Read more!

Satyaharischandra only Truth

 

ప్రాణం పోయినా అబద్ధమాడని

సత్యహరిశ్చంద్రుడు

Satyaharischandra only Truth

 

సత్యహరిశ్చంద్రుడి పేరు వినని వాళ్ళు దాదాపుగా ఉండరు. "అబద్ధం చెప్పావేంటి?" అంటే "నేనేం సత్యహరిశ్చంద్రుడిని కాను" అనడం, "ఎట్టి పరిస్థితిలో నిజమే చెప్తాను" అంటే "అబ్బో, సత్యహరిశ్చంద్రుడు కాబోలు" అనడం మామూలే. చాలాసార్లు సత్యహరిశ్చంద్రుడు మనకు ఆదర్శం. ఒక్కోసారి ఆయన పేరు చెప్పి నవ్వుకుంటాం కూడా. ఇంత ప్రాముఖ్యం ఉన్న సత్యహరిశ్చంద్రుడి కథా కమామీషు ఏమిటో తెలుసుకుందాం.

 

సత్యహరిశ్చంద్రుడు సూర్యవంశపు రాజు. ఆయన నిజమే చెప్తాడు అని అందరూ గొప్పగా చెప్పుకుంటారు. దాంతో విశ్వామిత్ర మహర్షికి సత్యహరిశ్చంద్రుని పర్రిక్షించాలి అనిపించింది. వెంటనే వచ్చి తనకు ధనం కావాలని అడిగాడు. హరిశ్చంద్రుడు వెంటనే, ఎంత కావాలంటే అంత తీసుకువెళ్ళమన్నాడు. కానీ విశ్వామిత్రుడు "ఇప్పుడు కాదు, తర్వాత తీసుకుంటాను" అని చెప్పి వెళ్ళాడు.

 

కొన్నాళ్ళకు విశ్వామిత్రుడు తిరిగివచ్చి, తాను సృష్టించిన మాతంగ కన్యలను పెళ్ళి చేసుకోమన్నాడు.

 

హరిశ్చంద్రుడు తాను ఏకపత్నీవ్రతుడినని, కనుక మరో పెళ్ళి చేసుకునే ప్రశ్నే లేదని, రాజ్యం పోయినా పరవాలేదు, ఏకపత్నీవ్రతం తప్పను" అన్నాడు.

 

విశ్వామిత్రుడు "సరే, అయితే రాజ్యం వదిలి వెళ్ళు" అన్నాడు.

 

హరిశ్చంద్రుడు క్షణం కూడా ఆలోచించకుండా, భార్య చంద్రమతి, కొడుకు లోహితాస్యులను వెంటబెట్టుకుని అడవులకు వెళ్ళడానికి తయారవగా "రాజా, నువ్వు నాకు ఇస్తానన్న డబ్బు ఇచ్చి వెళ్ళు" అన్నాడు. అప్పటికే హరిశ్చంద్రుడు రాజ్యాన్ని ఇచ్చేశాడు గనుక ఇక ఆ ధనం తనది కాదు. కనుక "నేనిప్పుడు కట్టు బట్టలతో ఉన్నాను కనుక, ఒక నెల గడువు ఇస్తే, ఆ ధనం తెచ్చిస్తాను" అన్నాడు. విశ్వామిత్రుడు అందుకు ఒప్పుకుని, నక్షత్రకుని వెంట పంపాడు.

 

అప్పటిదాకా మహారాజు అయిన హరిశ్చంద్రుడికి రాజ్యపాలనే తప్ప ఇతర పనులు చేతకావు. తిండితిప్పలు గడవడం కూడా కష్టమైంది. ఎన్నడూ రాజమహలు దాటి బయట కాలు పెట్టని చంద్రమతి అడవుల పాలై నానా కష్టాలూ పడుతోంది. పైగా చిన్నవాడైన లోహితాస్యునికీ కష్టాలు తప్పలేదు. ఇవి చాలక కూర్చున్నా, పడుకున్నా వేధించే విశ్వామిత్రుడి శిష్యుడు నక్షత్రకుడు.

 

హరిశ్చంద్రుడు నానా అగచాట్లూ పడుతూ అడవుల్లో నడుస్తున్నాడు. ఇంతలో అడవిలో మంటలు రేగాయి. బాధాతప్త హృదయంతో ఉన్న చంద్రమతికి విరక్తి వచ్చింది. ఆ మంటల్లో దూకి ఆత్మాహుతి చేసుకోబోయింది.ఆ మహా సాత్వీమణిని దహించడం ఇష్టం లేక, మంటలు చల్లారాయి.

 

హరిశ్చంద్రుడు కాశీ విశ్వేశ్వరుని గుడికి దారితీశాడు. అందరూ దేవుని దర్శించుకున్నారు. అప్పు త్వరగా తీరిస్తే, తాను వెళ్తానని నక్షత్రకుడు పీడిస్తున్నాడు. దీన్ని ఆధారంగా చేసుకునే ఎవరైనా ఒక విషయం గురించి పదేపదే నసుగుతుంటే, "నక్షత్రకుడిలా వేధించుకు తింటున్నావు" అంటారు. "పోనీ, అప్పు తీర్చలేవా? ఆ మాట చెప్పు, నేను వెళ్ళిపోతాను" అంటాడు నక్షత్రకుడు. విశ్వామిత్రుడి ధ్యేయమే అది. సత్యనిష్ఠ తప్పించడం.

