Read more!

విజయం కావాలన్నా, కష్టాలు తీరాలన్నా… విజయ ఏకాదశి!

 

విజయం కావాలన్నా, కష్టాలు తీరాలన్నా… విజయ ఏకాదశి!


 

హైందవ సంప్రదాయం ప్రకారం ప్రతి పదిహేను రోజులకు ఓసారి వచ్చే ఏకాదశిని రోజున ఉపవాసం చేయడం ఆచారం. దీని వెనుక శాస్త్రీయమైన కారణాలు కూడా కనిపిస్తాయి. ప్రతి రెండు వారాలకు ఓసారి ఉపవాసం ఉంటే మంచిదని ఆధునిక వైద్యులు సైతం చెబుతున్నారు. దీని వల్ల ఒంట్లో ఉండే కొవ్వు కరగడం మాత్రమే కాదు… జీర్ణవ్యవస్థ తనని తాను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. మనకు మేలు చేసే ప్రొబయాటిక్‌ వృద్ధి చెందుతుంది. ఇంత ఆరోగ్యకరమైన ఉపవాసానికి భక్తి కూడా తోడైతే ఇక చెప్పేదేముంది. అలాంటి ఓ అరుదైన సందర్భమే విజయ ఏకాదశి. అది ఈ ఏడాది 26న వస్తోంది. 

రామాయణంలో… సీతమ్మను వెతుకుతున్న శ్రీరాముడు, ఆమెను లంకలో ఉంచినట్టు తెలుసుకుంటాడు. తన సోదరులు, శ్రేయోభిలాషులు, వానరులతో కలిసి భరతఖండపు తీరానికి చేరుకుంటాడు. కానీ అక్కడి నుంచి లంకను చేరుకోవడం ఎలాగో తోచదు. అలాంటి సమయంలోనే ఏకాదశి తిథి వస్తుంది. ఆ రోజు దీక్షగా ఉపవాసం చేస్తుండగా, నీళ్లలో తేలాడే రాళ్లతో వారధి నిర్మించవచ్చే ఉపాయం తడుతుంది. అప్పటి నుంచీ ఈ రోజును విజయ ఏకాదశిగా భావిస్తున్నారు. 

మన రోజువారీ జీవితం కూడా ఓ రామాయణమే! ఎప్పటికప్పుడు ఏదో ఒక సవాలునో, సమస్యనో ఎదుర్కొంటూ ఉంటాం. వాటిని దాటాలంటే ఉపాయంతో పాటు దైవానుగ్రహం కూడా అవసరమే. విజయ ఏకాదశి రోజున మనకు ఉన్న కష్టాలను తల్చుకుని, వాటిని గట్టెక్కించమంటూ దైవాన్ని వేడుకుంటే… తప్పకుండా ఫలితం దక్కుతుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని దశమి నాటి రాత్రి నుంచే మొదలుపెట్టాలి.

 
దశమి నాటి రాత్రి ఉపవాసం ఉండి… ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలార స్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించుకోవాలి. ఆ రోజంతా కూడా ఏ పని చేస్తున్నా భగవన్నామ స్మరణ విడువకూడదు. ఏకాదశి రాత్రివేళ వీలైతే జాగరణ చేయాలి. ఆ సమయంలోనూ దైవ స్మరణ చేస్తుండాలి. 

మనిషి జీవితం ముందుకుసాగేందుకు ఆహారం, నిద్ర, మైధునం… ఉపయోగపడతాయి. అదే సమయంలో వాటికి లోబడిపోవడం పతనానికి, అనారోగ్యానికి దారి తీస్తుంది. పైగా ఇవి శరీర సంబంధమైనవి. అందుకు అతీతమైన మానసిక అవస్థను చేరుకోవాలంటే… వాటి మీద అదుపు తప్పదు. అందుకే నిద్రాహారాల బదులుగా మనసును భగవంతునిపై మళ్లించే ప్రయత్నం చేస్తుందీ ఉపవాసం. సంవత్సరంలో ఉన్న ప్రతి ఏకాదశికీ ఒకో ఫలితం ఉంటుంది. అలా విజయ ఏకాదశి రోజున ఉపవాసం చేసినవారి కష్టాలు తీరిపోతాయనీ, పాపాలు దగ్ధం అయిపోతాయనీ, విజయం లభిస్తుందనీ పెద్దలు చెబుతారు!