Read more!

శ్రీ వసంత పంచమి

 

శ్రీ వసంత పంచమి
 

 

మాఘమాసం వచ్చిన ఐదో రోజు మనం జరుపుకునే మరో శుభదినం ఈ వసంత పంచమి. దీనినే శ్రీ పంచమి అని,సరస్వతి పంచమి అని  కూడా అంటారు. ఈ శ్రీ పంచమి  రోజే చదువులతల్లి సరస్వతీ దేవి పుట్టినట్టు బ్రహ్మవైవర్త  పురాణం చెపుతోంది. ప్రకృతిలోని చెట్ల ఆకులన్నీ పసుపుగా మారి అమ్మ రాకకోసం నేలనంతా పసుపుతో అలికాయా అనట్టుగా ఉంటుంది వాతవరనమంతా. ఈ శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం మొదలుపెడితే వారు ఉన్నతవిధ్యావంతులు అవుతారనే నమ్మకం కూడా చాలామందికి ఉంది. అందుకే తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు చాలామంది తల్లితండ్రులు.మన జిల్లాలోని బాసర ఆలయంలో ఈ ఉత్సవాన్ని మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చి ఎంతోమంది తమ పిల్లలకి అక్షరాభ్యాసాలు,అన్నప్రాసనలు  చేయించుకుంటారు.మన తెలుగు రాష్ట్రాల్లో సరస్వతి పూజకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇళ్లలోనే కాకుండా స్కూల్స్ మరియు కాలేజీలలో కూడా సరస్వతి పూజ నిర్వహిస్తారు.

 

 

ఉత్తరాదిన కూడా వసంత పంచమిని ఎంతో వేడుకగా చేసుకుంటారు. పశ్చిమ బెంగాలులో సరస్వతి విగ్రహానికి మూడురోజులు పూజలు చేసి ఆఖరు రోజు గోదావరి నదిలో అనుపుతారట. పంజాబ్,బిహార్ రాష్ట్రాలలో దీనిని పంతంగుల పండుగగా జరుపుకుంటారు. మనం ఇక్కడ సంక్రాంతి పండగకి ఎలాగైతే గాలిపటాలని ఎగురవేస్తామో అక్కడ ఈ శ్రీ పంచమికి అన్ని వయసులవారు గాలిపటాలని  ఎగరేస్తారు. అమ్మవారికి కేసరి ప్రసాదం పెట్టటం ఇంకో విశేషం.  ఈ వసంత పంచమి రోజు పసుపు రంగుకి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఉత్తరాది వారు. అమ్మవారిని పసుపు వస్త్రాలతో అలంకరించటమే కాకుండా అందరు పసుపు రంగు బట్టలే కట్టుకుంటారట. ఇంకొన్ని ప్రాంతాల్లో వసంత పంచమినే కామదేవ పంచమి అని కూడా అంటారు. రతి దేవి,కామదేవుడు వసంత ఋతువు వచ్చిన ఆనందంలో రంగులు జల్లుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారట. అందుకే దేశం లోని కొన్ని ప్రాంతాల వారు ఈ పంచమి రోజు రంగులు జల్లుకుంటారు కూడా

ఎన్ని ప్రాంతాలవారు ఎన్ని రకాలుగా జరుపుకున్నా ఆ చదువులతల్లి దీవెనలు అందరిని వరించాలనే  కోరుకుందాం. 

కళ్యాణి