Read more!

ఉగాది రోజున చేసి తీరాల్సిన పనులు!

 

ఉగాది రోజున చేసి తీరాల్సిన పనులు!

 

ఉగాది ఓ కొత్త జీవితానికి సూచన. ఈ సృష్టి యావత్తు ఉగాదినాడే ప్రారంభం అయ్యిందన్నది పెద్దల నమ్మకం. ఆ నమ్మకానికి ఆలంబనగా… ఈ రోజే వసంతకాలం మొదలవుతుంది. అప్పటివరకూ ఆకురాలుతో ఎండిపోయిన ప్రకృతి కొత్తగా చిగురించడం మొదలుపెడుతుంది. కాలానికి అనుగుణంగా సాగే మన జీవితాలకు కచ్చితంగా ఉగాది పెద్ద పండుగే. అందుకే ఆ మార్పును స్వాగతిస్తూ, కొత్త జీవితానికి సిద్ధపడుతూ కొన్ని సంప్రదాయాలను పాటిస్తున్నాం. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవి….

తైలాభ్యంగనస్నానం- ఉగాదినాడు నువ్వుల నూనెతో స్నానం చేయకపోతే నరకానికి వెళ్తారని హెచ్చరిస్తుంటారు పెద్దలు. ఈ మాటల వెనుక కారణం లేకపోలేదు. సంవత్సరంలో కొన్ని సందర్భాల్లో అయినా నువ్వులనూనెని దట్టించి, శరీరాన్ని మర్దనా చేసి, శనగపిండితో శుభ్రం చేసుకోవాల్సిందే. ఈ చర్యతో ఒంటికి పట్టిన మకిలి వదిలిపోతుంది. అంతేకాదు! రుతువు మారే ఉగాది సమయంలో కఫ సంబంధమైన వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. నువ్వుల నూనెతో మర్దనా చేయడం వల్ల, ఒంట్లో వేడి పెరిగి ఈ సమస్యలు తీరిపోతాయని చెబుతారు.

నింబకుసుమ భక్షణం- అంటే మరేమీ లేదు. వేప పూతతో చేసిన పచ్చడిని తినడం. సంప్రదాయ వైద్యంలో వేప చెట్టులోని ప్రతి భాగాన్నీ ఉపయోగిస్తారు. అయితే నేరుగా దీన్ని సేవించే అవకాశం వసంత రుతువులోనే వస్తుంది. పైగా ఈ సమయంలో చికెన్ పాక్స్ లాంటి వైరల్ వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ రోజున వేప, మామిడి, అశోక చిగుళ్లు కలిపిన ప్రసాదాన్ని తినాలని చెప్పారు పెద్దలు. వీటిలో వేప ఇప్పటికీ మన సంప్రదాయంలో సజీవంగా ఉంది.

పంచాంగ శ్రవణం- ఇప్పుడంటే వర్షాల గురించీ, ఉష్ణోగ్రతల గురించీ కచ్చితంగా తెలుసుకునే సౌలభ్యం ఉంది. కానీ ఒకప్పుడు గ్రహగతుల ఆధారంగానే రాబోయే కాలం ఎలా ఉంటుందో అంచనా వేసేవారు. వ్యవసాయమే కీలకమైన నాటి జీవనంలో.. ఈ సూచనలు చాలా ప్రభావం చూపించేవి. ఇక వ్యక్తిగతంగా ఏ రాశివారి జాతకం ఎలా ఉండే అవకాశం ఉందనే అంచనాలు కూడా పంచాంగ శ్రవణంలో వినిపించేవి. వీటిని ఎంతవరకూ నమ్ముతారు అన్న మాటను అలా ఉంచితే… కష్టాలకు సిద్ధపడటం, సుఖాలకు పొంగిపోకుండా ఉండటానికి మనసును నిబ్బరంగా ఉంచే ప్రయత్నమే పంచాంగ శ్రవణం.

సాయం- ఉగాది నాడు ప్రపాదానం (చలివేంద్రం) పెట్టడం పుణ్యం అని చెబుతారు పెద్దలు. ఆ స్తోమత, అవకాశం అందరికీ ఉండకపోవచ్చు కాబట్టి కనీసం ఉదకుంభం (కుండతో నీళ్లు) దానం చేయమని సూచిస్తున్నారు. అలాగే ఉగాది సందర్భంగా చెప్పులు, గొడుగు అందించినా పుణ్యమే అని చెబుతున్నారు. ఎండల చురుకు పెరిగే ఈ వేళలో… ఇలాంటి సాయం ఎంత ఉపయోగమో కదా!

- నిర్జర