Read more!

రాధాదేవికి ఆడవారి కన్నీటికి ఉన్న సంబంధం ఇదే!

 

రాధాదేవికి ఆడవారి కన్నీటికి ఉన్న సంబంధం ఇదే!

సర్వేంద్రియాలతో ఎవరు కృష్ణ భక్తిరసం పానం చేస్తారో ఆ జీవుడు గోపి. ఈ గోపీ తత్త్వానికి అధిష్ఠాన దేవత రాధాదేవి. అనేక జన్మల నుంచి పరమాత్మ సాయుజ్యం కోసం తపించి పోతున్న యోగినులు, యోగులు గోపికలుగా అవతరించారు. ఆ గోపికలందరినీ శరద్రాత్రి వేళ కృష్ణ సాయుజ్యం ఘటింపజేసి, వారిని తరింపజేసి, రాస లీలలో ప్రవేశింపజేసిన శక్తి - రాధ. కృష్ణ వేణునాదం విని, ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా ప్రాపంచిక స్పృహ వదిలి వెళ్ళిపోయారంటే వాళ్ళ స్థితి దైహికమైనది కాదని వర్ణిస్తారు పోతన గారు. ఈ స్థితిలో వాళ్ళు అక్కడకు చేరగానే కృష్ణుడు వాళ్ళతో కలసి తిరిగి, అంతర్థానమైపోతే - కలసి తిరిగినప్పుడు ఆనందించి, అంతర్థానమైనప్పుడు ఏడవడం వల్ల వాళ్ళ కర్మలన్నీ క్షయమై పోయాయట. అప్పుడు వాళ్ళకు రాసలీలలో ప్రవేశం ఇస్తాడు. రాధాదేవి ఈ భక్తులను చూసి ఆ భక్తిధారను, పరమేశ్వరుడి కృపాధారతో అనుసంధానం చేస్తూ వాళ్ళను రాసలీలలో ప్రవేశింపజేసింది.

కృష్ణుడు జగత్తునంతా ఆకర్షిస్తే ఆ కృష్ణుణ్ణి కూడా ఆకర్షించగలిగే శక్తి ఈ జగదంబిక రాధ. అందుకు ఆ తల్లిని ఇలా వర్ణిస్తున్నారు.

"పంచప్రాణాధి దేవీ యా పంచప్రాణ స్వరూపిణీ, ప్రాణాధిక ప్రియతమా సర్వాభ్య సుందరీ పరా సర్వయుక్తా చ సౌభాగ్యమానినీ గౌరవాన్వితా పరావరా సారభూతా పరమాద్యా సనాతనీ పరమానంద రూపా చ ధన్యామాన్యా చ పూజితా రాసక్రీడాధి దేవీ శ్రీకృష్ణస్య పరాత్మనః రాసమండల సంభూతా రసమండల మండితా రాసేశ్వరీ సురశికా రాసావాస నివాసినీ గోలోకవాసినీ దేవీ గోపీ వేష విధాయి పరమాఫలాద రూపా చ సంతోషహర్ష రూపిణీ..

 ఆ తల్లి నారాయణుని ఆహ్లాద రూపం. సంతోష హర్షరూపం. స్వామి ఆనంద స్వరూపం తల్లి. అందుకే రాధాదేవిని ఆరాధించేవారు. సచ్చిదానంద స్థితికి చేరుకుంటున్నారు. రాధోపాసన అంత తేలిక కాదు. "షష్ఠి వర్ష సహస్రాణి ప్రతప్తే బ్రహ్మణః పురా . - బ్రహ్మదేవుడు ఆరువేల సంవత్సరాలు తపస్సు చేస్తే రాధాదేవి తన కాలి కొనగోటిని చూపించిందట. తల్లి సాక్షాత్కారం అంత దుర్లభం. రాధాదేవి అనుగ్రహం సామాన్యమైనది కాదు. “యత్పాదపద్మ నఖ రదృష్టయే చ ఆత్మశుద్ధయే - అమ్మ కాలి గోళ్ళను తలచుకుంటే చాలు ఆత్మ శుద్ధి కలుగుతుందట. అందుకే రాధాదేవి అంటే పూర్ణ శుద్ధ తత్త్వం. రాధ దగ్గరకు వెళ్ళేటప్పటికి ఐహికమైనది ఏమీ మిగలదు, కేవలం పరమాత్మ మాత్రమే మిగిలి ఉంటాడు. ఇది ఆ లలితా పరమేశ్వరి ధరించిన పంచమ స్వరూపం.

మనం పరిశీలిస్తూ ఉంటే సర్వ విశ్వంలోనూ అమ్మ ఉంది. - “అంశరూపాః కళారూపాః కళాంశాంశ సంభవాః ప్రకృతే ప్రతి విశ్వసు దేవ్యైశ్చ సర్వయోషితః - ఆ తల్లి అంశ రూపాలుగా, కళారూపాలుగా, కళాంశాంశ రూపాలుగా ఉంది. ముఖ్యంగా స్త్రీలలో అమ్మ ప్రకాశం ఉంది. లోకంలో ఏ స్త్రీలోనైనా అమ్మ ఉంటుంది. స్త్రీని ఎట్టి పరిస్థితిలోనూ నిందించరాదు. స్త్రీ అంటేనే అమ్మ. స కార, త కార, ర కారాలు సతర - ఇవే సత్త్వ రజ స్తమో గుణాలు. అనేది అమ్మ స్వరూపం, 'యీం' అన్నది బీజం. స-త-ర-యీ కలిపితే అయింది. అందుకు సత్త్వ రజస్తమో గుణాత్మికమైన శక్తి స్త్రీ. అదే అమ్మ. అందుకే స్త్రీ కంట నీరు పెట్టే పని ఎప్పుడూ చెయ్యరాదు అని శాస్త్రం చెబుతోంది.

                                      *నిశ్శబ్ద.