Read more!

సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతమే షష్టి రహాస్యం!!

 

సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతమే షష్టి రహాస్యం!!

 

తారకాసురుడు లోకాలను అతలాకుతలం చేస్తుంటే దేవతలు అందరూ విష్ణువు దగ్గరకు వెళ్లి ప్రార్థించారు. శివుడికి పుట్టే సంతానమే తారకాసురుడి చావుకు కారణం అవుతుందని అన్నాడు. సతీదేవి చనిపోయి వైరాగ్యంలో ఉన్న శివుడికి మళ్ళీ పెళ్లి చేయాలి, మరోవైపు సతీదేవి పార్వతిగా జన్మించి శివుడి కోసం తపస్సు చేయసాగింది. అంతా తెలుసుకున్న దేవతలకు ఎన్నో కష్టాలుపడి శివపార్వతులకు పెళ్లి చేశారు. వాళ్ళ సంతానం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే శివపార్వతులు ఏకాంతంగా ఉన్నపుడు దేవతలు అందరూ పరమేశ్వరుడి ఇంటి ముందు నిలబడి పెద్దపెట్టున ప్రార్థిస్తూ పిలిచారు. పార్వతితో శృంగారంలో ఉన్న శివుడు మధ్యలో అక్కడి నుండి  బయటకు వెళ్ళాడు. అప్పుడే శివుడి వీర్యం అక్కడే ఉన్న హోమగుండంలో పడింది. అగ్ని ఆ వీర్యాన్ని స్వాహా చేసాడు. అగ్ని భుజించింది దేవతలందరికీ సమానంగా చెందుతుంది, సరిగ్గా అదే అయ్యింది. ఒక్క అగ్నిహోత్రుడు ఆ శివ వీర్యాన్ని భక్షించినందువల్ల దేవతలందరూ కూడా భక్షకులే అయ్యారు. దానిసారం వాళ్ళందరి కడుపులోకి చేరిపోయింది. ఆ కారణంగా - వాళ్ళంతా గర్భం ధరించారు. ఈ హఠాత్సంఘటనకు బెంబేలు పడిపోయారు.

మళ్ళా మహేశ్వరుడిని గురించి ప్రార్థించారు, మహేశ్వరుడు బయటకు వచ్చాడు. తమ కష్టం చెప్పారు దేవతలు. అందరినీ వాంతి చేసుకోమని సలహా ఇచ్చాడు శివుడు. శివుడు చెప్పినట్టే చేశారు. వాళ్లకు సమస్య తప్పింది. కానీ మరోవైపు అగ్ని మాత్రం కావాలనే వీర్యాన్ని స్వాహా చేసినందుకు అతనికి వాంతి చేసుకోవడం సాధ్యం కాలేదు. ఏడుపు ముఖం పెట్టి చూసాడు శివుడి వైపు. శివుడు నారదుణ్ణి చూశాడు. అప్పుడు నారదుడు "అగ్ని హోత్రా! శీతాకాలం వేకువజాములో చన్నీటి స్నానంచేసే ఆడవాళ్లకు నీయందున్న శివుడి వీర్యాన్ని  అందించు" అని సలహా యిచ్చాడు. ఆ ప్రయత్నంలో పడ్డాడు అగ్ని

సప్త ఋషుల భార్యలు, ఉదయాన్నే చన్నీటి స్నానం చేసేవారు. ఎప్పటిలాగే ఒకరోజు  స్నానం చేస్తుండగా ఆ రోజు గంగలో విపరీతమైన చలి పుట్టింది. చలి కాచుకోవాలని అగ్ని వెలిగించారు. అరుంధతి వాళ్ళతో అగ్నిని వెలిగించవద్దని చెప్పినా వాళ్ళు వినలేదు. అరుంధతిని తిరస్కరించి మహిళామణులంతా మంట పెట్టు కుని చలికాచుకోసాగారు. అదే సమయమనుకున్న అగ్ని - తన వేడి ద్వారా

ఆ ఆరుగురు మహర్షి స్త్రీలలోకి తన వంట్లో వున్న వేడిని దింపేసుకుని 'అమ్మయ్య' అనుకున్నాడు. శివుడి వీర్యం అలా వేడి రూపంలో ఆ ఆరుమంది మహర్షుల భార్యల శరీరాల్లోకి వెళ్లిపోయాయి. లోపల పడడమే ఆలస్యంగా గర్భవతులయ్యారు ఆ కృత్తికలు, ఋషులు వాళ్ళని అనుమానించి ఇళ్ల నుంచి తరిమేశారు.

భర్తలకు దూరంగా వుంటూ, శివతేజాన్ని భరించలేక - దానిని హిమత్పర్వతాల లోని కైలాస, శిఖరాన వదిలేశారు ఆ కృత్తికలు. హిమవంతుడు ఆ మహా తాపాన్ని తట్టుకోలేక గాలిని సహాయం కోరాడు. గాలిదేవుడు అతి కష్టం మీద యెత్తుకు వెళ్ళి గంగ కడుపులో పడేశాడు. చల్లని తల్లి గంగమ్మ, కాని శివ వీర్యధారణంతో ఆమెకు కూడా వేడి ఎక్కిపోయింది. తన కెరటాలతో దానిని తీరానికి లాక్కుపోయి   రెల్లు పొదల నడుమకు చేర్చింది. అలా ఆరు స్థానాలలోనూ పరిపక్వమైన శివ వీర్యం మార్గశిర శుద్ధషష్ఠి తిథినాడు కుమారుడిగా పరిణమించింది. 

ఇదీ కుమారస్వామి జననం కథ. ఆరుమంది కృత్తికలు మోశారు కాబట్టి ఈయన షణ్ముఖుడు అయ్యాడు. సుబ్రహ్మణ్య స్వామి షష్టి నాడు పుట్టాడు. ఆరోజు ఆయన్ని పూజిస్తే ఎన్నో రకాల సమస్యలు తీరుతాయి.

ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం చూస్తే పెళ్లవుతుందని నమ్మకం. సర్పదోషం ఉన్నవాళ్లకు సుబ్రమణ్య స్వామిని పూజిస్తే, సర్పదోష పూజలు చేయించుకుంటే సమస్యలు తీరుతాయి. 

◆ వెంకటేష్ పువ్వాడ