Antera Bamardee 12
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
*******************************************************************
అంతేరా బామ్మర్దీ - 12
“అమ్మో !ఫ్రండు !బెస్ట్ ఫ్రండు !ఈ ఫ్రండుకి ఉద్రేకం కూడా హెచ్చు స్థాయిలోనే వుంది "లోనలోన గొణుక్కున్నాడు.
“ఏమిటి గొణుక్కుంటున్నావు ?”
“క్షమించాలి "
“ఇంకోతడవ ఆ ముక్కంటే, నీ ముక్కు పచ్చడిచేస్తా!తప్పుకో "
“పనేమిటో చెప్పకుండా మీరు లోపలికి దూరిపోతే, నన్ను బయటికి పొమ్మంటాడు బాసు.దట్ మీన్స్...నా ఉద్యోగం ఊడిపోతుంది "
ఉద్యోగం ఊడిపోతుందనే మాట వినగానే రంగనాథం కొంచెం చల్లబడ్డాడు.తనవల్ల ఇతరుల ఉద్యోగాలు ఊడిపోవడం ధర్మం కాదు గనక, కోపం తగ్గించుకుని తాపీగా అన్నాడు.
“ఈ మాట ముందే చెప్పి చావచ్చుగా గదా !నీ ఉద్యోగం ఊడగొట్టి నీ ఉసురు నేనెందుకు పోసుకోవాలి.? వెళ్ళు...వెళ్లి వాడితో చెప్పు "అని.
“ఏవని చెప్పను ?”
రంగనాథానికి కోపం రాకపోయినా విసుగొచ్చింది.అంచేత విసుగ్గానే అన్నాడు. “పాయింటుని ఊకే లాగమాకు !మీ ఫ్రండోచ్చేడని చెప్పు !”
“పేరడిగితే ?”
“సింగినాదమని చెప్పు "
ఆ పేరు విని ఆశ్చర్యపోతూ అన్నాడు పాణి.
“సింగినాదమా?ఈ పేరోదో కొత్తగా వుందే ?”అని.
అప్పుడు రంగనాథానికి మళ్ళా కోపం వచ్చింది.
“వంకలు పెట్టేవంటే నరుకుతా!బసివిగాడంటే ఎవడని అడిగేవ్ ?వదిలేసా !సింగినాదమని చెబుతే పేరేక్కడా వినలేదే అని బిక్కమొహం పెడుతున్నావ్! ఖబడ్దార్ !నా అసలు పేరు రంగనాథం.బసివి గాడు నన్ను సింగినాదమనే పిలుస్తాడు !”అన్నాడు.
“ఇప్పుడు అర్థమైంది సార్ " అన్నాడు పాణి.
“ఏమర్థమైంది ?”
“మా బాసుకి మీరెంత మంచి ఫ్రండో బాగా అర్థమైంది "
“అదీమాట !”
“తమరిక్కడే వెయిట్ చేయండి.ఇప్పుడే వస్తా !” అని పాణి బసవరాజు గారి గదిలోకి పారిపోయేడు. వెయిట్ చేయమని వెళ్లిపోయాడే గాని,కూచుని వెయిట్ చేయమన్నాడో నిలబడి నిరీక్షించమన్నాడో చెప్పనందుకు రంగనాథం చిరాకు పడ్డాడు. అందువల్ల అతను అటు నిలబడకుండా ఇటు కూచోకుండా, ఆ వరండాలో పచార్లు చేస్తున్నాడు.
బసవరాజు గదిలో...వెనక్కి చూసుకుంటూ ఖంగారుగా వచ్చి తూలిపడబోయి, నిలదొక్కుకున్న పాణి వైఖరిని గమనించిన బసవరాజు "ఏమిటా ఖంగారు ?” అని అడిగాడు.
“అయిపొయింది సార్.అంతా అయిపొయింది "
“ఏమైంది ?”
“నేను అనుకున్నంతా అయింది.మిమ్ముల్ని చూడటానికి మీ ఫ్రండు,ప్రాణ మిత్రుడు ఒకాయన వచ్చేడు "
“ప్రాణా మిత్రుడా ?” ఆశ్చర్యంగా అన్నాడు బసవరాజు.
(ఇంకావుంది)
హాసం సౌజన్యంతో