Read more!

Vasant Panchami: Goddess Sarasvati birthday

 

వసంత పంచమి

Vasant Panchami

 

మాఘ శుద్ధ పంచమిని ''వసంత పంచమి'' అంటారు. ఈ పర్వదినాన్ని ''శ్రీ పంచమి'' పేరుతో కూడా వ్యావహరిస్తారు. ఒరిస్సా, బెంగాల్ తదితర ప్రాంతాల్లో వసంత పంచమినే ''బసంత్ పంచమి'' అంటారు.

 

ఇంతకీ ''శ్రీ పంచమి'' లేదా ''వసంత పంచమి'' అంటే చదువులతల్లి సరస్వతీదేవి జన్మదినం. దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని, నవరాత్రులను పురస్కరించుకుని దుర్గాదేవిని పూజించినట్లే వసంత పంచమినాడు సరస్వతీదేవిని ఆరాధిస్తారు. ఇళ్ళలో, దేవాలయాల్లో కూడా సరస్వతీదేవిని భక్తిశ్రద్ధలతో అర్చిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు మక్కువైన పండుగ ఇది.

 

సృష్టికర్త బ్రహ్మదేవుని అర్థాంగి అయిన సరస్వతీ దేవి ఆయన్ను సుసంపన్నం చేస్తుంది.

సరస్వతీ దేవి నాలుగు చేతులు నాలుగు దిక్కులకు సంకేతం.

ఆ అమ్మ శ్వేతవర్ణం బ్రహ్మ తేజస్సును ప్రతిఫలిస్తుంది.

సరస్వతీ దేవి నాలుగు చేతుల్లో ధరించిన -

1) పుస్తకం : విజ్ఞానసర్వస్వం లాంటి వేదాలు

2) జపమాల : అక్షరజ్ఞానాన్ని అందిస్తూ శ్రద్ధాసక్తులను పెంచడానికి తోడ్పడుతుంది.

3) వీణ : కళలకు సంకేతం. అంతేకాదు, అతీంద్రియ శక్తులను అందించి మోక్షానికి దారితీస్తుంది.

4) కమలం : సృష్టికి సంకేతం

 

సరస్వతీ దేవి ధరించే తెల్లని చీర : స్వచ్ఛతకు నిదర్శనం

సరస్వతీ దేవి అధిరోహించిన శ్వేత హంస : ఆత్మలన్నిటికీ మూలమైన పరమాత్మను సూచిస్తుంది.

సరస్వతీ దేవి పుట్టింది కూడా చల్లటి కాలంలో. చల్లదనం కారుణ్యానికి సంకేతం. ఒక్క మాటలో చెప్పాలంటే సరస్వతీ దేవి అపరిమితమైన స్వచ్చతకు, అపార జ్ఞానాకికి, కళలకు, సృజనాత్మకతకు, మోక్షసిద్ధికి కారకం, సూచకం.

 

వసంత పంచమి రోజున భక్తులు సరస్వతీ దేవిని ఆధ్యాత్మిక జ్ఞానానికి నిదర్శనమైన పసుపుచీరతో అలంకరిస్తారు.

ఓం సరస్వతీ మహాభాగ్యే విద్యే కమలలోచనే

విశ్వరూపే విశాలాక్షీ, విద్యాం దేహి నమోస్తుతే

జయజయ దేవి చరాచరశరీ కుచయుగ శోభిత ముక్తహారే

వినా రంజిత పుస్తక హస్తే భగవతి భారతి దేవి నమోస్తుతే

 

తదితర స్తోత్రాలతో పూజిస్తారు. తాము కూడా పసుపు వస్త్రాలు ధరిస్తారు. సరస్వతీదేవికి మిఠాయిలు నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా పంచుతారు.

చిన్నారులకు వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది. స్కూళ్ళు, కాలేజీల్లో ఈరోజున సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విద్యార్థులు ఈరోజున కొన్ని పాఠ్య పుస్తకాలను పూజలో సరస్వతీ దేవి వద్ద ఉంచి నమస్కరించుకుంటారు. మరుసటిరోజు వరకూ వాటిని కదిలించరు. అలా అయితే దేవి ఆశీర్వదిస్తుందని, తమ చదువుకు ఎలాంటి ఆటంకాలూ ఉండవని విశ్వసిస్తారు.

 

ఈ పర్వదినం రోజున పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు.

కొందరు వసంత పంచమి రోజున సూర్యభగవానునికి, గంగానదికి కూడా పూజలు నిర్వహిస్తారు.

వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యాసంస్థలు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. ఈరోజు సందర్భంగా విద్వాంసులకు పురస్కారాలను కూడా అందజేస్తారు.