా ఒడయార్‌ వంశం నిర్వంశంగా మారిపోతుంది,’ అన్నదే ఆ రాణి పెట్టిన శాపం.

 

 

ఆశ్చర్యకరంగా రాణి అలమేలమ్మ శాపం అని చెప్పే ఆ మూడు ఘటనలూ జరిగితీరాయి. చరిత్రలో ఓ వెలుగు వెలిగిన తలకాడు, ఇసుకతో మునిగిపోయి ఎడారిని తలపించసాగింది. పక్కనే కావేరీ నది ప్రవహిస్తున్నా, తలకాడులో ఉష్ణోగ్రతలు భరించలేనంతగా ఉంటాయి. ఇక మాలంగి అనే ప్రాంతంలో విపరీతంగా సుడిగుండాలు కనిపిస్తాయట. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన అంశం... ఒడయార్‌ రాజవంశం నిర్వీర్యం కావడం. దాదాపు 400 ఏళ్లుగా ఒడయార్ రాజవంశం సంతానలేమితో బాధపడుతూనే ఉంటోంది. ప్రతి రెండు తరాలకి ఒక తరంలో పిల్లలు కలగకపోవడం విభ్రాంతిని కలిగిస్తుంది. ఎప్పటికప్పుడు మైసూరు మహారాజులు తమ బంధువుల బిడ్డలను దత్తతు తెచ్చుకోవాల్సిన పరిస్థితి!

ఒక పక్క వేల ఏళ్ల చరిత్ర, మరోపక్క రాణి అలమేలమ్మ గాథ... ఈ రెండింటినీ ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు తలకాడుకి చేరుకుంటూ ఉంటారు. అక్కడ ఇసుకమేటల మధ్య ఠీవిగా నిలబడిన వైద్యనాథుని ఆలయాన్ని దర్శిస్తారు. వైద్యనాథ ఆలయంతో పాటుగా తలకాడులో మరో నాలుగు శివాలయాలనీ కలిపి పంచలింగాలని పిలుస్తారు. వీటిలో పాతాళేశ్వర లింగానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ లింగం ఉదయం వేళల్లో ఎరుపు రంగులో, మధ్యాహ్నం నల్లగా, సాయంవేళల తెల్లగా కనిపించడం విశేషం!

 

 

తలకాడులోని ఐదు లింగాలనీ పూజించేందుకు ‘పంచలింగ దర్శనం’ పేరుతో ఘనంగా ఉత్సవాలని నిర్వహిస్తారు. కార్తీకసోమవారం, వైశాఖ నక్షత్రం రెండూ కలిసి వచ్చే సందర్భంలో పండితులు ఈ పంచలింగ దర్శనాన్ని ప్రకటిస్తారు. 7 నుంచి 13 ఏళ్ల వరకూ ఎప్పుడైనా ఇలాంటి సందర్భం రావచ్చునట! తలకాడు చుట్టూ ఇన్ని విశేషాలు ఉన్నాయి కనుక... మైసూరుకి వెళ్లేవారు కాస్త ఓపికచేసుకుని ఈ పంచలింగ క్షేత్రం వరకూ వెళ్లివస్తుంటారు.                                        

- నిర్జర.