జగన్నాథ ఆలయంలో మూడవ మెట్టు రహస్యం..!

 

జగన్నాథ ఆలయంలో మూడవ మెట్టు రహస్యం..!

 

జగన్నాథుడిని విష్ణువు అవతారంగా భావిస్తారు. ఆయన సోదరుడు బలభద్రుడు,  సోదరి సుభద్ర పూరీ క్షేత్రంలో పూజలు అందుకుంటారు. దేశవ్యాప్తంగా ఆయనకు అనేక ఆలయాలు ఉన్నాయి. కానీ పూరి (ఒడిశా) జగన్నాథ ఆలయం అత్యంత ప్రముఖమైనది, పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం నాలుగు ధామ్‌లలో ఒకటి.  ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలో ఇక్కడ ఒక గొప్ప రథయాత్ర జరుగుతుంది. భారతదేశం,  విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఈ ప్రయాణంలో పాల్గొంటారు. ఈ ఉత్సవంలో పాల్గొనడం వల్ల అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుందని,  విష్ణువు,  లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.

పూరి జగన్నాథ ఆలయం దాని మతపరమైన ప్రాముఖ్యతకు మాత్రమే కాకుండా, దానితో ముడిపడి ఉన్న అనేక రహస్యాలు కూడా ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. ఆలయ నిర్మాణం, దాని సంప్రదాయాలలో మూడవ మెట్టుపై పాదాలు పెట్టకూడదనే సంప్రదాయం కూడా ఒకటి.   ఈ నియమాల కారణంగా పూరీ క్షేత్రానికి ఒక రహస్య క్షేత్రంగా పేరు ఉంది.  అయితే ఆలయంలో పూరీ జగన్నాథుడి దర్మనం అనంతరం వచ్చే మెట్లలో మూడవ మెట్టు మీద  పాదం పెట్టుకూడదు అనే విషయం  యమధర్మరాజుతో సంబంధం కలిగి ఉంది.

మూడవ మెట్టు జగన్నాథ ఆలయ రహస్యం..

మొత్తం 22 మెట్లు ఉన్నాయి.  వాటిలో మూడవ మెట్టు ప్రత్యేక పవిత్రతను కలిగి ఉంది.  దీనిని యమ శిల అని పిలుస్తారు . పౌరాణిక నమ్మకం ప్రకారం, ఒకసారి యమధర్మరాజు జగన్నాథుడిని కలవడానికి వచ్చాడు. అప్పుడు యమధర్మరాజు ఒక మాట చెప్పాడు.  అదేంటంటే.. ఈ ఆలయాన్ని సందర్శించేవాడు యమలోకానికి వెళ్లవలసిన అవసరం లేదు" అని  యమధర్మరాజే చెప్పాడు. యమధర్మరాజుకు ప్రాధాన్యత ఇస్తూ 22మెట్లలో మూడవ మెట్టుకు యమ శిల అనే పేరును జగన్నాథుడే సార్థకం చేశారని చెబుతారు.

మూడవ మెట్టు మీద అడుగు పెట్టకూడదనే నియమం ఎందుకుందంటే..

జగన్నాథుని దర్శనం చేసుకున్న తర్వాత ఈ మూడవ మెట్టు మీద అడుగు పెట్టే ఏ భక్తుడి పాపాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయట.  కానీ నేటి కలియుగంలో ఉన్న మానవ స్వభావం వల్ల మనిషి చేసే పాపాలు కర్మానుసారం ఖచ్చితంగా అనుభవించాల్సిందే.. చేసిన పాపాలకు అనుగుణంగా యమలోకానికి అయినా వెళ్లాల్సిందే..  అందుకే ఏ భక్తుడు లేదా పూజారి కూడా  మూడవ మెట్టు మీద అడుగు పెట్టకూడదని ఆలయంలో ఒక నియమం చేశారు.

                                   *రూపశ్రీ.