 

అదంతా చూసిన చంద్రమతికి మనసు ద్రవించింది. "రాజా. నన్ను అమ్మేసి, ఆ ధనంతో ఋణ విముక్తి చేసుకో" అంది.

 

హరిశ్చంద్రుడికి భార్య సహకారం ఊపిరినిచ్చింది. భార్య కంటే, సత్య వ్రతమే ముఖ్యం అనిపించింది. కాలకౌశికుడు అనే బ్రాహ్మణునికి చంద్రమతిని అమ్మి, ఆ ధనాన్ని విశ్వామిత్ర మహర్షికి ఇమ్మన్నాడు హరిశ్చంద్రుడు.

 

కానీ, అంతటితో కథ పూర్తి కాలేదు. నక్షత్రకుడు ఆ ధనం తన దారి ఖర్చుకే సరిపోతుందని, గురువుగారికి ఏమివ్వాలని అడిగాడు. హరిశ్చంద్రుడు నివ్వేరపోయినా, వెంటనే తేరుకున్నాడు. కర్తవ్యం ఆలోచించాడు. దగ్గర్లో ఉన్న వీరబాహువు అనే కాటి కాపరికి తనను తాను అమ్ముకుని, ఆ ధనాన్ని నక్షత్రకునికి ఇచ్చి పంపాడు.

 

అక్కడికీ హరిశ్చంద్రుడి కష్టం తీరలేదు. చంద్రమతిని, కాలకౌశికుని భార్య కాలకంటకి, ఆమెను సాధింపులతో, వేధింపులతో బాధ పెడుతోంది. ఇంతలో లోహితాస్యుడు పాము కరిచి, చనిపోయాడు. కొడుకు మరణించాడనే పిడుగువార్తను జీర్ణించుకోలేకపోయింది. చంద్రమతి కొడుకు శవాన్ని భుజాన వేసుకుని స్మశానానికి వెళ్ళింది.

 

చంద్రమతి దగ్గర కట్టెలు లేవు. సగం కాలిన కట్టేలతోనే కొడుకు మృతదేహానికి చితి పెర్చబోయింది. అది చూసిన కాటికాపరి ముందు కాటి సుంకం ఇవ్వమని అడిగాడు.

 

చంద్రమతి తన వద్ద డబ్బు లేదని, కొడుక్కు దహన సంస్కారం చేయడానికి ఒప్పుకోమని బతిమాలింది. అయితే, మంగళసూత్రం ఉంటే ఇవ్వమన్నాడు కాటికాపరి. చంద్రమతి, తన మంగళసూత్రం భర్తకు మాత్రమే కనిపిస్తుందని, ఇతరులకు కనిపించదని, అది వశిష్ట ముని వాక్కని చెప్పింది.

 

అప్పటికి అతనికి ఆమె ఎవరో అర్ధమైంది. ఆ కాటికాపరి ఎవరో కాదు, హరిశ్చంద్రుడే. ఇద్దరూ చలించిపోయారు. కొడుకును తల్చుకుని ఏడ్చారు.

 

ఇంతలో, "ఆమె హంతకి.. అందునా రాజ కుమారుని చంపింది.. శిరచ్చేదం చేయాలి" అంటూ రాజభటులు వచ్చారు.

 

హరిశ్చంద్రుడు దుఃఖసాగరంలో కూరుకుపోయి కూడా, కర్తవ్య నిర్వహణలో పడ్డాడు. చంద్రమతిని వధ్యశిల దగ్గరికి తీసికెళ్ళి, తలను ఖండించబోయాడు. అప్పుడు విశ్వామిత్రుడు వచ్చి, "ఒద్దు, రాజా, అలా చేయొద్దు" అన్నాడు.

 

"నేను ఇప్పుడు కాటికాపరిని మాత్రమే. భార్యాపిల్లలు అనే మమకారాలు తగవు" అన్నాడు.

 

దాంతో, విశ్వామిత్రుడు పరమేశ్వరుని ప్రార్ధించాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై లోహితాస్యుని బతికించాడు. భార్యాభర్తల సంతోషానికి అంతు లేకపోయింది. హరిశ్చంద్రునితో "నీ పేరు శాస్వతంగా నిలిచిపోతుంది" అని అంతర్ధానం అయ్యాడు మహాశివుడు.

 

"నీ సత్యనిష్ఠ సామాన్యమైంది కాదు, ఎన్ని విధాల పరీక్షించినా గెలిచావు.. నీకు అపారమైన కీర్తి వస్తుంది" అంటూ దీవించాడు విశ్వామిత్రుడు.


The Story of Satyaharischandra, Satyaharischandra speaks only truth, Satyaharischandra always truth, Satyaharischandra inspires to tell truth