Antera Bamardee 20
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy
అంతేరా బామ్మర్దీ 20
బసవరాజు ఆఫీసు గది అది. ఇప్పుడు ఆ గదిలో వేణు కూడా వున్నాడు.
బసవరాజు మనస్పూర్తిగా వేణుని అభినందిస్తున్నాడు.
" కేవలం సర్టిఫికెట్లు మాత్రమే కాదు. నీ సమాధానాలు కూడా నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కుర్రాళ్ళంతా నీ మాదిరి చాకుల్లాగా వుండాలి " అని.
" థేంక్యూ సార్ " అన్నాడు వేణు.
బవసరాజు నొచ్చుకుంటూ అన్నాడు " వద్దు ! నేనే నీకు థేంక్యూ చెప్పాలి. మంచి సెక్రటరీ కోసం వెతుకుతున్నాం. ప్రకటన కూడా చేసేం. ఎవరెవరో వచ్చేరేగాని వచ్చిన వాళ్ళు నాకు నచ్చలేదు. నువ్వు నచ్చావు " అని.
ఆ మాట మీద ఆ గదిలోకి పాణి వచ్చేడు. అతని చేతిలో ఒక కాగితం ఉంది. ఆ కాగితాన్ని బసవరాజు చేతికి ఇచ్చాడు. బసవరాజు ఆ కాగితం మీద సంతకం చేసేడు.
ఆ కాగితాన్ని వేణుకిస్తూ అన్నాడు " ఇది నీ అప్పాయింట్మెంట్ ఆర్డరు " అని.
" థేంక్యూ " అన్నాడు వేణు ఆద్రారు తీసుకుంటూ.
" ఇవాళే ఇప్పుడే డ్యూటిలో జాయినవుతున్నావు. " అన్నాడు బసవరాజు.
వేణు కొంచం సంశయిస్తున్నట్టు కనిపించేడు.
" ఏమైనా అడగదలుచుకుంటే అడుగు " అన్నాడు బసవరాజు.
" ఇప్పుడు జాయినవ్వడానికి నాకేం అభ్యంతరం లేదనుకోండి. జాయినయ్యే ముందు మా పెద్దవాళ ఆశీస్సులు తీసుకోవాలనుకుంటున్నాను." అని చెప్పాడు వేణు.
" మంచి ఆచారం. మీ వాళ్ళు ఏ ఊళ్ళో వున్నారు ?" అని అడిగాడు బసవరాజు.
" ఈ ఊళ్లోనే వున్నారు " అని చెప్పాడు వేణు.
" అయిసీ...మీ నాన్నగారి పేరు ?"
" నాన్నగారు లేరు.నా చిన్నప్పుడే పోయేరు "
" అయిసీ. తల్లి చేతుల్లో పెరిగావన్నమాట. అందుకే ఇంత బ్రిలియంట్ వయ్యేవు " అన్నాడు బసవరాజు.
" సారీ! నాకు తల్లి కూడా లేదు. నాన్నపోయిన షాక్ తో ఆవిడ కూడా పోయేరు "
" అయ్యయ్యే..మరి "
" దేవతలాంటి అక్కయ్యా దేవుడి లాంటి బావగారూ వున్నారు. వాళ్ళే నను పెంచి పెద్ద చేసేరు " బావగారు అనే మాట వినగానే పాణికి ఏదో పాయింటు గుర్తుకు వచ్చి చెంప సవరించుకున్నాడు.
" బావగారా ? అంటే " అని అన్నాడు పాణి. పాణి పాయింట్ ఏమిటో గ్రహించిన బసవరాజు, పాణిని సముదాయించే ప్రయత్నంలో అన్నాడు.
" మనకి తెలిసిన బావగారు కాదులే! ఆ బావగారికి ఇల్లాంటి బామ్మర్దీ వుండడు. వుండటానికి వీల్లేదు. అంచేత ఖంగారు పడకు. చూడు మిస్టర్ వేణూ మీ బావగారి పేరేమిటి ?" అని అడిగాడు బసవరాజు.
" రంగనాథం " అని చెప్పాడు వేణు.
"ఆ " అని నోరు తెరిచాడు బసవరాజు. అది ఆసరాగా తీసుకుని పాణి రేచ్చిపోతున్నాడు.
" నాకు డవుటు రానే రాడు సార్! వస్తే మాత్రం అది ఖచ్చితంగా ఫేక్టే అవుతుంది. మిస్టర్ వేణూ మీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వు " అన్నాడు పాణి,
" ఎందుకు ?" అని బసవరాజు అడిగాడు.
" చింపి పారేద్దాం సార్ .ఇతను మీ ఫ్రండుకి బామ్మర్దీ " అన్నాడు పాణి.
" ఆఫ్ కోర్స్ ..అయితే ?"
" ఒక్కసారి మలయాళం వార్తా గుర్తు తెచ్చుకోండి సార్. గట్టిగా జ్ఞాపకం తెచ్చుకోండి " అని చెప్పాడు పాణి.
" తెచ్చుకున్నా "
" మరింకే ? ఆ ఆర్డర్ చింపమంటారా?"
" అక్కర్లేదు "
" సార్...కొచ్చిన్లో కుట్టిని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి సార్ " అని గుర్తు చేశాడు పాణి.
" తెచ్చుకున్నా "
" థేంక్యూ సార్ "
" అయినా సరే..ఆర్డరు చించవద్దు "
" సార్ "
" నా దగ్గరకి వచ్చింది ఖూనీకోరు కుట్టిగాడు కాదు.సాక్షాత్తు కేండిడేటే వచ్చేడు. వచ్చినవాడు నచ్చేడు. నచ్చేడు గనుక ఉద్యోగం ఇచ్చాను అర్థమైందా ?" అన్నాడు బసవరాజు.
" అర్థమైంది సార్! మీరట్లా వస్తారనుకోలేదు "
" ఈ పాయింట్లో మాత్రం అట్లాగే వస్తాను ! వచ్చేసేను!దట్సాల్. ఇంక మాటాడకు.మిస్టర్ వేణూ "
" క్షమించాలి " వేణు నీళ్ళు నముల్తూ అన్నాడు,
" నాకిచ్చిన అపాయింట్మెంట్ ఆర్దర్ని పానిగారు ఎందుకు చించాలని ముచ్చటపడుతున్నారో, మీరు ఎందుకు వద్దంటున్నారో, కొచ్చిన్లో నాయరెవ్వరో, కుట్టి ఎవరో, వారికి నాకూ లింకేమిటో అసలు అర్థం కావటం లేదు. " అని.
బసవరాజు వేనుని సముదాయించాడు. " నీకనవసరమైన విషయాలు అర్థం కాకపోవడమే మంచిది. రేపటి నుంచి డ్యూటీలో జాయినవ్వు.ఒకే " అని.
వేణు థేంక్యూ చెప్పి ఆ గది నుండి బయటపడుతూ పాణికి కూడా థేంక్యూ చెప్పేడు.
వేణు వెళ్ళిన తరువాత, క్షణం గడిచాక పాణిని బసవరాజు పలకరించాడు.
ఇంకావుంది
హాసం సౌజన్యంతో