Read more!

ఉండ్రాళ్ళతద్ది నోము

 

ఉండ్రాళ్ళతద్ది నోము

 

 

భాద్రపద బహుళ తదియ రోజున సుదతులు, సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే ‘ఉండ్రాళ్ళ తద్ది’. భక్తి విశ్వాసాలతో నిష్ఠానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ట సిద్ధిని కలిగించే స్ర్తిలు నోచుకునే నోము ‘ఉండాళ్ళ్ర తద్ది’ ఈ నోముకు ‘మోదక తృతీయ’ అనే మరోపేరు కూడా కొన్నది. ప్రత్యేకంగా ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడంచే ‘తద్ది’ అనుమాట మూడవ రోజు ‘తదియ’ అనే అర్థంతో వాడబడినది కనుక ‘తదియ’, ‘ఉండ్రాళ్ళ తద్ది’గా పిలువబడుతున్నది. ఈ నోమును భాద్రపదంలో బాగా వర్షాలు కురిసే ఋతువులో పూర్ణిమ వెళ్ళిన మూడోరోజున, అంటే బహుళ తదియన ‘ఉండ్రాళ్ళతద్ది’ నోమును నోచుకోవాలని మన పూర్వలు నిర్ణయించారని, అంతేకాదు ఈ నోమును గురించి సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని ఐతహ్యం. ఈ ఉండ్రాళ్ళ తద్ది వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉన్నది.

 

 

పూర్వము ఒక రాజు ఏడుగురు భార్యలు కలిగియున్నా, ఓ వేశ్యయైన ‘చిత్రాంగి’పై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది. ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి భార్యలందరూ ‘ఉండ్రాళ్ళ తద్ది’ అనే నోమును నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా వినిన చిత్రాంగి, రాజుగారితో ‘‘నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ‘ఉండ్రాళ్ళ తద్ది’ నోము చేయించుకున్నావు. నేను ఒక వేశ్యనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యలమీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ళ తద్దెనోము జరుపుకోవటానికి అవసరమైన సరకులను సమకూర్చమని’’ రాజు తనవద్దకు వచ్చిన సమయంలో అడిగింది. రాజు అట్లేయని సరుకులను పంపిస్తాడు. ఆ చిత్రాంగి భాద్రపద తృతీయనాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానమాచరించి, సూర్యాస్తమయము వరకు ఏమీ భుజించక ఉపవాస దీక్ష ఉండి, చీకటి పడగానే గౌరిదేవికి బియ్యం పిండితో ఉండ్రాళ్ళను చేసి, ఐదు ఉండ్రాళ్ళను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి, మరో అయిదు ఉండ్రాళ్ళను ఒక పుణ్యస్ర్తికి వాయనమిచ్చి, నోము ఆచరించి గౌరిదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా ఐదేళ్ళు నిర్విఘ్నంగా నోమునోచుకుని, ఉద్యాపన చేసిన ఫలితంగా ఆపవిత్రయైన ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందింది.

 

 

భాద్రపద తృతీయ తిథినాడు నోమును ఆచరించే స్త్రీలు సూర్యోదయానికి ముందుగానే అభ్యంగన స్నానమాచరించి, సూర్యాస్తమయము వరకు ఉపవాసం ఉండి, బియ్యం పిండితో ఉండ్రాళ్ళను చేసి వండి గౌరిదేవిని పూజా మందిరంలో ప్రతిష్ఠించి షోడశోపచార విధిగా పూజ గావించి, ఐదు ఉండ్రాళ్ళను గౌరీదేవికి, మరో ఐదు ఉండ్రాళ్ళను వాయనముపై దక్షిణ తాంబూలాలను ఉంచి ఐదుగురు ముతె్తైదువులకు వాయనం ఇవ్వాలి. ఇలా తమతమ శక్తిని బట్టి వాయనంతో చీర, రవికెలను కూడా సమర్పించుకొనవచ్చును. ఈ ఉండ్రాళ్ళ తద్ది నోమును ఐదు సంవత్సరాలు ఆచరించిన తర్వాత నోముకు వచ్చిన వారందరికి పాదాలకు పసుపు-పారాణి రాసి నమస్కరించి, వారి ఆశీస్సులు పొంది, అక్షతలను వేయించుకోవాలి. ఈ ఉండ్రాళ్ళ తద్ది నోమును ముఖ్యంగా పెళ్ళికాని కన్యలు ఆచరించడంవలన విశేషమైన ఫలితాలను పొందుతారని, మంచి భర్త లభిస్తాడని పురాణోక్తి.