Read more!

శోభకృత నామ సంవత్సరం.. సకల శుభాల సమ్మేళనం!

 

శోభకృత నామ సంవత్సరం.. సకల శుభాల సమ్మేళనం!

జయానికి ప్రతిఫలం సుఖం. సుఖం శాంతిని ప్రసాదించాలి. శుభసూచకం కావాలి. అంటే ఆధ్యాత్మిక అనుభూతిని అందించే సుఖమే అందరూ ఆశించవలసిన సుఖం. ధర్మమార్గంలో పొందిన జయమే జయం. గడచిన శుభకృత నామ సంవత్సరం ప్రజావళికి చేదుతీపిల కలయికగా సాగింది. ఇది శోభకృత నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గతంలోకి నిష్క్రమించింది. ఈ శోభకృత నామ సంవత్సరం అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపుతుందని అంటున్నారు..

సృష్టి నిరంతరం సాగే చక్రభ్రమణం. అది విశాల విశ్వ విశ్వాంతరాళాల స్థితి, గతుల సమన్వయ రూపం. పరమాణువు నుంచి మహా మహత్ వరకు గల దివ్య సూత్రంలో ఇమిడి కాలంతో కదిలిపోతున్న ఒక గుళిక ఉగాది.

భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ వేదాంతపరమైనదే. అవి ఏవో సరదాల కోసం చేసుకునే సంబరాలు కావు. అలాగే ఉగాది కూడా. మనం ఖగోళ శాస్త్ర పరంగా గణించే యుగాలూ, శకాలూ, సంవత్సరాలూ, ఋతువులూ, మాసాలూ, పక్షాలూ, ఘడియలూ, విఘడియలూ అన్నీ కాలంతో నిత్యం పరిభ్రమించే సంవత్సర చక్రాలు. ఒక్కొక్క చక్రంలోనూ ఉండే పన్నెండు ఆకులు పన్నెండు నెలలు. అణువులో ఏవిధంగా 360 డిగ్రీలున్నాయో అలాగే బ్రహ్మాండంలో కూడా 360 డిగ్రీలే ఉండడం ఖగోళ విశేషం. కనుకనే కాలచక్రం ఆద్యంతాలు కనపడని మహా ప్రవాహం.

వైదిక కాల మానంలో సంవత్సరం ఒక అద్భుత ప్రమాణం. సంవత్సరాలు 60. మొదటి సంవత్సరం మళ్ళీ ప్రభవించిన 'ప్రభవ'. చివరి సంవత్సరం క్షయం లేని 'అక్షయ'. అంటే ఒక పరిభ్రమణం పూర్తి చేసుకుని చివరి అంకంలోకి వచ్చి, తిరిగి ప్రభవకు స్వాగతం పలికే ఆఖరి సంవత్సరం.

ఇందులో శోభకృత్ నామ సంవత్సరం ప్రస్తుతం జరుపుకోబోయే సంవత్సరం. ఇది తెలుగు సంవత్సరాలలో 37వది.  చెట్లు కొత్త చిగుళ్ళు తొడిగి పూవులు, కాయలతో శోభాయమానం కావడానికి దోహదం చేస్తుంది. శోభకృత అంటే శోభను కలుగజేసేది అని అర్థం. శోభ అంటే అందాన్ని, సంతోషాన్ని కలిగించేదన్నమాట. పంటలు, తోటలు అద్భుతమైన పంట దిగుబడులతో కలకళలాడుతాయి. ఎన్నో సమస్యలను తొలగించి అందరికీ మంచి చేసేది ఈ శోభకృత నామ సంవత్సరమని అంటున్నారు. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ శోభకృత నామ సంవత్సరం అందరి జీవితాల్లో  వెలుగులు నింపుతుందని ఆశిద్దాం. సత్కార్యాలు చేస్తూ సత్సాంగత్యాన్ని వృద్ధి చేసుకుంటే సుఖశాంతులు లభించి సమాజం నందనవనం కాగలదు.

                                   ◆నిశ్శబ్ద.