Read more!

భర్త ఆయుష్షు కోసం చేసే వ్రతం...

 

భర్త ఆయుష్షు కోసం చేసే వ్రతం...

 


 
ఎంతో పవిత్రమైన జ్యేష్ఠ మాసములో ఒక్కో రోజు ఎంతో పవిత్రతను సంతరించుకుంది.
ఈ మాసములో వివాహితులైన స్త్రీలు జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి,చతుర్దశి, పూర్ణిమ తిథులలో వట సావిత్రీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం ఒక్కో చోట, ఒక్కో రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది. వట వృక్షమును కొంతమంది అశ్వత్థ నారాయణుడు అని భావించి లక్ష్మి దేవిని కూడా పెట్టి పూజిస్తారు. కొంతమంది శివ, పార్వతులుగా భావించి పూజిస్తారు.

 

 

సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుని కాపాడుకోవడం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది ఆచరించి, సత్ఫలితము పొందిన వ్రతము ఇది. ఆ తల్లి తన భర్తను బతికించుకున్న ఈ రోజు వట సావిత్రీ వ్రతముగా ఈ రోజుకు కూడా ఆచరించబడుతోంది.

అన్ని వ్రతాలలానే ఈ వ్రతానికి కూడా సూర్యోదయాత్ పూర్వమే లేచి, అభ్యంగన స్నానము ఆచరించి, ఉపవసించి, రావి చెట్టుకు షోడశోపచార పూజ చేసి, బ్రాహ్మణుడి ద్వారా కథ విని, వారిని సత్కరించి, బ్రాహ్మణ ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి, వారి ఆశీర్వాదము పొందాలి. సాయంత్రం దీపారాధన అనంతరం భుజించాలి.

 

 

రావి చెట్టును లక్ష్మి,నారాయణులుగా  లేదా శివ, పార్వతులుగా భావించి ఐదు పోగుల దారాలను చుట్టూ తిరుగుతూ చుట్టి, పసుపు గౌరమ్మకు పూజ చేయాలి. ఇలా మనసారా పూజించడం ద్వారా కలకాలం సౌభాగ్యం నిలిచి, సంపదలు వృద్ధి చెందుతాయని పెద్దలు చెపుతుంటారు.

ఈ వ్రతం యొక్క అద్భుతమైన మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఈ కారణం వల్ల అయినా సరే భార్య ఈ వ్రతాన్ని ఆచరించలేని అనారోగ్య స్థితిలో ఉంటే సంకల్పం చేసి ఆమెను కర్తగా పెట్టి భర్త అయినా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.

భార్యా భర్తల అభేదానికి అద్భుతమైన నిదర్శనం అయిన ఈ వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలు పొందుదాము.

https://www.youtube.com/watch?v=4GgsX8NPdtk