Read more!

రేపే తొలి ఏకాదశి-మరి ఏం చేయాలి!

 

రేపే తొలి ఏకాదశి-మరి ఏం చేయాలి!

 

 

ఆషాఢం వస్తోందనగానే హిందువులంతా తొలి ఏకాదశి కోసమే ఎదురుచూస్తారు. మన పండుగలన్నీ అప్పటి నుంచీ మొదలవుతాయి కాబట్టి, ఆ రోజుని తొలి పండుగగా భావిస్తారు. అదే రోజున విష్ణుమూర్తి యోగనిద్రలోకి జారుకుంటాడని ఓ నమ్మకం. నాలుగు మాసాల తర్వాత తిరిగి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశినాడు ఆయన నిదుర లేస్తాడట. అందుకని శయనించే రోజుని శయన ఏకాదశి అనీ, మేల్కొనే రోజుని ఉత్థాన ఏకాదశి అనీ పిలుస్తారు. ఈ నాలుగు మాసాలలోనూ కఠోర ఆహార విహార నిష్ఠలతో కూడిన చాతుర్మాస వ్రతాన్ని కూడా ఆచరిస్తుంటారు. ఇంతకీ ఈ తొలి ఏకాదశి రోజున ఆచరించాల్సిన విధులు ఏమిటి అంటే...

ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలనుకునేవారు అంతకు ముందురోజైన దశమినాటి రాత్రి నుంచే నిరాహారంగా ఉండాలట. మన జీర్ణవ్యవస్థని ఏకాదశి ఉపవాసానికి సిద్ధం చేయడమే ఈ ఆచారం వెనుక అర్థంగా తోస్తుంది. ఇక ఏకాదశినాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉండటమే కాకుండా, విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గడపాలి. తులసీదళాలతో ఆయనను పూజించి విష్ణుసహస్రనామం, నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆరాధించాలి.

కడుపు నిండిన మనిషి ద్యాస వేర్వేరు విధాలుగా పోతుంది. ఉప‌వాసం ఉండ‌టం ద్వారా మనసు నిశ్చలంగా మారిపోతుంది. అలా నిశ్చలంగా ఉన్న మనసుని భగవంతుని మీద నిలిపితే, ఆ ఫలితమే వేరు. ఇలా స్థిరంగా ఉన్న మనసుని మరింత జాగృతం చేసేందుకు ఏకాదశి రాత్రిపూట జాగారం చేయమని చెబుతారు. ఆ జాగరణలో రాత్రి సాగేకొద్దీ మనసు అలసిపోతుంది. అలా అలసిన మనసుకి సాయంగా భగవన్నామాన్ని జపం చేస్తూ ఉంటే, ఆ నామం మీదే మనసు నిశ్చలమవుతుంది. ఇలా మనసునీ, శరీరాన్ని శుష్కింపచేస్తూ సాగే ఉపవాసమే సత్ఫలితాలను ఇస్తుంది. ఈ ఉపవాసజాగరణలతో ఏకాదశిని గడిపిన తర్వాత మర్నాడు తెల్లవారుఝామున దగ్గర‌లోని ఆల‌యాల‌ను సంద‌ర్శించాలి.

 ఏకాదశినాటి ఉపవాసంతో జీర్ణవ్యవస్థ కుంటుపడుతుంది కాబట్టి.... ఒక్కసారిగా దానికి ఆహారాన్ని అందించడం అంత మంచిది కాదు. అందుకని ద్వాదశి రోజున కూడా అతిగా భుజించకూడదు అని హెచ్చరిస్తుంటారు. తొలి ఏకాదశి అనగానే గుర్తుకువచ్చే మరో రెండు విషయాలు కూడా ఉన్నాయి. అదే పేలాలపిండిని తినడం, గోపూజ చేయడం. తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటున్నప్పటికీ, దేవుని ప్రసాదంగా భావించి కాస్త పేలాలపిండిని స్వీకరించడంలో తప్పులేదు. పైగా పేలాలపిండితో శరీరంలోని చక్కెర నిల్వలు ఒక్కసారిగా పడిపోకుండా ఉంటాయి. అంతేకాదు! వర్షాకాలంలో వచ్చే మార్పులకు శరీరాన్ని సన్నద్ధంగా ఉంచడమే ఈ పేలాలపిండి ఆచారం వెనుక ఉన్న కారణంగా చెబుతారు. తొలిఏకాదశి రోజున ముక్కోటి దేవతల స్వరూపంగా భావించే గోమాతను కూడా పూజించాలన్నది పెద్దల మాట. దగ్గరలోని గోశలలో ముగ్గువేసి, అందులో లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచి పూజిస్తారు. గోశాలలోని ఆవులను సైతం పసుపు, కుంకుమలతో అర్చించి వాటిని భక్తితో కొలుస్తారు.

- నిర్జర.