Read more!

వాస్తవాన్ని సమాజానికి స్పష్టం చేసిన మధ్వాచార్యులు!!

 

వాస్తవాన్ని సమాజానికి స్పష్టం చేసిన మధ్వాచార్యులు!!

భారతీయ సంప్రదాయ సిద్ధాంత వాదులలో ఎందరో ఉన్నారు. హిందూధర్మాన్ని దాని వైశిష్ట్యాన్ని అందరికీ తెలియజెప్పిన మహానుభావులు ఉన్నారు. హిందూమతం గురించి చెప్పడం, రాయడం అనేది లోకవిరుద్దం ఏమీ కాదు, దీని పట్ల వ్యతిరేకత ఎవరూ వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఒక హిందువు తన మత పూర్వపరాలు తెలుసుకోవడంలో తప్పు లేదు. ఒక ముస్లిం తన మత చరిత్రను, వారు బోధించిన సిద్ధాంతాలను ఎట్లా భక్తిపూర్వకంగా అనుసరిస్తారో అట్లాగే ప్రతి హిందువు తన మతం గురించి తెలుసుకోవచ్చు. ఇకపోతే భారతదేశంలో అద్వైత సిద్ధాంతం అని, ద్వైత సిద్ధాంతం అనీ, విశిష్టాద్వైతం అనే ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. అట్లాంటి హిందూమతం గురించి ఒక సత్యమైన వాదనను వినిపించి, సమాజహితమైన విషయాలను సమర్థించివారు మధ్వాచార్యులు. 

శ్రీ మధ్వుల కాలం నాటికే క్రైస్తవ మిషనరీలు ఉధృతంగా మత ప్రచారం చేస్తూ మత మార్పిడిలు చేస్తున్నారు. దీనికి తోడు తురుష్కుల దండయాత్రలలో వారి దౌర్జన్యం, హింస వర్ణనాతీతం. ఈ పరిస్థితులలో ఒక బలమైన మత విశ్వాసం ప్రజలలో కలిగించి, వారికి కూడా తమకంటె వేరైన, ఆర్తిలో రక్షించే, సగుణ సాకార దైవం ఉన్నాడని, ఆయన మీద భక్తి తమను కాపాడుతుందనే విశ్వాసం కలిగించాలి. ఇలాంటి విశ్వాసం వేద విహితమైనదే గాని వేద బాహ్యం కాదు, నిర్గుణ, నిరాకార బ్రహ్మోపాసన బలమైన సామూహిక మత విశ్వాసాన్ని, అవసరమైన ప్రతిఘటనా భావాలను కలిగించలేదు. 

బాల గంగాధర తిలక్ సామూహిక వినాయక ఉత్సవాల ద్వారా  హిందూమత ఐక్యతకు దోహదపడ్డారన్నది అక్షర సత్యం. దాన్ని ఇప్పుడు అనేక చోట్ల నిర్వహిస్తున్నారు. మతం ప్రమాదంలో పడినప్పుడు, ధ్యానం పనికి రాదు. పరమాత్మమీద అచంచల భక్తితో ముందుకు సాగాలి. భక్తి మాత్రమే ఈ ఆవేశాన్ని ఐక్యతను కలుగజేస్తుంది గాని జ్ఞానం మాత్రం కాదు. జ్ఞానమార్గం ఒక వ్యక్తికి పరిమితమౌతుంది. భక్తిమార్గం సమాజాన్ని ఏకంచేసి సామూహికంగా ఉత్సవాలను నిర్వహించడం ద్వారా సమాజాన్ని మతపరంగా ఐక్యం చేస్తుంది. శ్రీ మధ్వులు సమకాలీన పరిస్థితులలో ఈ ఐక్యత చాలా అవసరం అని గుర్తించి ఉండవచ్చు. వేదాన్ని పరమ ప్రమాణంగా గ్రహించిన ఆయన పురాణేతి హాసాలు మీద ఎక్కువగా ఆధారపడి, వీటిమధ్య సమన్వయం తీసుకు రావడానికి భారత, భాగవత, భగవద్గీతల మధ్య తాత్పర్య నిర్ణయ గ్రంథాలను రచించారు. యజ్ఞాలలో పశుబలిని నిషేధించారు. ఇలా వేద విహితమైన, బలమైన సిద్ధాంతాన్ని ప్రవచించి హిందూ సమాజాన్ని బలమైన శక్తిగా మార్చడం ఎంతైనా అవసరం అని గుర్తించారు.

 అయితే ఆయన మానవుని ఆధ్యాత్మిక ప్రగతికి, నైతిక ప్రవర్తనకి కూడా భక్తిమార్గమే ఏకైక మార్గం అని బోధించారు. అందుచేత ఆయన ఒక నవీనమైన, సృజనాత్మకమైన సిద్ధాంతాన్ని సృజించి అనూహ్య విజయం సాధించారు. భక్తిమార్గం, జ్ఞానమార్గానికే విధంగాను తీసిపోదని, నిజానికి భక్తిమార్గమే సామాన్య జనులకు అనుసరణీయమైన ఏకైక మార్గమని, అదే సమాజాన్ని ఇతర మతాల దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సమాయత్త పరస్తుందని ఆయన దృఢ నిశ్చయం. వీరి కృషి ఫలితం పురందరదాసు వంటి వారు సృష్టించిన దాససాహిత్యం, వల్లభాచార్యుల వారి కృష్ణభక్తి, చైతన్య మహాప్రభు వంటి మహాభక్తుల కృష్ణతత్వ ప్రచారం- ఇదంతా భక్తిని హిందూమత సమైక్యతను సాధించాయి. ఇది సామాన్యమైన విజయం కాదు.

పై విషయం అంతా చదివిన తరువాత ఏ మతం అయినా ఒక సిద్ధాంతాన్ని, ఒక మార్గాన్ని ఎంచుకోవడంలో కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేయడమనే ఉద్దేశం ఉంటుందని అందరూ అర్థం చేసుకోవాలి. అంతేకానీ మతాన్ని అందులో బోలెడు విషయాలు విభిన్న వాదనలు ఉన్నాయని విమర్శించకూడదు.

◆ వెంకటేష్ పువ్వాడ