Read more!

పంచాంగ శ్రవణం వల్ల కలిగే శుభఫలితాలు

 

 

పంచాంగ శ్రవణం వల్ల కలిగే శుభఫలితాలు

 


ఉగాది రోజున విధిగా పంచాంగశ్రవణం చేయాలి. పంచాంగశ్రవణం సాధారణంగా దేవాలయాలలో జరుగుతుంది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణమూలానే ఐదు అంగాలను వివిరించేదే పంచాంగం. పంచాంగశ్రవణ సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి. పంచాంగకర్త నవనాయకులు, ఉపనాయకులు, వారికి ఆధిపత్యం వహించే గ్రహాలూ, వాటిద్వారా సంవత్సరంలో కలిగే ఫలితాలతో పాటు సంక్రాంతి పురుషుడి లక్షణాలు ఫలాలు, వివిధ నక్షత్రాలు, రాశులవారి రాశిఫలాలు, ఆదాయ, వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు, సవివరంగా తెలియజేస్తారు. దీనివల్ల ప్రతిమానవుడు ఆదాయాన్ని మించి, వ్యయం చేయకుండా తొందరపాటు చర్యలతో అవమానాలపాలు పడకుండా జగ్రత్తపడతాడు. అంతేకాదు గ్రహాల గమనాన్ని అర్థం చేసుకుని, వాటికి తగినవిధంగా జీవనగమనాన్ని మార్చుకుంటూ, అభివృద్ధిని సాధిస్తాడు.

"తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్థనమ్
నక్షత్రార్థరతే పాపం యోగాద్రోహ నివారణమ్ |
కరణాత్కార్యసిద్ధిస్తు పంచాంగం ఫలముత్తమమ్
కాల విత్కర్మ కృద్దీమాన్ దేవతానుగ్రం లభేత్ ||


పంచాంగశ్రవణం చేసే సమయంలో "పంచాంగాలను" స్మరించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

- తిథి సంపదలను ప్రసాదిస్తుంది.
- వారం ఆయుష్షును పెంపొందిస్తుంది.
- నక్షత్రం పాపాలను తొలగిస్తుంది.
- యోగం వ్యాధులను పోగొడుతుంది.
- కరణం కార్యసిద్ధి కలుగ చేస్తుంది.

కాలం తెలిసి, కర్మచేసే మానవుడు సద్భుద్ది కలిగి భగవంతుని అనుగ్రహానికి పాత్రుడవుతాడు. పంచాంగశ్రవణం వల్ల గంగాస్నాన ఫలితం లభిస్తుంది.

"సూర్యః శౌర్య మధేందురింద్ర పదవీం సన్మంగళం మంగళ:
సద్భుధించ బుధో గురుశ్చ గురుతాం శుక్రస్సుభింశంశని:
రాహుర్బాహుబలం కరోతు సతతం కేతు: కులస్మోన్నతిం
నిత్యం ప్రీతికరా భవంతు భవతాం సర్వేకిలత్రగహాః ||


 

పంచాంగశ్రవణం చేసినవారికి, విన్నవారికి...
- సూర్యుడివల్ల శౌర్యము, తేజస్సు,
- చంద్రునివల్ల వైభవం.
- అంగారకునివల్ల సర్వమంగళములు,
- బుధునివల్ల బుద్ధి వికాసము,
- గురునివల్ల గురుకృప, జ్ఞానము,
- శుక్రునివల్ల సుఖములు,
- శనివల్ల దుఃఖరాహిత్యము,
- రాహువువల్ల బాహుబలము,
- కేతువువల్ల కులవృద్ధి కలుగుతాయని శాస్త్రప్రమాణం.

కనుక శాస్త్రబద్ధంగా ఉగాది పండుగను ఆచరిద్దాం, నవగ్రహాల ఆశీస్సులందుకుందాం. నిన్నటిదాకా చేసిన తప్పులను, పొరపాట్లను పరిహరించుకుని ఈ ఉగాదినుంచి ఆశాదృక్పధంతో నూతన జీవనపథంలో పయనిస్తూ భవితపై కొత్త కాంక్షలతో "జయ''నామ సంవత్సరాన్ని జయప్రదంగా మలుచుకోవాలని ఆకాంక్షిద్దాం. శ్రీ మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ....

---స్వస్తి ---

-యం.వి.ఎస్. సుబ్రహ్మణ్యం