Read more!

ఉగాది రోజున పంచాంగం ఎందుకు వినాలి!

 

 

 

 

 

ఉగాది రోజున పంచాంగం ఎందుకు వినాలి?

 

 

 

ఉగాది రోజున వేపపచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగశ్రవణం కూడా అంతే ముఖ్యం అంటారు పెద్దలు. ఏడాదిలో ఎప్పుడో జరగబోయే విషయాల గురించి పనిగట్టుకుని వినడం ఎందుకు? అందరూ ఒకచోట కూడి పంచాంగాన్ని వినాల్సిన అవసరం ఏమిటి? అంటే జవాబులు ఇవిగో...

 

ప్రాచీన భారతీయుల ఖగోళ విజ్ఞానమే నేటి పంచాంగానికి పునాది అని చరిత్రకారుల విశ్లేషణ. మనకి తెలిసిన ఖగోళ శాస్త్రం ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నయో లెక్క వేసి, వాటి ప్రకారం ఫలితాలను అంచనా వేయడమే పంచాంగం. పంచాంగంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణములనే అయిదు భాగాలు ఉంటాయి. అందుకనే దీనికి పంచాంగం అని పేరు. తిథి విషయంలో జాగ్రత్త పడితే సంపద, వారం వల్ల ఆయుష్షు, నక్షత్రం వల్ల పాప పరిహారం, యోగం వల్ల ఆరోగ్యం, కరణం వల్ల విజయం ప్రాప్తిస్తాయని అంటారు.

 

పంచాంగం ప్రకారం వ్యవసాయానికీ, వర్షానికీ, రాజ్యానికీ... ఇలా ప్రతి విభాగానికీ ఓ అధిపతి ఉంటాడు. ఇలా తొమ్మిదిమంది నాయకులను నవనాయకులు అని పిలుస్తారు. వీరి సంచారం వల్ల రాబోయే రోజులలో వ్యవసాయం ఎలా ఉంటుంది, దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహిస్తారు. నవనాయకుల సంగతి అలా ఉంచితే... ఒకో మాసానికీ అధిపతిగా ఉండే గ్రహం వల్ల కూడా అనూహ్య ఫలితాలు ఉండవచ్చు.

 

ఇక పంచాంగంలో వ్యక్తిగత రాశిఫలాలు ప్రత్యేకత చెప్పేదేముంది. ఒకో మనిషి నక్షత్రం ప్రకారం అతని ఆదాయవ్యయాలు, రాజపూజ్య అవమానాలూ లెక్క కడతారు. దీని వల్ల మనుషులలో ఆదాయాన్ని మించి ఖర్చు చేయకూడదనీ, అనువు కానీ చోట అధికులమని అవమానం పాలు కాకూడదనీ జాగ్రత్త ఏర్పడుతుంది. ధార్మికులకు పంచాంగం ఇంత ఉపయుక్తం కాబట్టే... సంవత్సరపు తొలిరోజున పంచాంగ శ్రవణం చేసి తీరాలంటారు పెద్దలు.

 

ఇప్పుడంటే పంచాంగాలు ఇంటింటా కనిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు కేవలం కొద్దిమంది పురోహితులకే ఇవి అందుబాటులో ఉండేవి. కాబట్టి ఉగాది రోజున వారి నుంచి రాబోయే సంవత్సరపు విశేషాలు తెలుసుకునేందుకు అంతా ఒకచోటకి చేరేవారు.  దీని వల్ల పంచాంగ శ్రవణం నలుగురూ కలుసుకుని కష్టసుఖాలను కలబోసుకునే సందర్భంగా కూడా మారుతుంది. పైగా పంచాంగంలో సామాన్యులకి అర్థం కాని విషయాలు అనేకం ఉండవచ్చు. వాటన్నింటినీ నివృత్తి చేసుకునేందుకు ఈ పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. ధార్మికపరమైన సందేహాలను తీర్చుకునేందుకు కూడా పంచాంగ శ్రవణం అవసరం. అధికమాసంలో శుభకార్యాలు చేసుకోవచ్చా? గ్రహస్థితి బాగోలేకపోతే ఏం చేయాలి? నోములు ఎప్పుడు జరుపుకోవాలి? వ్రతం ఎలా చేసుకోవాలి?... వంటి సవాలక్ష సందేహాలన్నింటికీ ఊరూరా పంచాంగ శ్రవణం వేదికగా మారుతుంది. అందుకనే పంచాంగ శ్రవణ చేసినవారికీ, విన్నవారికీ కూడా నవగ్రహాల ఆశీస్సులు లభిస్తాయని ఫలశ్రుతిగా చెబుతారు.

 

- నిర్జర.