Read more!

ఇవన్నీ ఉగాది పండుగలే!

 

ఇవన్నీ ఉగాది పండుగలే!

 

చైత్ర మాసంతో మొదలయ్యే కొత్త సంవత్సరాన్ని తెలుగువారు ఉగాది పేరుతో ఘనంగా ఆచరించడం తెలిసిందే! మరి మనకి ఉగాది ఉన్నట్లే మిగతా రాష్ట్రాలవారికి కూడా వేర్వేరు సంవత్సరాదులు ఉండవచ్చు కదా! వాటి గురించి తెలుసుకోవడం కూడా ఆసక్తిగానే ఉంటుంది.

 

గుడిపడ్వా - తెలుగువారిలాగానే మహారాష్ట్రీయుల సంవత్సరం కూడా చైత్రశుద్ధ పాడ్యమినాడే మొదలవుతుంది. కాకపోతే ఈ పండుగను వారు గుడిపడ్వ అని పిలుచుకుంటారు. ఈ రోజున వారు ఇంటి ముందర ఒక వెదురు కర్రను నిలిపి, దానికి జరీ వస్త్రాన్ని చుడతారు. ఆ వస్త్రం మీద దండలూ, ఆకులూ వేలాడదీసి ఒక రాగి చెంబుని బోర్లిస్తారు. దీనిని గుడి అని పిలుస్తారు. బ్రహ్మ ఈ రోజునే సృష్టిని ఆరంభించాడని వారి నమ్మకం. అలా పాడ్యమి రోజున గుడిని నెలకొల్పే ఈ సంప్రదాయమే గుడిపడ్వాగా మారింది.

 

వైశాఖి - సిక్కులు కూడా చైత్రమాసంతోనే వైశాఖి పేరుతో సంవత్సరాన్ని ఆరంభిస్తారు. కాకపోతే వీరి లెక్క సౌరమానం ప్రకారం ఉంటుంది కాబట్టి... యేటా ఏప్రిల్ 13 లేదా 14వ తేదీని వైశాఖి పండుగ వస్తుంది. ఈ రోజున సిక్కు మతాన్ని బలోపేతం చేసిన ఖల్సా అనే సంప్రదాయం కూడా మొదలైన రోజు. కాబట్టి అటు సంవత్సరాదినీ ఇటు ఖల్సానీ గుర్తుచేసుకుంటూ వారి వేడుకలు సాగుతాయి.

 

పుత్తాండు - తమిళురు సైతం ఏప్రిల్ 13 లేదా 14 తేదీల్లో సంవత్సరాదిని ఆచరిస్తారు. ఈ పండుగని వారు పుత్తాండుగా పిలుస్తారు. వేపపూత, మామిడికాయలు, బెల్లంతో మన ఉగాది పచ్చడిలాంటి ప్రసాదాన్ని చేసుకుంటారు. తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలలో ఈరోజు రథోత్సవాన్ని నిర్వహిస్తారు.

 

బిహు - కొత్త సంవత్సరం గురించి చెప్పుకోవాలంటే అసోం ప్రజలు చేసుకునే బిహు పండుగని తల్చుకోవాల్సిందే! వీరికి బిహు కేవలం సంవత్సరాదే కాదు... వ్యవసాయాన్ని ఆరంభించే పండుగ కూడా! నాట్లు వేయడం, సంప్రదాయ నృత్యాలు చేయడం, గోమాతని పూజించడం లాంటి పనులతో మూడు రోజులపాటు బిహుని ఘనంగా జరుపుకొంటారు. ఒక రకంగా చెప్పాలంటే అసోం బిహు అచ్చు మన సంక్రాంతిలాగానే సాగుతుంది.

 

విషు - కేరళలోని కొత్త సంవత్సరం కూడా వైశాఖి రోజునే వస్తుంది. కాకపోతే వారు ఈ పండుగను విషుగా పిల్చుకుంటారు. ఈ రోజునే సూర్యుడు తూర్పు నుంచి ఉదయించడం ప్రారంభించాడని వారి నమ్మకం. ఈ రోజు ఉదయాన్నే శుభమైన పదార్థాలు చూస్తే సంవత్సరమంతా శుభం జరుగుతుందని వారి నమ్మకం. అందుకోసం విషు ముందు రాత్రి పూజాగదిని పూలు, పండ్లతో అద్భుతంగా అలంకరిస్తారు. ఇలా అలంకరించడాన్ని విషుకని అని పిలుస్తారు. అలాగే విషుసద్య పేరుతో కొబ్బరిపాలతో చేసిన వంటకం చేసుకుంటారు. విషుపడక్కం పేరుతో మందుగుండు కాలుస్తారు.

ఇవే కాకుండా చేతీచాడ్, మాఘి, తప్నా, నవరేహ్ అంటూ రకరకాల పేర్లతో దేశవ్యాప్తంగా నూతన సంవత్సరాన్ని ఆరంభిస్తారు. ఒకే దేశంలో ఇన్ని భిన్నమైన ఆచారాలు కనిపించడం ఆశ్చర్యం కదా!!!

- నిర్జర.