Read more!

తం సూర్యం ప్రణమామ్యహం

 

 

 

తం సూర్యం ప్రణమామ్యహం

 

లోకాన్నంతా తన కిరణాలతో చైతన్యవంతులని చేసే సూర్యుడు మాఘమాసం,శుక్ల పక్షం అశ్వనీ నక్షత్రయుక్త ఆదివారం, సప్తమి తిథిన దక్ష ప్రజాపతి పుత్రికయైన అదితి, కశ్యప మహర్షికి ‘వివస్వంతుడు’ అనే పేరున జన్మించాడు. అదితి, కశ్యపులకు పుత్రుడైనందున సూర్యుడిని ఆదిత్యుడు, కశ్యపుడు అని కూడా వ్యవహరిస్తారు.'సూర్య' అనే పదానికి 'ప్రేరేపించువాడు' అని అర్థము. చరాచర జగత్తు అంతా ప్రేరణ పొందేది, తమతమ కర్తవ్యాలను నిరాటంకంగా నిర్వహించే శక్తిని గ్రహించేదీ  సూర్యుని ఉనికి ప్రత్యక్షంగా ఉన్నప్పుడే. అందుకే సూర్యుడిని 'కర్మసాక్షి' అని అంటారు. సూర్యుని భార్య విశ్వకర్మ కుమార్తె అయిన సంజ్ఞ  . ఈమె యందు సూర్యునికి వైవస్వత మనువు, యమున - యముడు అనే కవలలు జన్మించారు. శనీశ్వరుడు కూడా సూర్యుని కుమారుడే అని శాస్త్రాలు చెపుతున్నాయి.

సూర్యుని నుంచి వచ్చే సుఘమ్నము, హరికేసము, విశ్వకర్మ, విశ్వరచన, సందస్వుడు, అర్వాగ్వసు, స్వరాడ్వసు, అనే ఏడూ కిరణాలు మన శరీరంలో ప్రవేశించి అనారోగ్యాలు మన దరికి రాకుండా ఎల్లప్పుడూ మనని కాపాడుతూ ఉంటాయని మన వేదాలు చెపుతున్నాయి. అందుకేనేమో పుట్టిన పిల్లల నుంచి పెద్దవారి దాకా ఎవరైనా సూర్యోదయం అయిన తరువాత వచ్చే కిరణాల వేడిలో ఒక 10 నిమిషాలు నుంచున్న ఒంటికి కావాల్సిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయని వైద్య శాస్త్రం కూడా నిర్ధారించింది.

రథసప్తమి ప్రత్యేకత

 

 

రథసప్తమి రోజు సూర్యుడు, ఏడు గుర్రాలతో అరుణుడు నడిపే తన రథం ప్రయాణించే దిశను మార్చుకుంటాడట. ఈ రోజు నుంచి సూర్యుడు భూమికి దగ్గరగా తిరగటం ప్రారంభించటం వల్ల ఎండలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మరో ప్రత్యేకత శ్రీకాకుళం దగ్గరి అరసవిల్లిలో ఈ మాఘమాస సప్తమి రోజు సూర్యకిరణాలు గర్భగుడిలో ఉండే మూలవిరాట్టు పాదాల మీద నేరుగా వచ్చి పడతాయట. ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అలాగే ఇదే రోజు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఉదయంపూట సూర్యప్రభ వాహనం మీద తిరువీధి తిప్పుతారట. కోణార్క్ లోని సూర్యదేవాలయంలో కూడా విశేష పూజలు నిర్వహిస్తారట.

ఇంతేకాదు ఆడవాళ్ళు చేసే ఎన్నో రకాల నోములని రథసప్తమి నాడే అంకురార్పణ చేసి మొదలుపెట్టుకుంటారు కూడా.ఈ రోజు ఎవరైతే నువ్వులనూనె ఒంటికి రాసుకుని,జిల్లేడు ఆకులతో సూర్యోదయానికి ముందే స్నానం చేస్తారో వారికి పరిపూర్ణ ఆరోగ్యం సిద్దిస్తుందని ఓ నమ్మకం. ఎర్రగా నిప్పులు చెలరేగుతున్నాయా అనేంత ప్రకాశవంతంగా  వెలిగిపోయే దివాకరుడికి ఎరుపు పువ్వులతో పూజ చేస్తే ప్రీతి చెండుతాడట. ఈ రోజు ఆదిత్య హృదయం చదివా ఎంతో శ్రేయస్కరం.

అరుణుడిని తన రథసారథిగా పెట్టుకున్న సూర్యుడిని దినకరుడు, సప్తాస్వరూడుడు, ఆదిత్యుడు, భాస్కరుడు, దివాకరుడు, తేజసుడు, రవి ఇలా ఎన్నో పేర్లతో స్తుతిస్తారు భక్తులు. సూర్యనమస్కారాలు చేసినంత మాత్రాన్నే ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యునికి శతకోటి వందనాలు. సకల జీవరాశికి తన కిరణాలతో ఎన్నో రకాల శక్తులని(energies) వాటి ద్వారా ఎన్నో ప్రయోజనాలని చేకూర్చే తేజోమూర్తికి హృదయపూర్వక కృతజ్ఞతని ప్రతీ రోజు తెలుపుకుంటూనే ఉండాలి.

                                                                                                                                                                                                                         

...కళ్యాణి