Read more!

నైమిశారణ్యం - 21

 

 


 నైమిశారణ్యం - 21



విష్ణుపాదోద్భవ - గంగాదేవి

 

 

ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి తల్లిదండ్రులు ఉంటారు. వారు దేవతలైనా సరే., దానవులైనా సరే., మరే జాతి వారైనా సరే., తల్లిదండ్రులు లేకుండా జన్మించడం జరగదు. కానీ గంగాదేవికి మాత్రం జన్మనిచ్చిన తండ్రే గాని తల్లి మన పురాణాల్లో కనిపించదు.. గంగ విష్ణుపాదాలనుంచి ఉద్భవించిందని పురాణ కథనం. ఆ కథ ఏమిటంటే...

ఒకసారి నారదమహర్షి నారాయణ సంకీర్తనం చేస్తూ హిమాలయాలమీదుగా ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. అప్పుడు అతనికి ఎందరో స్త్రీలు, పిల్లలు ముక్తకంఠంతో రోదనలు చేస్తున్న ధ్వనులు వినిపించాయి. నారదుడు ఆశ్చర్యపోయి ఆ దిశగా వెళ్లి చూసాడు. అక్కడ ఎందరో స్త్రీలు, పిల్లలు ఏదో ఒక అవయవ లోపంతో ఏడుస్తూ కనిపించారు. ‘మీకీ అవయవ లోపాలేమిటి..మీ రోదనలకు కారణం ఏమిటి? ’ అని వారిని ప్రశ్నించాడు. అప్పుడు వారు కన్నీరు తుడుచుకుని ‘నారదా.. మేము రాగాధి దేవతలం. తోడి, కల్యాణి శంకరాభరణం, ఇత్యాది రాగాల పేర్లే మా పేర్లు. వీరంతా మా పిల్లలు. మోహన, హిందోళం, వసంత ఇత్యది జన్యరాగాల పేర్లే వీరి పేర్లు. భూలోకంలోని మానవులు సంగీత సాధన చేస్తున్నప్పుడు రాగసంకరం జరిగినా., అపస్వరం దొర్లినా., మాకిలా అవయవ లోపాలు ఏర్నడతాయి’. అని చెప్పారు.  ‘మీకీ అవయవ లోపం పోయే మార్గం లేదా’ అని నారదుడు వారిని తిరిగి ప్రశ్నించాడు. ‘ఉంది. ఎవరైనా సంగీతశిఖామణి తన దివ్య గానంతో మా రాగాలను సుస్వరయుక్తంగా ఆలాపిస్తే.. మాకీ అవయవలోపం పోతుంది’ అని వారు బదులిచ్చారు.

 

‘ఈ సృష్టిలో నాకన్న గొప్ప సంగీతశిఖామణి ఎవరున్నారు..నేను మీ అవయవలోపాన్ని సరిచేస్తాను’ అన్నాడు నీరదుడు. ‘ప్రయత్నించి చూడు’ అని వారు బదులిచ్చారు. నీరదుడు తన మహతిని శృతిబద్ధం చేసి 72 మేళకర్త రాగాలనూ.. వాటి జన్యరాగాలనూ ఆలాపించాడు. కానీ ఎవ్వరికీ అవయవలోపం సరికాలేదు. అది చూసి ఆశ్చర్యపోయాడు నారదుడు. అప్పుడు వారు ‘నారదా.. మా అవయవలోపాన్ని సరిచేసే సంగీత ప్రతిభ నీకేకాదు....సకలకళాగతల్లి అయిన ఆ సరస్వతీదేవికే లేదు’ అన్నారు. నారదుడు మరింత ఆశ్చర్యపోతూ..‘మరి మీ అవయవలోపం సరిచేసే మార్గమే లేదా అని అడిగాడు.’ ‘ఉంది..సంగీతానికి ఆద్యుడు.,నాథుడు అయిన ఆ పరమశివుడు ఇక్కడకు వచ్చి తన గానమాధుర్యంతో రాగసంచారం చేసినప్పేడు మా అవయవలోపం పోతుంది’ అని వారు బదులిచ్చారు.

అయితే ఇప్పుడే కైలాసం వెళ్లి పరమశివుని తీసుకుని మీ దగ్గరకు వస్తాను ’ అని చేప్పి నారదుడు కైలాసం వెళ్లి ఆ రాగాధి దేవతల విషయం శివునకు విన్నవించాడు. అంతావిన్న శివుడు ‘నేను తప్పకుండా వారి దగ్గర సంగీత కచేరి చేసి వారి అవయవ లోపాలను సరిచేస్తాను. అయితే..నా సంగీతాన్ని విని అర్థం చేసుకుని ఆనందించి నన్ను ప్రశంసించే ఉత్తమ శ్రోత ఒక్కడైనా ఒక్కడు ఉండాలి’అన్నాడు.  ‘అలాంటి ఉత్తమ శ్రోత ఎవరున్నారు’ అని నారదుడు శివుని ప్రశ్నించాడు. ‘నాదలోలుడైన ఆ శ్రీహరే నా సంగీతాన్ని అర్థం చేసుకోగల ఉత్తమ శ్రోత’అని బదులిచ్చాడు శివుడు. వెంటనే నారదుడు వైకుంఠం వెళ్లి సంగతంతా చెప్పి...పరమశివుని సంగీత కచేరి వినడానికి శ్రీహరిని ఒప్పించాడు.

హిమాలయాల్లో రాగాధి దేవతల ముందు పరమశివుని సంగీత కచేరి ప్రారంభమైంది. ఆ సంగీత కచ్చేరీకి బ్రహ్మాది దేవతలు వచ్చారు. పరమశివుని గానంలో 72 మేళకర్తలు, వాటి జన్యరాగాలు జవజీవాలు సంతరించుకోని స్వర సంచారం చేస్తున్నాయి. వాటి మహిమవల్ల రాగాధి దేవతల అవయవాల లోపాలు చక్కబడి వారి వారి లోకాలకు వెళ్లిపోతున్నారు. పరమశివుని గాంధర్వ గానానికి శ్రీమహావిష్ణువు ఆనంద రసమయ లోకాలలో విహరిస్తూ... పరవశించిపోతున్నాడు. ఆయన హృదయానందమే జలరూపంధరించి ఆ శ్రీహరి కుడికాలి బోటనవేలు నుండి బయటకు ప్రవహించింది. అది గమనించిన భ్రహ్మదేవుడు తిరిగి అలాంటి అవకాశం లబించదని ఆ పవిత్ర జలాన్ని తన సువర్ణ కలసంలో భద్రపరిచాడు. అలా విష్ణుపాదోద్భంగా గంగ జన్మించింది. శ్రీమహావిష్ణువు వామనావతారం ధరించి త్రివిక్రముడై ఒకపాధంతో భూమిని, మరోక పాధంతో ఊర్ధ్వలోకాలను కొలిచే సమయంలో ఆ విష్ణు పాధాన్ని తన కమండలంలో భద్రపరిచిన గంగాజలంతో అభిషేకించాడు చిత్రముఖుడు. అప్పుడే గంగానది దివిజగంగా అవతరించింది. ఆ తర్వాత కాలంలో భగీరధ కోరిక మేరకు పరమశివుని శిరసుపై ఊరికి, అచ్చట నుంచి మానససరోవరంలోని భిందు సరసులోకి దుమికి గంగానదిగా అవనిపై ప్రవహించింది స్వరనదిమాత అయిన గంగానది. ఇది గంగ కథ.

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం